rangula ratnam telugu movie review ర‌ంగుల రాట్నం రివ్యూ

ర‌ంగుల రాట్నం రివ్యూ

rangula ratnam telugu movie review

రివ్యూ: ర‌ంగుల రాట్నం

న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్, చిత్రాశుక్లా, సితార త‌దిత‌రులు

ద‌ర్శ‌కురాలు: శ్రీ‌రంజ‌ని

రాజ్ త‌రుణ్ ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన నిర్మాత నాగార్జున‌. ఉయ్యాలా జంపాల త‌ర్వాత మ‌ళ్లీ ఈ కాంబినేష‌న్ లో ఇంకో సినిమా వ‌చ్చింది. అదే రంగుల రాట్నం. అది కూడా సంక్రాంతికి రావ‌డంతో అంచ‌నాలు బాగానే పెరిగిపోయాయి. మ‌రి నిజంగానే ఈ సినిమా రాజ్ త‌రుణ్ కు మ‌రో విజ‌యం అందించిందా..?

క‌థ‌: 

విష్ణు(రాజ్ త‌రుణ్) సొంతంగా ఓ చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ న‌డిపిస్తుంటాడు. త‌న‌కు అమ్మే(సితార‌) లోకం. ఆమెతోనే అన్నీ షేర్ చేసుకుంటాడు. విష్ణుకు ఎలాగైనా పెళ్లి చేయాల‌ని వాళ్ల అమ్మ ప్ర‌య‌త్నిస్తుంటుంది. అలాంటి స‌మ‌యంలో విష్ణు జీవితంలోకి కీర్తి(చిత్రాశుక్లా) వ‌స్తుంది. చూడ‌గానే ప్రేమ‌లో ప‌డిపోతాడు. అన్నీ కుదిరి పెళ్లికి కూడా ఓకే అనుకునే లోపు విష్ణు వాళ్ల అమ్మ చ‌నిపోతుంది. అదే స‌మ‌యంలో ప్రేమించిన కీర్తి కూడా త‌న‌ను వ‌దిలేసి వెళ్లిపోతుంది. అస‌లు అమ్మ చ‌నిపోయిన త‌ర్వాత ఏమైంది.. ఎందుకు అంత‌గా ప్రేమించిన కీర్తి విడిపోతుంది..? అనేది మిగిలిన క‌థ‌..

క‌థ‌నం: 

ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా నాన్న సెంటిమెంట్ తో సినిమాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు అమ్మ సెంటిమెంట్ తో రంగుల రాట్నం వ‌చ్చింది. దానికే అమ్మాయి ప్రేమ‌ను క‌లిపారు ద‌ర్శ‌కురాలు. అమ్మ ప్రేమ‌ను.. అమ్మాయి ప్రేమ‌ను చూపిస్తూ సాగుతుంది ఈ చిత్ర క‌థ‌నం. ముందు నుంచీ అమ్మ ఏమ‌న్నా కూడా ప‌ట్టించుకోం.. కానీ అదే గాళ్ ఫ్రెండ్ గానీ పెళ్లాం కానీ ఏమైనా అంటే టార్చ‌ర్ లా ఉంటుంది.. ఇదే చిత్ర క‌థ‌. ఎలాంటి మ‌లుపులు లేకుండా ఫ్లాట్ గా సాగిపోతుంది రంగుల రాట్నం క‌థ‌. హీరో లైఫ్ మొద‌ల‌వ్వ‌డం.. అమ్మ‌తో సెంటిమెంట్ సీన్స్.. అమ్మాయిని చూడ‌టం.. ప్రేమ‌లో ప‌డ‌టం.. ఆమె ఈవెంట్ మేనేజ‌ర్ గా ప‌ని చేస్తుంద‌ని తెలుసుకుని ఆమె కోసం ఏవేవో పార్టీలు పెట్ట‌డం.. అందులో త‌న ప్రేమ కోసం పాకులాడ‌టం.. ఇలాంటి సీన్స్ చాలా సినిమాల్లో ఇప్ప‌టికే చూసాం. రంగుల రాట్నంలో కొత్త‌గా ఇవేం క‌నిపించ‌వు. దానికితోడు క‌థ కూడా చాలా నెమ్మ‌దిగా సాగుతుంది. ఇంట‌ర్వెల్ కు ట్విస్ట్ ఉండాలి కాబ‌ట్టి అమ్మ కారెక్ట‌ర్ కు తెర దించేసారు. ఆ ఒక్క సీన్ మాత్రం సినిమాలో చాలా బాగా పండింది. అమ్మ చ‌నిపోయిన సీన్ లో రాజ్ త‌రుణ్ బాగా న‌టించాడు.

