మాస్ రాజా తొడగొట్టేదీ అక్కడే

రవితేజ సినిమా కర్నూలు నేపథ్యంలోసాగబోతోందా? ఆయన కూడా కొండారెడ్డి బురుజు దగ్గర నిలబడి సవాల్ విసరబోతున్నాడా? – పండగ సందర్భంగా విడుదల చేసిన ఆయన `క్రాక్` ప్రచార చిత్రం చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం `క్రాక్`. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. సంక్రాంతి సందర్భంగా పోస్టర్ని విడుదల చేశారు.

సందడంతా అందులో కనిపిస్తోంది. ట్రెడిషనల్ దుస్తులేసుకుని రవితేజ, శ్రుతిహాసన్ కళకళలాడుతూ కనిపించారు. వాళ్లిద్దరూ కూర్చున్న బైక్ వెనక కొండారెడ్డి బురుజు కనిపిస్తోంది. దీన్నిబట్టి ఇది సీమ కథ అని అర్థమవుతోంది. ఇందులో రవితేజ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. సీమ గడ్డపై పౌరుషం చూపించనున్న పోలీస్ అన్నమాట. మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు` కూడా కొండారెడ్డి బురుజు చుట్టూ తిరిగింది. `ఒక్కడు`లో కూడా అక్కడ కొన్ని సన్నివేశాలు తీశారు. అప్పట్నుంచే కర్నూల్లోఉన్న కొండారెడ్డి బురుజు మరింత ప్రాచుర్యం పొందింది. రాయలసీమ నేపథ్యం అయినా, ఫ్యాక్షనిజం నేపథ్యంలో సాగే కథయినా మెజారిటీగా కొండారెడ్డి బురుజుని చుట్టేసే వచ్చాయి.