నా పాపాలకు ప్రాయాశ్చిత్తమిదే!-ఆర్జీవీ

Last Updated on by

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ త్వరలో రిలీజ్ కానుంది. ‘సింహగర్జన’ పేరుతో ప్రమోషన్ వేడుకలో ఆర్జీవీ చెప్పిన సంగతులివి..

నేను కూడా బెదిరిస్తా
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రిలీజ్ చేయకుండా అడ్డుకొంటామని కొందరు హెచ్చరిస్తున్నారనే విషయం నిజమే. ప్రధానంగా టెలివిజన్ రౌడీలు నరికేస్తామని బెదిరిస్తున్నారు. బెదిరించే వ్యక్తులను నేను పట్టించుకోను. వారు బెదిరిస్తే నేను వాళ్లను బెదిరిస్తాను. నన్ను బెదిరించే వాడు ఏమీ చేయరు. సాధారణంగా హాని తలపెట్టే వ్యక్తి ఎప్పుడూ బెదిరించడు. బెదిరించే వాడు హాని తలపెట్టడు! అని నమ్ముతాను.

జీఎస్టీ తీయడం తప్పే!
నా జీవితంలో నేను చాలా పాపాలు చేశాను. జీఎస్టీ సినిమా తీసిన పాపాన్ని కడిగేసుకొంటాను. లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో తిరుపతికి వెళ్లి పాపాలు కడిగేసుకొంటున్నా. నిజాలు చెప్పి సత్య హరిచంద్రుడిగా మారుతాను. ఈ సినిమాను రాజకీయ ప్రయోజనాల కోసం చేయలేదు. రాజకీయాలతో సంబంధం లేదు.

టైటిల్స్‌లో అతడు అర్హుడే
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు అగస్త్య మంజు కాంట్రిబ్యూషన్ ఎక్కువ. ఈ సినిమాకు చాలా రీసెర్చ్ చేశాడు. అందుకే దర్శకుడి టైటిల్‌లో నా పేరుతోపాటు ఆగస్త్య పేరు కూడా వేశాం. ఆయన పేరును దర్శకుడి టైటిల్ లో వేయడం సబబే. ఆయన చేసిన పనికి ఫలితాన్ని ఇవ్వాలనుకొన్నాను. ఈ కారణాల వల్లనే నా పేరు పక్కన ఆయన పేరును వేశాం.

ఎన్టీఆర్ గొప్పతనాన్ని తగ్గించలేదు
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో స్వర్గీయ ఎన్టీఆర్ ఔనత్యాన్ని తగ్గించలేదు. ఆయనకు ఉన్న గొప్పతనాన్ని గొప్పగా చూపించాను. 70 ఏళ్ల వరకు మహారాజులా బతికాడు. ఆయన జీవితంలో వైశ్రాయ్ ఎపిసోడ్ తర్వాత చాలా మానసిక క్షోభకు గురయ్యాడు. కొంతమంది కలిసి ఆయనను దారుణమైన స్థితికి ఎలా తీసుకొచ్చారనేది లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చూస్తారు.
.. అని ఆర్జీవీ అన్నారు.