నేల‌టికెట్ సాంగ్స్ రివ్యూ

Last Updated on by

ర‌వితేజ హీరోగా క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల తెర‌కెక్కించిన చిత్రం నేల‌టికెట్. వ‌ర‌స‌గా రెండు విజ‌యాల త‌ర్వాత క‌ళ్యాణ్ చేస్తున్న మూడో సినిమా ఇది. తాజాగా ఈ చిత్ర ఆడియో విడుద‌లైంది. ఫిదా ఫేమ్ శ‌క్తికాంత్ కార్తిక్ అందించిన పాట‌లు ఎలా ఉన్నాయో చూద్దాం..!

1. ఓ సారి ట్రై చేయ్..
గానం: మ‌ల్లిఖార్జున్…. లిరిక్స్: భాస్క‌ర‌బ‌ట్ల

ఓ సారి ట్రై చేయ్ అంటూ టీజ‌ర్ విడుద‌లైన రోజు నుంచే ఈ ట్యూన్ బాగా హైలైట్ అయింది. ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ విడుద‌లైంది. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ ఓ పెద్ద సినిమాకు పాడాడు మ‌ల్లిఖార్జున్. ఓ సారి ట్రై చేయ్ అంటూ సాగే ఈ పాట‌ను భాస్క‌ర‌బ‌ట్ల రాసారు. న‌లుగురులో మ‌నం కూడా ఉండాలి.. అంద‌రితోపాటు మ‌నం సంతోషంగా ఉండాలంటూ సాగే ఈ పాట బాగానే ఉంది. ఊహించిన‌ట్లుగానే ఈ పాట ఇన్ స్టంట్ గా హిట్ అవ్వ‌డం ఖాయం.

2. బిజిలి..
గానం: పృథ్వీ చంద్ర‌, జ‌న‌నీ సంజీవి….. లిరిక్స్: చైత‌న్య పింగ‌ళి

బిజిలీ అంటూ సాగే ఈ మాస్ పాట మ‌న ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌డం క‌ష్ట‌మే. ర‌వితేజ అంటేనే ఖచ్చితంగా మాస్ పాట‌లు ఊహిస్తారు అభిమానులు. కానీ ఈ పాట మాత్రం ఊహించ‌నంత కిక్ అయితే ఇవ్వట్లేదు. పైగా శ‌క్తికాంత్ కార్తిక్ ఫిదాలో క్లాస్ సాంగ్స్ ఇచ్చాడు. ఇలాంటి సంగీత ద‌ర్శ‌కుడి నుంచి బిజిలీ లాంటి ఊర‌మాస్ పాట‌లు ఊహించ‌డం క‌ష్ట‌మే.

3. ల‌వ్ యూ ల‌వ్ యూ..
గానం: శ్రీ‌కృష్ణ‌, ర‌మ్య బెహ్రా… లిరిక్స్: చైత‌న్య పింగ‌ళి

ల‌వ్ యూ.. ల‌వ్ యూ.. ఇది కూడా టిపికల్ రొమాంటిక్ సాంగ్. విన‌గానే ఎక్కేంత ట్యాన్ అయితే కాదు. కానీ విన‌గా విన‌గా ఎక్కే ట్యూనే ఇది. ఈ జ‌న‌రేష‌న్ బాగా కోరుకునే విధంగా ఇందులో ప‌దాలు ప‌డ్డాయి. రొమాంటిక్ గా సాగే ఈ పాట మెల్ల‌గా ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యే ఛాన్స్ ఉంది.

4. నేల‌టికెట్టు..
గానం: సింహా, మ‌ధుప్రియ‌… లిరిక్స్: రామ‌జోగ‌య్య శాస్త్రి

వ‌ర‌సగా అద్భుతమైన పాట‌లు రాస్తూ స్టార్ లిరిక్ రైట‌ర్ గా వెలిగిపోతున్నాడు రామ‌జోగ‌య్య శాస్త్రి. ఈయ‌న నేల‌టికెట్ టైటిల్ సాంగ్ రాసాడు. ఎప్ప‌ట్లాగే ఫుల్ మాస్ సాంగ్ రాసాడు శాస్త్రి. కానీ దాన్ని ట్యూన్ చేయ‌డంలోనే శ‌క్తికాంత్ కార్తిక్ ప‌దును క‌నిపించ‌లేదు. అయితే విన‌గా విన‌గా.. విజువ‌ల్ గా ఈ పాట ఖచ్చితంగా థియేట‌ర్స్ లో విజిల్స్ కొట్టించ‌డం ఖాయం. ఫిదాలో వ‌చ్చిండే పాట‌ను పాడిన మ‌ధుప్రియ ఈ పాట పాడింది.

5. చుట్టూ జ‌నం..
గానం: విజ‌య్ యేసుదాస్.. లిరిక్స్: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి

పెద్ద శాస్త్రి గారు కూడా ఇందులో ఓ పాట రాసారు. చుట్టూ జ‌నం.. అందులో మ‌నం అంటూ సాగే ఈ పాట ఇన్స్ స్పిరేష‌న‌ల్ గా ఉంది. విన‌గానే ఆక‌ట్టుకునే ట్యూన్ కూడా ఉంది. పైగా విజ‌య్ యేసుదాస్ వాయిస్ ఈ పాటకు స‌రిగ్గా సూట్ అయింది. సినిమా థీమ్ అంతా ఈ ఒక్క పాట‌లో చెప్పేసారు సీతారామ‌శాస్త్రి.

6. న‌మ‌స్తే..
గానం: పివిఎస్ఎన్ రంజిత్… లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ

ఇది ఒక‌లాంటి ఉద్య‌మ‌గీతంలా ఉంటుంది. న‌లుగురిని మేల్కొలిపే పాట ఇది. ఇలాంటి పాట‌లు రాయ‌డంలో సిద్ద‌హ‌స్తులు సుద్దాల అశోక్ తేజ‌. అనుకున్న‌ట్లుగానే అద్భుతంగా పాట‌ను రాసాడు అశోక్ తేజ‌. ఇది కూడా సినిమా క‌థ‌ను క్లియ‌ర్ గా బ‌య‌ట పెడుతుంది. మొత్తానికి ఈ ఆడియో మూడు హిట్ సాంగ్స్.. మూడు యావ‌రేజ్ సాంగ్స్ తో స‌మ‌తూకంగా ఉంది. మ‌రి రేపు విడుద‌లైన త‌ర్వాత నేల‌టికెట్ విజువ‌ల్ తో అన్నింటినీ స‌మం చేస్తుందో లేదో..?

User Comments