RRR అన్నీ మంచి శ‌కున‌ములే

ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ డిసెంబ‌ర్ లేదా జ‌న‌వ‌రిలో ప్రారంభం కానుంద‌నే సంకేతాలు అందిన సంగ‌తి తెలిసిందే. జ‌క్క‌న్న యాక్ష‌న్ మోడ్‌లోకి వ‌చ్చేశాడు. ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఇద్ద‌రినీ సాన‌బ‌ట్టి చాకుల్లా త‌యారు చేసి, అటుపై సెట్స్‌పైకి వెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తున్నాడు. బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత అందుకు భిన్న‌మైన క‌థ‌ను ఎంచుకుని ఈ ఛాలెంజ్‌లో నెగ్గాల‌న్న పంతం రాజ‌మౌళిలో క‌నిపిస్తోంది. అందుకే ఏడాదిన్న‌ర పైగానే గ్యాప్ వ‌చ్చినా, ఇంకా ఇంకా క‌థ‌పైనే క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. స్క్రిప్టు విష‌యంలో ప‌క్కాగా వ‌చ్చాకే సెట్స్‌పైకి వెళ్లాల‌న్న ధృడ నిశ్చ‌యంతో వేచి చూశాడు.

#RRR మ‌ల్టీస్టార‌ర్ ఆన్‌లో ఉండ‌గానే మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం`, ఎన్టీఆర్ న‌టించిన `అర‌వింద స‌మేత‌` నాన్ బాహుబ‌లి రికార్డుల్ని తిర‌గ‌రాశాయి. ముందు చ‌ర‌ణ్‌, త‌ర్వాత ఎన్టీఆర్ త‌మ ప‌ని తాము విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. స‌రిగ్గా ఇదే పాయింట్ ఇటు జ‌క్క‌న్న మ‌ల్టీస్టార‌ర్ కి క‌లిసిరానుంది. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఎదురేలేని హీరోలుగా 100కోట్ల క్ల‌బ్, 200 కోట్ల క్ల‌బ్ అంటూ చెల‌రేగిపోయే స‌న్నివేశం క‌నిపిస్తోంది. ఒక మామూలు క‌మ‌ర్షియ‌ల్ సినిమాతోనూ ఇంత రేంజుంద‌ని నిరూపించారు. అలాంటిది రాజ‌మౌళి తీయ‌బోయే ప్ర‌యోగాత్మ‌క క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి అది ఏ రేంజులో క‌లిసొస్తుందోన‌న్న అంచ‌నాలు మార్కెట్ వ‌ర్గాలు వేస్తున్నాయి. ఇది #RRR మ‌ల్టీస్టార‌ర్ బిజినెస్ రేంజును పెంచుతుంద‌న‌డంలో సందేహం లేదు. #RRRకు అన్నీ మంచి శ‌కున‌ములేన‌ని ఈ స‌న్నివేశం చెబుతోంది.