ర‌వితేజ అయితే నాకేంటన్న కాజ‌ల్

Last Updated on by

వ‌య‌సు మూడు ప‌దులు దాటినా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది కాజ‌ల్. ఇప్ప‌టికీ వ‌ర‌స ఆఫర్ల‌తో దూసుకుపోతుంది ఈ చంద‌మామ‌. తెలుగుతో పాటు త‌మిళ ఇండ‌స్ట్రీలోనూ ఈమెకు బాగానే ఆఫ‌ర్లు వ‌స్తున్నాయిప్పుడు. ఇలాంటి టైమ్ లో కాజ‌ల్ ఓ భారీ సినిమాకు నో చెప్పింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అదే శీనువైట్ల‌-ర‌వితేజ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ. ఈ చిత్ర ఓపెనింగ్ ఈ మ‌ధ్యే జ‌రిగింది. నీకోసం, వెంకీ, దుబాయ్ శీను త‌ర్వాత శీనువైట్ల‌తో ర‌వితేజ చేస్తోన్న సినిమా ఇది. ఇందులో హీరోయిన్ గా కాజ‌ల్ ను తీసుకోవాల‌నుకున్నాడు శీనువైట్ల‌. కానీ ఈ ఆఫ‌ర్ కు కాజ‌ల్ మాత్రం నో చెప్పింద‌ని తెలుస్తుంది. కార‌ణం క‌థ కాదు.. రెమ్యున‌రేష‌న్. అవును.. కాజ‌ల్ కు పారితోషికం ప‌ట్టింపులు ఎక్కువ‌. గ‌తంలోనూ కొన్ని భారీ సినిమాల‌ను కేవ‌లం రెమ్యున‌రేష‌న్ కార‌ణంగానే వ‌దిలేసింది ఈ ముద్దుగుమ్మ‌. అప్ప‌ట్లో ప‌వ‌న్ కెమెరామెన్ గంగ‌తో రాంబాబుతో పాటు క‌మ‌ల్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం కూడా వ‌దిలేసింది ఈ ముద్దుగుమ్మ‌.

శీనువైట్ల సినిమాలో న‌టించ‌డానికి అక్ష‌రాలా రెండు కోట్ల‌కు పైగానే డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అయితే ఇంత ఇవ్వ‌లేక‌.. కాజ‌ల్ ను ప‌క్క‌న‌బెట్టేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అస‌లే ఈ చిత్రానికి ఏ రెమ్యున‌రేష‌న్ లేకుండా ప‌ని చేస్తున్నారు ర‌వితేజ, శీనువైట్ల‌. లాభాల్లో షేర్ తీసుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో హీరోయిన్ కు రెండు కోట్లంటే మాట‌లు కాదు. అందుకే కాజ‌ల్ ను కాద‌ని.. అను ఎమ్మాన్యువ‌ల్ వైపు అడుగేసారు ఈ జోడీ. కానీ ర‌వితేజ‌తో ఇప్ప‌టికే రెండు సినిమాలు చేసింది కాజ‌ల్.. ఇక శీనువైట్ల‌తోనూ ప‌ని చేసింది. ఇద్ద‌రితోనూ స్నేహం ఉండి కూడా రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఇంత ప‌క్కాగా ఉంది చంద‌మామ‌. అంతేలే.. ఇలా ఉండ‌క‌పోతే ఇండ‌స్ట్రీలో నెగ్గుకురావ‌డం క‌ష్ట‌మే సుమీ..! ఈ విష‌యంలో మిగిలిన హీరోయిన్లు చంద‌మామ‌ను చూసి చాలా నేర్చుకోవాలి.

User Comments