అస్త‌మించిన ఎర్ర‌సూరీడు

Last Updated on by

రెడ్‌స్టార్ మాదాల రంగారావు(69) ఇక లేరు. ఎర్ర‌సూరీడు అస్త‌మించారు. గ‌త కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న ఆదివారం వేకువ ఝామున‌ కన్నుమూశారు. శ్వాసకోస సంబంధ వ్యాధి ముద‌ర‌డంతో.. ఇటీవ‌లే వెంటిలెటర్ పై కృత్రిమ శ్వాస‌ను అందించారని ఆయ‌న త‌న‌యుడు మాదాల ర‌వి వెల్ల‌డించారు. నాన్న‌గారి ఆరోగ్య‌ప‌రిస్థితిపై ఆందోళ‌న‌గా ఉంద‌ని మీడియా ముఖంగా ప్ర‌క‌టించారు.

మాదాల రంగారావు అన‌గానే ఆయ‌న‌లోని ఉడుకుర‌క్తం గుర్తుకు రావాల్సిందే. ఆయ‌న న‌టించిన విప్ల‌వ‌క‌థా చిత్రాలు క‌ళ్ల ముందు మెదులుతాయి. సమాజంలో వేళ్లూనుకున్న అవినీతిపై విప్ల‌వ‌శంఖం పూరించిన మేటి న‌టుడు, నిర్మాత ఆయ‌న‌. చైర్మన్ చలమయ్య చిత్రంతో తెరంగేట్రం చేసి, ఎర్రమల్లెలు, విప్లవ శంఖం, ఎర్రసూర్యుడు, బలిపీఠంపై భారతనారి, ఎర్ర పావురాలు, ప్రజాశక్తి వంటి చిత్రాల్లో నటించి రెడ్ స్టార్‌గా త‌న‌కంటూ ఓ ఐడెంటిటీ తెచ్చుకున్నారు.  నవతరం ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి `యువతరం కదిలింది` చిత్రాన్ని తీసి, బంగారు నంది పురస్కారం గెలుచుకున్నారు. మాదాల మృతిపై మా అసోసియేష‌న్, నిర్మాత‌ల మండ‌లి స‌హా సినిమా 24 శాఖ‌లు సంతాపం ప్ర‌క‌టించాయ‌మి. ప్రకాశం జిల్లా మైనంపాడులో 1948 మే 25వ తేదీన జన్మించిన మాదాల 1980-90 దశకంలో సామాజిక విప్లవ సినిమాలతో ఎన్నో సంచ‌ల‌నాలు సృష్టించారు.

User Comments