త‌ప్పును అంగీక‌రించిన కుర్ర హీరో

ఆర్.ఎక్స్ 100తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని ఆ వెంట‌నే `హిప్పీ` అంటూ ప్ర‌యోగానికి వెళ్లాడు కార్తికేయ‌. రెండో ప్ర‌య‌త్నం బెడిసి కొట్టింది. హిప్పీ ప‌రాజ‌యం కార్తికేయ‌ను తీవ్రంగానే నిరాశ‌ప‌రిచింది. అయితే చేసిన త‌ప్పును అంగీక‌రించ‌డం అంత సులువేమీ కాదు. కానీ ఎలాంటి భేష‌జం లేకుండా కార్తికేయ త‌న త‌ప్పును అంగీక‌రించాడు. తాను న‌టించిన మూడో సినిమా ఆడియో వేదిక‌పై కార్తికేయ మాట్లాడుతూ.. హిట్ తర్వాత ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోవాలో అర్థం కాలేదు. మనకు తెలిసిన మేర కొన్ని కథలను ఎంచుకోవాల‌ని ఎంచుకున్న‌వే! అంటూ ఆల్మోస్ట్ త‌ప్పును అంగీక‌రించారు. కానీ ఈసారి ఆ త‌ప్పును రిపీట్ చేయ‌ననే ధీమాను కార్తికేయ చూపించారు.

కార్తికేయ- అనఘ హీరోహీరోయిన్లుగా ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌జీ మూవీ మేకర్స్‌ పతాకాలపై అర్జున్‌ జంధ్యాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ అనిల్‌ కడియాల- తిరుమల్‌ రెడ్డి నిర్మించిన గుణ 369 ఆడియో తాజాగా మార్కెట్లో రిలీజైంది. ఆడియోని గాన‌గంధ‌ర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం-బోయపాటి శ్రీను విడుదల చేశారు. ఈ వేడుక‌లో హీరో కార్తికేయ మాట్లాడుతూ – “తొలి సినిమా త‌ర్వాత వ‌రుస హిట్లు కొట్టేస్తాన‌ని ప్రిపేర‌వ్వ‌లేదు. హిట్ తర్వాత ఎలా నిర్ణ‌యించుకోవాలో అర్థం కాలేదు. కొన్ని కథలను ఎంచుకుంటాం. బోయపాటి శిష్యుడు మల్లి కథ చెప్పారు. బోయపాటి శిష్యుడంటే పెద్ద స్కేల్‌లో ఉంటుదేమో మనకు సూట్ అవుతుందా? అనుకున్నాను. 20 నిమిషాల క‌థ విని వెంటనే ఓకే చెప్పాను. సినిమా ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదు. ఎలాంటి లెక్కలూ వేసుకోలేదు. ఇప్పుడు స్క్రీన్‌పై చూసుకుంటూ ఉంటే.. అద్భుతాలు లెక్కలేసుకుంటే జరగవు. అలా జరిగిపోతాయనిపించింది. నా నిర్ణయం ఎంత కరెక్టో అనుకున్నాను. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందో.. స్టార్ డమ్ తెస్తుందనో కాదు… నన్ను నేను తెరపై చూసుకున్న సినిమా కావడంతో నాకు ఇది స్పెషల్ మూవీగా భావించాను. నాతోటి వారందరూ గర్వంగా ఫీలవుతారు. నేను నచ్చని వారికి కూడా నచ్చేస్తాననే నమ్మకం ఉంది“ అంటూ ఎమోష‌న్ అయ్యాడు కార్తికేయ‌. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించిన సీడీలు మార్కెట్లోకి రిలీజ‌య్యాయి. గుణ అనే పాత్ర పోషించినందుకు గర్వపడతానని అన్నారు యంగ్ హీరో.