ఎంత స‌క్క‌గుందో.. దేవీ పాడితే

ఈ రోజుల్లో పాట‌లంటే ఎలా ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందులో లిరిక్స్ కోసం గూగుల్లో వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి. మ్యూజిక్ మ‌ధ్య పాట న‌లిగిపోతుంది. మ‌ధ్య‌లో ప‌దాలు వినిపించ‌డం లేదు. అలాంటి వాటి మ‌ధ్య అచ్చ‌మైన తెలుగు పాట‌ను మ‌ళ్లీ మ‌నకు అందించాడు సుకుమార్. ఈయ‌న తెర‌కెక్కిస్తోన్న రంగ‌స్థలంలోని తొలిపాట ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఎంత స‌క్క‌గున్నావే అంటూ సాగే ఈ పాట‌ను దేవీ శ్రీ ప్ర‌సాద్ పాడాడు.. చంద్ర‌బోస్ అచ్చ‌మైన తెలుగు ప‌దాలతో కూర్చాడు. ఈ పాట విన్న త‌ర్వాత రంగ‌స్థ‌లం ఎంత స్వ‌చ్చంగా ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది. త‌న మ‌న‌సులోని రామ‌ల‌క్ష్మిని పొగుడుతూ చిట్టిబాబు పాడే ఈ పాట సినిమాలో ఖచ్చితంగా హైలైట్ అవుతుందంటున్నాడు సుకుమార్. మా చిట్టిబాబు.. రామ‌ల‌క్ష్మిలు మీ మ‌నసు దోచేస్తారంటున్నాయన‌.

ఎంత స‌క్క‌గున్నావే పాట‌కు కూడా అన్ని వైపుల నుంచి అద్భుత‌మైన రెస్నాన్స్ వ‌స్తుంది. చాలా రోజుల తర్వాత మంచి తెలుగు అర్థాలున్న పాట విన్నామ‌న్న తృప్తి చాలా మందికి క‌లుగుతుంది. దీనికి చంద్ర‌బోస్ కూడా ఓ కార‌ణం. యేరుసెన‌గ కోసం మ‌ట్టి త‌వ్వితే అనుకోకుండా చేతికి దొరికిన లంకెబిందెలాగా ఎంత స‌క్క‌గున్నావే అంటూ మొద‌ల‌య్యే ఈ పాట అమ్మ‌లోని క‌మ్మ‌దనాన్ని గుర్తు చేస్తుంది. దేవి గిటార్ స్ట్రింగ్స్ ఇందులో మరో అద్భుతం. మొత్తానికి ఈ పాటే ఇలా ఉంటే మిగిలిన పాట‌లు ఇంకెలా ఉండ‌బోతున్నాయో..? మార్చ్ 30న రంగ‌స్థ‌లం విడుద‌ల కానుంది.

User Comments