ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి

భీమ్ ఫ‌ర్ రామరాజు అంటూ రామ్‌చ‌ర‌ణ్ కోసం పుట్టిన‌రోజు కానుక‌గా ఓ వీడియో టీజ‌ర్‌ని సిద్ధం చేశాడు జ‌క్క‌న్న‌. ఎన్టీఆర్ నుంచి ఆ కానుక అందింది చ‌ర‌ణ్‌కి. అందులో ఏముంటుంది? చ‌ర‌ణ్ ఎలా ఉంటాడు? అంటూ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూశారు. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే `ఆర్‌.ఆర్‌.ఆర్‌`లో రామ్‌చ‌ర‌ణ్ మేకోవ‌ర్ ఎలా ఉండ‌బోతోందో ఇందులో మ‌చ్చుకు కొంచెం చూపించారు జ‌క్క‌న్న‌. సినిమాలో చ‌ర‌ణ్ మ‌న్యందొర అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

ఆ పాత్ర‌లో చ‌ర‌ణ్ మేకోవ‌ర్ అదిరిపోయింది. అదొక్కెత్త‌యితే, ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ మ‌రో ఎత్తు. “ఆడు క‌న‌వ‌డితే నిప్పు క‌ణం నిల‌వ‌డిన‌ట్టుంట‌ది. క‌ల‌వ‌డితే ఏగుసుక్క ఎగ‌వ‌డిన‌ట్టుంట‌ది. ఎదురువ‌డితే సావుకైనా సెమ‌ట ధార‌గ‌డ‌త‌ది. బాణ‌మైనా బంధూకైనా వానికి బాంచెన్ అయిత‌ది. ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి. నా అన్న మ‌న్నెం దొర‌. అల్లూరి సీతారామారాజు“ అంటూ రోమాలు నిక్క‌బొడుచుకునేలా ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ చెప్పాడు. అది టీజ‌ర్‌కే హైలెట్‌గా నిలిచింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో మ‌రో విప్ల‌వ‌కారుడు కొమ‌రం భీమ్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. భీం తెలంగాణ వాసి. ఆ స్టైల్‌లోనే ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ చెప్పాడు. చ‌ర‌ణ్ అభిమానుల‌కి మాత్రం ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మంచి కానుకే అందిన‌ట్టైంది. ఈ సినిమాకి వ‌చ్చే యేడాది జ‌న‌వ‌రి 8న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు.