ఆఫీస‌ర్ రివ్యూ

Last Updated on by

రివ్యూ: ఆఫీస‌ర్

న‌టీన‌టులు: నాగార్జున‌, మైరాస‌రీన్, అజ‌య్, సుధీర్ చంద్ర ప‌దిరి త‌దిత‌రులు

సంగీతం: ర‌విశంక‌ర్

క‌థ‌, స్క్రీన్ ప్లే, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు: రామ్ గోపాల్ వ‌ర్మ‌

వ‌ర్మ అనే ద‌ర్శ‌కున్ని ప్రేక్ష‌కులు న‌మ్మ‌డం మానేసి చాలా రోజులైంది. ఈయ‌న సినిమాలు తీస్తున్నాడు కానీ ప్రేక్ష‌కులు మాత్రం చూడ‌టం లేదు. అయినా కూడా ఈయ‌న ప్ర‌య‌త్నాలు ఆప‌డం లేదు. ఇక ఇప్పుడు నాగార్జున‌తో ఈయ‌న చేసిన ఆఫీస‌ర్ విడుద‌లైంది. పాతికేళ్ల త‌ర్వాత వ‌చ్చిన కాంబినేష‌న్ ఏదైనా మాయ చేసిందా..? వ‌ర్మ‌పై నాగ్ పెట్టుకున్న న‌మ్మ‌కం ఏమైంది..?

క‌థ‌:

ప‌సారి (సుధీర్ చంద్ర ప‌దిరి) ఓ పోలీస్ ఆఫీస‌ర్. ముంబై అండ‌ర్ వ‌ర‌ల్డ్ ను అంత‌మొందించిన ఆఫీస‌ర్ ఆయ‌న‌. అలాంటి ఆఫీస‌ర్ ఓ సారి కేస్ లో ఇరుక్కుంటాడు. ఆయ‌న‌పై వేసిన ఎంక్వైరీలో ఇన్వెస్టిగేష‌న్ కోసం ముంబై వ‌స్తాడు శివాజీ రావ్(నాగార్జున‌). హైద‌రాబాద్ నుంచి వ‌చ్చి ఇక్క‌డే ఉండి ప‌సారి చేస్తున్న ప‌నులు చూస్తుంటాడు. ఆ త‌ర్వాత పోలీస్ ఆఫీస‌ర్ గా ఉన్న ఆ ప‌సారినే అండ‌ర్ వ‌రల్డ్ తో క‌లిసి అంతా చేస్తున్నాడ‌ని తెలుసుకుంటాడు. కానీ స‌రైన సాక్ష్యాలు లేక ప‌సారిని వ‌దిలేస్తుంది కోర్ట్. ఆ త‌ర్వాత శివాజీనే మాఫియాతో లింకులు ఉన్న‌ట్లు సాక్ష్యాలు సృష్టిస్తాడు ప‌సారి. దాన్నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు.. శివాజీ చివ‌రికి ఏం చేసాడు అనేది మిగిలిన క‌థ‌..!

క‌థ‌నం:

మాఫియాను ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసింది వ‌ర్మ కాదేమో కానీ దాన్ని చుట్టంగా మార్చింది మాత్రం వ‌ర్మే. నిజంగా అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్స్ తో సంబంధాలు ఉన్న‌ట్లే వాటిని తెర‌కెక్కించాడు వ‌ర్మ‌. అదే ఫార్ములా ఇప్ప‌టికీ వాడుతున్నాడు. ఇప్పుడు ఆఫీస‌ర్ కూడా ఇలాంటి సినిమానే. ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్.. ఓ క్రిమిన‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ మ‌ధ్య జ‌రిగే ఆట ఇది. ఫ‌స్ట్ సీన్ నుంచే క‌థ‌లోకి వెళ్లిపోయాడు వ‌ర్మ‌. ఓ ఆఫీస‌ర్ క్రైమ్ లో ఇరుక్కోవ‌డం.. ఆ త‌ర్వాత ఆయ‌న్ని క్ర‌మినల్ గా ప్రూవ్ చేయ‌లేక‌పోవ‌డం.. మ‌ధ్య‌లో ఎవ‌రెవ‌ర్నో హీరో క‌లుస్తుంటాడు. ఎందుకు అని అడ‌గ‌కండి.. అవ‌న్నీ కేవ‌లం వ‌ర్మ‌కు మాత్ర‌మే తెలుసు. ఎందుకంటే ఆయ‌నే కదా క‌థ రాసింది. ఎప్పుడో అరిగిపోయిన సీన్ లు అన్నీ తీసుకొచ్చి ఆఫీస‌ర్ లో పెట్టేసాడు వ‌ర్మ‌.

