రివ్యూ: డిస్కోరాజా

నటీనటులు: రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభ నటేష్, తాన్య హోప్, బాబీ సింహా, రాంకీ, సునీల్, నరేష్ తదితరులు.

సాంకేతికవర్గం:

ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని,

మాటలు: అబ్బూరి రవి,

సంగీతం: తమన్,

నిర్మాత: రామ్ తాళ్లూరి,

దర్శకత్వం: వి.ఐ.ఆనంద్,

సంస్థ: ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్

విడుదల: 24 జనవరి 2020

ముందుమాట:

రవితేజ రూటే సపరేటు. మాస్ కథల్లో నటిస్తూ అలరిస్తుంటారాయన. అలాంటి హీరో… వి.ఐ.ఆనంద్‌లాంటి దర్శకుడితో చేతులు కలిపాడనగానే అందరిలోనూ ప్రత్యేకమైన ఆసక్తి వ్యక్తమైంది. వి.ఐ.ఆనంద్ విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తున్న దర్శకుడు. థ్రిల్లర్ సినిమాలే ఎక్కువగా వచ్చాయి ఆయన నుంచి. రవితేజని ఈసారి గ్యాంగ్‌స్టర్‌గా మార్చేసి… `డిస్కోరాజా` అని సినిమాకి పేరు పెట్టి ఇందులో రవితేజ మార్క్ అంశాలు ఉన్నాయని చాటి చెప్పాడు. ప్రచార చిత్రాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి. మరింతకీ ఈ సినిమా ఎలా ఉంది? సంక్రాంతి సినిమాల జోరు ఇంకా కొనసాగుతున్న ఈ దశలో రవితేజ బాక్సాఫీసుపై ఎంత మేర ప్రభావం చూపిస్తాడు?

కథ:

వాసు (రవితేజ) అనుకోకుండా మిస్ అవుతాడు. ఆయనకి సంబంధించినవాళ్లంతా వెదకడం మొదలుపెడతారు. ఇంతలో ఒక శాస్త్రవేత్తల బృందం అతన్ని మంచు గడ్డల మధ్య కనుక్కుంటారు. చావు బతుకుల్లో ఉన్న అతన్ని తీసుకెళ్లి ప్రాణం పోస్తారు. ప్రాణాలైతే దక్కుతాయి కానీ అతని మెమరీ లాస్ అవుతుంది. వాసు కాస్త డిస్కోరాజ్‌గా మారతాడు. 35 యేళ్ల కిందటే చనిపోయిన డిస్కోరాజ్కీ, వాసుకీ, మధ్య సంబంధమేమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఎలాంటి కథ చెప్పామన్నది కాదు. చెప్పిన ఆ కథ ఎంత ఆసక్తికరంగా సాగిందన్నదే ముఖ్యం. కథ సాగుతున్న క్రమంలో ఆసక్తి కొరవడిందంటే అందులో ఎంత కొత్త అంశం ఉన్నా వృథానే. దర్శకుడు వి.ఐ.ఆనంద్ సినిమాల్లో ఎప్పుడూ ఏదో ఒక కొత్త రకమైన విషయం ఉంటుంది. ఈ సినిమాకోసం కూడా సైన్స్ ఫిక్షన్‌తో కూడిన ఒక అంశాన్ని రాసుకున్నాడు. కానీ దాన్ని ఆసక్తి రేకెత్తించే కథలాగా మలచడంలో మాత్రం విఫలమయ్యాడు. దాంతో ఒక రొటీన్ రివేంజ్ కథలాగా మారిపోయింది. ఆయన ఇదివరకటి సినిమాల్లాగే ఆరంభంలో పట్టు ప్రదర్శిస్తున్నట్టే కనిపించి, ఆ తర్వాత నీరుగార్చేశాడు. ఈ సెటప్ భలే ఉందే అనిపించేశాడు ఆరంభ సన్నివేశాలు. ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్‌ల వెనక ఫ్లాష్‌బ్యాక్‌లు మొదలైపోతాయో అప్పట్నుంచి వ్యవహారం గందరగోళంగా మారిపోతుంది. రవితేజ అంటే హుషారు. ఇందులో దానికి ఏమాత్రం లోటు చేయలేదు. పైపెచ్చు ఇదివరకటి సినిమాలతో పోలిస్తే మరింత అందంగా కనిపించాడు రవితేజ. అది ఆయన అభిమానులకి నచ్చే విషయమే. అయితే ఆయన చేసే అల్లరి నుంచి మంచి వినోదం పండేది. కానీ ఇందులో ఆ స్థాయి వినోదం పండలేదు. సునీల్, వెన్నెల కిషోర్ తదితర కామెడీ గ్యాంగ్ ఉన్నా పెద్దగా నవ్వించలేకపోయారు. ఆ సన్నివేశాల్ని రాసుకున్న విధానంలోనే బలం కనిపించలేదు. అక్కడక్కడా ప్రభావం చూపించే సన్నివేశాలు మినహా ఓవరాల్‌గా మాత్రం నిరాశనే మిగులుస్తుంది. పాత కాలాన్ని గుర్తు చేసే రెట్రో నేపథ్యం మాత్రం ప్రేక్షకులకి అనుభూతిని మిగులుస్తుంది. మొత్తంగా చూస్తే ఇదొక సాధారణ కథ. సంక్రాంతి సినిమాల ప్రభావం ఇంకా కొనసాగుతున్న దశలో డిస్కోరాజ్ ఏమాత్రం తనవైపు ఆకర్షిస్తాడన్నది కాలమే చెప్పాలి.

నటీనటులు… సాంకేతికత:

రవితేజ డిస్కోరాజ్‌గా అదరగొట్టాడు. తన లుక్, స్టైల్ అందులో హుషారు మెప్పిస్తుంది. సాధారణంగా సాగే ఈ కథకి అక్కడక్కడా ఊపు వచ్చేలా చేశాడంటే రవితేజనే కారణం. గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఒదిగిపోయాడు. నభా నటేష్, పాయల్ల పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ పాటల్లో మాత్రం మెప్పిస్తారు. బాబీ సింహా అరవయ్యేళ్ల గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తాడు. తన కిల్లర్ లుక్స్‌తోనూ, స్వాగ్తోనూ సినిమాపై మంచి ప్రభావమే చూపించాడు. సునీల్, వెన్నెల కిషోర్, నరేష్… ఇలా చాలమంది నటులే కనిపిస్తారు. కానీ వాళ్ల పాత్రలతో పెద్దగా వినోదం పండలేదు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కార్తీక్ ఛాయాగ్రహణం కథకి తగ్గ మూడ్‌ని క్రియేట్ చేసింది. సైన్స్ ఫిక్షన్‌తో కూడిన సన్నివేశాల్ని చాలా బాగా చూపించాడు. తమన్ సంగీతం మరో ప్రధాన ఆకర్షణ. రెట్రో పాటల్ని, నేపథ్య సంగీతాన్ని చాలా బాగా తీర్చిదిద్దాడు. దర్శకుడు వి.ఐ.ఆనంద్ కథకుడిగా పూర్తిగాస్థాయిలో ప్రభావం చూపించలేకపోయాడు. కొత్త అంశం దొరికింది కానీ… దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నిర్మాణ విలువలు ఉన్నతంగా కనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్

రవితేజ
సైన్స్ ఫిక్షన్ నేపథ్యం
ఆరంభ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్

రొటీన్ స్టోరీ
గందరగోళంగా అనిపించే సన్నివేశాలు
ద్వితీయార్థం

రేటింగ్: 2.5/5

ముగింపు

డిస్కోరాజా… కిక్ కనిపించలేదయ్యా