ఆర్జీవీ న‌ట్టేట ముంచాడా

ఎట్ట‌కేల‌కు ఆర్జీవీ `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు` థియేట‌ర్ల‌లో రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఎన్నో వివాదాలు ట్విస్టుల న‌డుమ ఈ సినిమా రిలీజైంది. ఇప్ప‌టికే రివ్యూలు వేడెక్కిస్తున్నాయి. ఆర్జీవీ ప్ర‌చారార్భాటం చూసి పొలిటిక‌ల్ సెటైర్ లో ఇంకేదో మ్యాజిక్ చేస్తాడ‌ని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది.

ఓవైపు సినిమా రిలీజ్ ముందు నిర్మాత‌ ఆర్జీవీ.. ఆయ‌న శిష్యుడు చిత్ర ద‌ర్శ‌కుడు సిద్ధార్థ తాతోలు చేసిన హంగామా చూసి బ‌ర్నింగ్ పాలిటిక్స్ ని ఎంతో సీరియ‌స్ గా చూపిస్తున్నార‌ని భావించిన వారంతా అవాక్క‌య్యేలా చేశార‌న్న‌ కామెంట్లు వినిపిస్తున్నాయి. స‌రిగ్గా రిలీజ్ ముందు రోజు ఆర్జీవీ వీరంగం .. మా సినిమాని ఆపడానికి ప్రయత్నించిన వారిపై లీగల్‌గా కేసులు పెట్టబోతున్నామని.. ప్ర‌క‌టించ‌డం ఇదంతా చూసి ఏదో జ‌రుగుతోంద‌ని అనుకున్నారంతా. అసెంబ్లీలో జరుగుతోన్న కామెడీని ఏ డైరెక్టర్ నేరుగా పెద్ద తెర‌కు ఎక్కించ‌లేడ‌ని చెప్పిన వ‌ర్మపై రివ‌ర్సులో సెటైర్లు ప‌డుతున్నాయి. మ‌రోసారి ఆర్జీవీ దారుణంగా విఫ‌ల‌మ‌వ్వ‌డం విమ‌ర్శ‌ల పాలైంది. క్రిటిక్స్ అమ్మ రాజ్యంలో చిత్రం తెర‌కెక్కించిన విధానంపై త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లతో ఉక్కిరి బిక్కిరి చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ చిత్రం కంటే ఎంతో బెట‌ర్ అన్న టాక్ వినిపిస్తోంది.