మంచి సెంటిమెంట‌ల్ సీన్ తో ఇంట‌ర్వెల్ ప‌డినా.. సెకండాఫ్ లో మాత్రం క‌థ మ‌ళ్లీ పాత ట్రాక్ లోనే వెళ్తుంది. ప్రేమ‌ను ఒప్పుకున్న హీరోయిన్.. త‌ను ప్రేమించిన వాళ్లు ఎక్క‌డ దూర‌మైపోతారో అనే భ‌యంతో హీరోను దూరం పెట్ట‌డం అనేది అంత సాటిస్ ఫైయింగ్ గా అనిపించ‌దు. త‌ర్వాత మ‌ళ్లీ ఈజీగా క‌లిసిపోవ‌డం.. ఇలా క‌న్ఫ్యూజింగ్ గా సాగుతుంది క‌థ‌. ఇక హీరోయిన్ ప్రేమ ఒప్పుకున్న త‌ర్వాత వ‌చ్చే ఆమె అతిప్రేమ సీన్స్ అన్నీ న‌వ్వు తెప్పిస్తాయి. చివ‌రికి హీరోయిన్ చూపించే ప్రేమ‌.. అమ్మ ప్రేమ‌తో స‌మానం అని చిన్న మాంటేజ్ షాట్స్ వేసి ప్రేక్ష‌కుల‌కు జ‌డ్జిమెంట్ వ‌దిలేసింది ద‌ర్శ‌కురాలు.

న‌టీన‌టులు: 

గ‌త సినిమాల‌తో పోలిస్తే రాజ్ త‌రుణ్ బాగా చేసాడు. అత‌డి త‌ర‌హా ఓవ‌ర్ యాక్ష‌న్ సీన్స్ ఏవీ ఇందులో లేవు. చాలా సెటిల్డ్ గా క‌నిపించాడు. ఇక చిత్రాశుక్లా సినిమా అంతా ఒక‌టే ఎక్స్ ప్రెష‌న్ క్యారీ చేసింది. హీరో త‌ల్లిగా సితార చాలా బాగా న‌టించింది. ఆమె ఉన్న సీన్స్ బాగానే వ‌ర్క‌వుట్ అయ్యాయి. హీరో ఫ్రెండ్ గా ప్రియ‌ద‌ర్శి చాలా వ‌ర‌కు న‌వ్వించాడు. ఆయ‌న సీన్స్ బాగున్నాయి. మిగిలిన వాళ్లంతా ఇలా వ‌చ్చి అలా వెళ్ళిపోయే బ్యాచ్.

టెక్నిక‌ల్ టీం: 

శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతం ప‌ర్లేదు. ఆర్ఆర్ జస్ట్ ఓకే. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింట్ బాగానే అనిపించింది. కానీ కొన్ని సీన్స్ చాలా స్లోగా వెళ్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. విజ‌య్ సినిమాటోగ్ర‌ఫీ ఓకే. ఆయ‌న‌కు ఉన్న బ‌డ్జెట్ లో చాలా చ‌క్క‌టి ఔట్ పుట్ ఇచ్చాడు. ద‌ర్శ‌కురాలు శ్రీ‌రంజ‌ని క‌థ విష‌యంలో అప్ డేట్ కాలేదు. చాలా సార్లు చెప్పిన క‌థ‌నే మ‌ళ్లీ ఎంచుకుంది. దానికి తోడు గురువు సెల్వ రాఘ‌వ‌న్ స్టైల్ ఎక్కువ‌గా క‌నిపించింది ఈ చిత్రంలో. మొత్తంగా రంగుల రాట్నం ఈమెకు డ్రీమ్ డెబ్యూ అయితే కాదు.

చివ‌ర‌గా:  ఈ రంగుల రాట్నం.. నెమ్మదిగా తిరుగుతుంది..

రేటింగ్: 2.75/5

ర‌ంగుల రాట్నం రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)