నాగార్జున‌కు కూడా చాలా రోజులైంది క‌దా యాక్ష‌న్ సినిమాలు చేసి.. అస‌లు చేయ‌లేదు కూడా ఇలాంటి సినిమా.. అందుకే వ‌ర్మ ఏం చెబితే దానికి సై అనేసాడు. దొరికాడు క‌దా అని నాగార్జున‌ను కూడా త‌న‌కు న‌చ్చిన‌ట్లు చూపించాడు ఈ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు. ఒక‌ప్పుడు మాఫియా సినిమాలంటే వ‌ర్మ‌లా తీయాల్రా అనుకునేవాళ్లు ద‌ర్శ‌కులు కానీ ఇప్పుడు బాబోయ్ ఎలా తీసినా ప‌ర్లేదు వ‌ర్మ‌లా తీయ‌క‌పోతే చాలు అంటున్నారు. రొటీన్ స్క్రీన్ ప్లే.. సాగిపోయే సీన్లు.. మ‌ధ్య‌లో అసంద‌ర్భంగా వ‌చ్చే పాట‌లు.. ఇవ‌న్నీ చూసిన త‌ర్వాత వ‌ర్మ ఎందుకు ఇంకా సినిమాలు చేస్తున్నాడా అనిపిస్తుంది. ఒక‌ప్పుడు అంత గొప్స సినిమాలు చేసింది ఈయ‌నేనా అనే అనుమానం కూడా వ‌స్తుంది.

న‌టీన‌టులు:

నాగార్జున న‌ట‌న గురించి ఏం చెప్పాలి..? ఈయ‌న త‌న పాత్ర‌లో బాగానే న‌టించాడు కానీ క‌థ ఎక్క‌డుంది న‌టించ‌డానికి. ఆఫీస‌ర్ గా చాలా అందంగా ఉన్నాడు ఈ హీరో. ఈ ఏజ్ లో కూడా ప‌ర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేస్తున్నాడు. ఇక మైరాస‌రీన్ హీరోయిన్ కాదు.. అలాగ‌ని స‌పోర్టింగ్ కారెక్ట‌ర్ కాదు.. అదోర‌కం. సుధీర్ చంద్ర విల‌న్ గా ప‌ర్లేదు. కానీ తెలుగు ఫేస్ కాదు క‌దా ఏదో డ‌బ్బింగ్ సినిమా చూసిన‌ట్లు ఉంటుంది. అజ‌య్ స‌పోర్టింగ్ కాప్ గా బాగానే చేసాడు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నిక‌ల్ టీం:

వ‌ర్మ ఈ ఆఫీస‌ర్ గురించి చెప్పిన ప్ర‌తీసారి సౌండ్స్ గురించి చాలా చెప్పాడు. కానీ ఆయ‌న చెప్పినంత‌గా ఏం అనిపించ‌వు. అవి కొన్నిసార్లు ఏదో కావాల‌ని చేసిన శ‌బ్ధాల్లా అనిపించాయి కానీ టెక్నాల‌జీలా కాదు. ఇక కెమెరా యాంగిల్స్ కేవ‌లం వ‌ర్మ‌కు మాత్ర‌మే తెలుసు. బీర్ సీసా మూతి మీద పెట్ట‌డం.. కెమెరాను హీరోల చుట్టూ తిప్ప‌డం.. ఇవ‌న్నీ వ‌ర్మ‌కు తెలిసిన విద్య‌లే. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు.. ఎడిటింగ్ ఏమ‌నాలో తెలియ‌దు. క‌థ గురించి అడ‌క్క‌పోతే బెట‌ర్.. ఎందుకంటే ఇప్ప‌టికే చాలా సినిమాల్లో వ‌ర్మ ఇదే క‌థ చెప్పాడు. కానీ మ‌రిచిపోయిన‌ట్లున్నాడు. శివ లాంటి సినిమా వ‌చ్చిన కాంబినేష‌న్ లోనే ఈ ఆఫీస‌ర్ వ‌చ్చింది.. ఏం చేస్తాం..! కాలం మారింద‌ని స‌రిపెట్టుకోవ‌డం త‌ప్ప‌.

చివ‌ర‌గా:

ప్రేక్ష‌కులు ఈ ఆఫీస‌ర్ తో కాస్త జాగ్ర‌త్త‌..

రేటింగ్: 1.75/5.0

User Comments