`ఆర్.ఆర్.ఆర్`… విడుదల పక్కానే

కరోనాతో చాలా సినిమాలు వాయిదా పడిపోయాయి. ఇక షూటింగ్ల మాట చెప్పనవసరమే లేదు. షెడ్యూళ్లకి షెడ్యూళ్లు లేచిపోయాయి. కరోనా నుంచి విముక్తి పొందిన తర్వాత కూడా షూటింగులు పట్టాలెక్కాలంటే వెంటనే అయ్యే పని కాదు. క్యాస్టింగ్… లొకేషన్లు ఇలా అన్నీ మొదట్నుంచి సెట్ చేసుకోవల్సిందే. ఈ పరిస్థితులు ఉంటాయి కాబట్టి `ఆర్.ఆర్.ఆర్` విడుదలపై కూడా అనుమానాలు రేకెత్తాయి. ఇంకా చాలా వరకు షూటింగ్ చేయాల్సి ఉండటం, ఇప్పటివరకు హీరోయిన్ అలియాభట్ కూడా సెట్లోకి రాకపోవడంతో `ఆర్.ఆర్.ఆర్` ఈసారి కూడా ఫిక్స్ చేసిన టైమ్కి వస్తుందో రాదో, మళ్లీ వాయిదా తప్పదేమో అని మాట్లాడుకున్నారు చాలామంది.

కానీ ఆ డౌట్లేమీ వద్దన్నట్టుగా పక్కాగా క్లారిటీ ఇచ్చాడు జక్కన్న. ఉగాది సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్లో రిలీజ్ డేట్ ఉండటమే ఆ క్లారిటీకి కారణం. దీన్నిబట్టి రాజమౌళి కరోనా హాలిడేస్ని కూడా పక్కాగా ప్లాన్ చేసుకున్నాడని స్పష్టమవుతోంది. నిజంగానే ఈ గ్యాప్లో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసేసి, ఆ తర్వాత మిగిలిన పనులు చేసుకుంటే పెద్ద సమస్యేమీ కాదు. అలాంటి ప్లాన్లో ఉన్నందుకే ఆయన రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీగా ఉన్నాడని చెప్పుకుంటున్నారు సినీ జనాలు. జనవరి 8, 2021 అని రిలీజ్ డేట్ పోస్టర్లలో ప్రింట్ చేయించాడు జక్కన్న. సో.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీరు మాత్రం వచ్చే సంక్రాంతికి `ఆర్.ఆర్.ఆర్` చూడాలని ఫిక్స్ అయిపోండంతే.