RRR: యాక్ష‌న్ గ‌న్‌ లాస్.. కిలాడీ గెయిన్?

Last Updated on by

ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ RRR అవ‌కాశాన్ని బాలీవుడ్ యాక్ష‌న్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ వ‌దులుకున్నారా? అంటే అవుననే ప్ర‌ఖ్యాత టైమ్స్ పేర్కొంది. ఆ సినిమాలో న‌టించాల్సిందిగా ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి అదిరిపోయే ఆఫ‌ర్ ఇస్తే దేవ‌గన్ ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల కాద‌నుకున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆ స్థానంలో కిలాడీ అక్ష‌య్ కుమార్ ని ఎంపిక చేసుకునేందుకు రాజ‌మౌళి సిద్ధంగా ఉన్నారు. ఇప్ప‌టికే అక్కీని సంప్ర‌దించార‌ని తెలుస్తోంది.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. ఎన్టీఆర్- రామ్ చ‌ర‌ణ్- రాజ‌మౌళి ప్రాజెక్టు RRR ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం సీరియ‌స్ గా విల‌న్ సెర్చ్ సాగుతోంది. ఇందులో న‌టించాల్సిందిగా బాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌న్ ని సంప్ర‌దించారు. ఈగ- హిందీ వెర్ష‌న్ కి అజ‌య్ దేవగ‌న్, కాజోల్ జంట గాత్ర‌దానం చేశారు. నాటి నుంచి ఆ ఇద్ద‌రూ రాజ‌మౌళికి అత్యంత‌ స‌న్నిహితులు కావ‌డంతో ఈ ఆఫ‌ర్ దేవ‌గ‌న్ ని వ‌రించింద‌ని తెలుస్తోంది. అయితే అజ‌య్ సున్నితంగా తిర‌స్క‌రించార‌ట‌. ఆ త‌ర్వాత‌ రాజ‌మౌళి అక్ష‌య్ ని సంప్ర‌దించార‌ని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది. ప్ర‌స్తుతం ఆ ఇరువురు ఇంకా సంప్ర‌దింపుల ద‌శ‌లోనే ఉన్నారు. అక్కీ ఓకే చెప్పాల్సి ఉంద‌ని తెలుస్తోంది. ఒక‌వేళ అక్ష‌య్ ఓకే చెబితే అత‌డికి ద‌క్షిణాదిన మ‌రో భారీ ఆఫ‌ర్ ద‌క్కిన‌ట్టే. ఇటీవ‌లే శంక‌ర్ తెర‌కెక్కించిన 2.0 చిత్రంలో అక్ష‌య్ బ‌ల‌మైన‌ విల‌న్ పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీని మించి అక్ష‌య్ పాత్ర‌కు పేరొచ్చింది. అందుకే అత‌డు రాజ‌మౌళి ఆఫ‌ర్ ని అంగీక‌రిస్తే ఆర్‌.ఆర్‌.ఆర్ కి క‌లిసొస్తుంద‌ని అభిమానులు విశ్లేషిస్తున్నారు. అజ‌య్ దేవ‌గ‌న్ ఇప్ప‌టికే శంక‌ర్ ఆఫ‌ర్ చేసిన `భార‌తీయుడు 2`ని కాద‌నుకున్నారు. ఇప్పుడు రాజ‌మౌళి ఆఫ‌ర్ ని అంగీక‌రించ‌నందున తీవ్రంగా న‌ష్ట‌పోయిన‌ట్టేన‌న్న వాద‌నా వినిపిస్తోంది. అయితే అజ‌య్ దేవ‌గ‌న్ ప్ర‌స్తుతం ప‌లు భారీ ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నాడు. క‌మిట్ మెంట్ ప‌ర‌మైన ఇబ్బందులు ఉండి ఉండొచ్చ‌ని భావించాల్సి ఉంటుంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి దాన‌య్య దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ పెడుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే భారీ క్రేజీ తార‌ల‌ను బ‌రిలోకి దించి జ‌క్క‌న్న మైండ్ గేమ్ ఆడుతున్నాడ‌న్న‌మాట‌!! ఈ భారీ సినిమాలో ఓ బాలీవుడ్ న‌టుడు న‌టించ‌డంతో మార్కెట్ విలువ రెట్టింపు అవుతుంద‌న్న‌ది ఓ ప్లాన్.

User Comments