రాంగోపాల్ వర్మ మరో సంచలన ప్రకటనతో వార్తల్లో నిలిచాడు. విజయవాడ రౌడీలు అయిపోయారు. రాయలసీమ ఫ్యాక్షనిస్టులు పూర్తయ్యారు. ఇక బ్యాలెన్స్ హైదరాబాద్ దాదాలే. వాళ్లను వదిలి పెట్టను. ఇక నా టార్గెట్ వాళ్లే. నా సత్తా ఏంటో చూపిస్తానంటూ తాజాగా సంచలన ప్రకటన చేసాడు. త్వరలో హైదరాబాద్ లోని 80 దశకంలోని దాదాలపై ఓ చిత్రాన్ని తీస్తానని ట్విటర్ వేదికగా తెలిపాడు. ఈ పాత్రకు నా `శివ` స్ఫూర్తి అంటూ వెల్లడించాడు. అందులో వంగవీటి ఫేం సందీప్ ప్రధాన పాత్ర పోషించనున్నాడని వర్మ తెలిపాడు.
దీంతో మరోసారి వర్మ పేరు మీడియా అంతటా హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం వర్మ కమ్మ రాజ్యంలో కడపరెడ్లు తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా రెడ్డి రాజ్యానికి కమ్మలు సపోర్ట్ అంటూ మరో సినిమా కూడా చేస్తానని తెలిపాడు. ఈలోగానే హైదరాబాద్ దాదాలపై పడటం విశేషం. మాఫియా నేపథ్యంలో సినిమాలు చేయడం వర్మకు కొట్టిన పిండి. ఇప్పటికే ముంబై మాఫియా నేపథ్యంలో కొన్ని సినిమాలు చేసాడు. రియల్ మాఫియానే కళ్లకు కట్టాడు.
ఈ నేపథ్యంలో వర్మకు మాఫియాతో సంబంధాలున్నాయా? అని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పలుమార్లు ముంబై పోలీసులు వర్మను విచారించిన సందర్భాలున్నాయి. మరి ఇప్పుడు హైదరాబాద్ దాదాలను టచ్ చేస్తున్నాడు. అంటే పరోక్షంగా రాజకీయాలు ఇందులో ముడి పడి ఉంటాయి. అప్పటి రాజకీయ నాయకుల గురించి కూడా ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. మునుముందు ఇంకెన్ని వివాదాలతో చెలిమి చేస్తాడో చూడాలి.