ఎన్టీఆర్-రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్. ఆర్. ఆర్ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. కానీ చిత్రీకరణ ఎంత శాతం పూర్తయిందన్నది యూనిట్ ఇంకా వెల్లడించలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకరి తర్వాత ఒకరు గాయాలుపాలు కావడంతో చిత్రీకరణ విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొంది. వేసుకున్న షెడ్యూల్ ప్రకారమైతే షూటింగ్ జరగలేదు. ఎన్టీఆర్ కు ఇంకా హీరోయిన్ సెట్ కాలేదు. విదేశీ నటి హ్యాండ్ ఇవ్వడంతో ఆస్థానం ఖాళీగానే ఉంది. రాజమౌళి హీరోయిన్ కోసం అన్వేషణ చేస్తున్నాఆ పాత్రకు న్యాయం చేసే నటి దొరకడం లేదు. ఈ నేపథ్యంలో సినిమా ప్రకటించిన తేదికి రిలీజ్ అవుతుందా? అని తాజాగా సందేహాలు రేకెత్తుతున్నాయి.
సినిమా ప్రారంభోత్సవం రోజునే రిలీజ్ తేదీని ప్రకటించడం పరిపాటే. కానీ మధ్యలో చిత్రీకరణకు ఆటంకం ఏర్పడితే వాయిదా తప్పదన్నది తెలిసిన నిజం. ప్రస్తుతం ఆర్ .ఆర్ .ఆర్ విషయంలో ఆ సన్నివేశం రిపీట్ అయ్యేలా ఉందని వార్తలు వస్తున్నాయి. మొత్తం చిత్రీకరణ పూర్తయ్యే సరికి ఏప్రిల్ లేదా మే వస్తుందని, అటుపై మరో ఐదు నెలలపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఇప్పటికే జులై 30న సినిమా రిలీజ్ అవ్వదని బాలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఆ తేదీకి వేరే బాలీవుడ్ సినిమాలు రిలీజ్ కు ప్లాన్ చేసుకోవడంతోనే విషయం బయటకు వచ్చింది. మరి ఈ రూమర్లపై జక్కన్న రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.