కృష్ణంరాజుకు అస్వ‌స్థ‌త

రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారా? హాస్పిట‌ల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళ్తే నాలుగు రోజులుగా కృష్ణం రాజు తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారుట‌. దీంతో ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారుట‌. వెంట‌నే (బుధ‌వారం) బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రికి త‌ర‌లించిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న‌ట్లు తెలిసింది. కృష్ణం రాజు న్యూమోనియాతో బాధ‌ప‌డుతున్న‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు అధికారంగా కొద్ది సేప‌టి క్రితం వెల్ల‌డించ‌డంతోనే ఈ విషయం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కొన్నాళ్లుగా కృష్ణం రాజు సినిమాల‌కు దూరంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌గా బిజీ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. యూవీ క్రియేష‌న్స్ లో స్లీపింగ్ పార్ట‌న‌ర్ గా ఉన్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది. ఇక ప్ర‌భాస్ తో ఒక్క‌ అడుగు చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మించాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ ప్ర‌భాస్ బిజీ షెడ్యూల్, కృష్ణం రాజు రాసుకున్న క‌థ‌కు స‌రైన ద‌ర్శ‌కుడు దొర‌క‌క‌పోవ‌డంతో ప్రాజెక్ట్ డిలే అవుతోంది.