ఆర్ఎక్స్ 100 రివ్యూ

Last Updated on by

రివ్యూ: ఆర్ఎక్స్ 100
న‌టీన‌టులు: కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్ పుత్, రావుర‌మేష్, రాంకీ త‌దిత‌రులు
సంగీతం: చేత‌న్ భ‌ర‌ద్వాజ్
సినిమాటోగ్ర‌ఫీ: రామ్
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: అజ‌య్ భూప‌తి
నిర్మాణం: కార్తికేయ మూవీ క్రియేష‌న్స్

ఈ మ‌ధ్య తెలుగులో బోల్డ్ సినిమాల ట్రెండ్ మొద‌లైంది. బాలీవుడ్ సినిమాల‌లో మాదిరి లిప్ లాక్ సీన్స్ తో పాటు హాట్ సీన్స్ పెట్టేసి సినిమాలు తీస్తున్నారు. అలా వ‌చ్చిందే ఇప్పుడు ఆర్ఎక్స్ 100.. మ‌రి ఇది ఎలా ఉంది..? ఈ సినిమాలో నిజంగానే అంత సినిమా ఉందా..?

క‌థ‌:
శివ(కార్తికేయ‌) థియేట‌ర్ న‌డుపుతుంటాడు. దేనికి బెద‌ర‌ని ర‌కం. శివ‌కు తోడుగా డాడి(రాంకీ) ఉంటాడు. ఈ ఇద్ద‌రూ విశ్వనాథ్ (రావురమేష్) కోసం ప‌ని చేస్తుంటారు. అయితే రాజ‌కీయంగా చిన్న గొడవ వ‌చ్చి విడిపోతారు. విశ్వనాథ్ తో గొడ‌వ స‌మ‌యంలోనే శివ జీవితంలోకి అనుకోకుండా ఇందు(పాయ‌ల్ రాజ్ పుత్) వ‌స్తుంది. ప్రేమిస్తుంది.. ఇద్ద‌రూ క‌లిసి తిరుగుతారు.. పెళ్లికి కూడా సై అంటారు. అంత‌లోనే ఇందు కి మ‌రో పెళ్లి చేస్తారు ఇంట్లో వాళ్లు. దాంతో ఆమె కోసం పిచ్చోడిలా అన్నీ వ‌దిలేసి ఎదురు చూస్తుంటాడు శివ‌. ఆ త‌ర్వాత ఏమైంది.. అత‌డి ప్రేమ‌క‌థ‌కి ముగింపు ఏంటి అనేది క‌థ‌..

క‌థ‌నం:
అర్జున్ రెడ్డిలో మోడ్ర‌న్ దేవ‌దాస్ ఎలా ఉంటాడో చూపించాడు సందీప్ రెడ్డి. విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా దానికి ప్రాణం పోసాడు. కానీ కంటెంట్ బోల్డ్ అనుకుని వ‌చ్చిన ప్ర‌తీ సినిమా అర్జున్ రెడ్డి కాలేదు క‌దా.. ఆర్ఎక్స్ 100లో ఇదే జ‌రిగింది. ఎప్పుడో బోర్ కు వ‌చ్చిన బండిని తీసుకొచ్చి మ‌ళ్లీ కొత్త క‌థ‌లా ప్ర‌జెంట్ చేసాడు ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. తొలి సీన్ నుంచే ఏదో ఉంద‌ని ఇంటెన్సిటీతో మొద‌లుపెట్టి.. క‌థ న‌డుస్తున్న కొద్దీ ఇదా ఉంది అంటూ నీర‌సంగా మారిపోతారు ప్రేక్ష‌కులు. అంత‌గా వాళ్ల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టాడు ద‌ర్శ‌కుడు.

పైగా ఫ‌స్టాఫ్ లో హీరో హీరోయిన్ల మ‌ధ్య రొమాన్స్ కంటే కూడా కామం ఎక్కువ‌గా ఉంటుంది. ఇదే త‌ర్వాత హీరోయిన్ కారెక్ట‌ర్ అని కూడా చూపిస్తాడు ద‌ర్శ‌కుడు. హీరోయిన్ కారెక్ట‌ర్ ను ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దిన విధానం అస‌హ్యంగా ఉంటుంది. హీరో సిక్స్ ప్యాక్ బాడీ చూసి ఆమె మోహించిన‌పుడే అర్థం అయిపోతుంది ఆమె కారెక్ట‌ర్ ఏంటో..? ఇదే చూపించాడు కూడా చివ‌ర్లో. ఇంట‌ర్వెల్ స‌మ‌యానికి అస‌లు క‌థ రివీల్ కావ‌డంతో సినిమాలో చేసేదేమీ ఉండ‌దు. హీరోయిన్ పెళ్లి అయిన త‌ర్వాత ఆమె కోసం వేచి చూడటం త‌ప్ప హీరోకు మ‌రో ఆప్ష‌న్ కూడా క‌నిపించ‌దు. ఈ గోల‌లో ప‌డి పికప్ లేని బండిలా అక్క‌డే ఆగిపోయింది ఆర్ఎక్స్ 100.

న‌టీన‌టులు:
హీరో కార్తికేయ బాగానే ఉన్నాడు.. న‌టించాడు కూడా. తొలి సినిమాతోనే ఇలాంటి కంటెంట్ ఎంచుకోవడం నిజంగా సాహ‌స‌మే. ఇది ఆయ‌న కెరీర్ కు యూజ్ అవుతుందేమో కానీ సినిమాకు మాత్రం కాదు. హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ ఇలాంటి పాత్ర చేయ‌డానికి ముందు ఒప్పుకుందంటే ఆమె గ‌ట్స్ కు దండం పెట్టాల్సిందే. రావుర‌మేష్ టిపిక‌ల్ తెలుగు సినిమా ఫాద‌ర్ రోల్ మ‌రోసారి చేసాడు. ఇక రాంకీ హీరో తండ్రి కాని తండ్రిగా బానే న‌టించాడు. మిగిలిన వాళ్లంతా ఉన్నారంటే ఉన్నారంతే.

టెక్నిక‌ల్ టీం:
ఆర్ఎక్స్ 100లో 9 పాట‌లు ఉన్నాయి. ఈ సినిమాకు ఇన్ని పాట‌లు అవ‌స‌రం లేదు కానీ క‌థ లేద‌నో ఏమో కానీ హీరో హీరోయిన్ క‌లిసినా.. విడిపోయినా పాటల‌నే న‌మ్ముకున్నాడు ద‌ర్శ‌కుడు. పిల్లా రాతో పాటు మ‌రో రెండు పాట‌లు బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ చాలా వీక్. చాలాసీన్లు ఎత్తేయొచ్చేమో అనిపిస్తుంది. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ద‌ర్శ‌కుడిగా అజ‌య్ భూప‌తి డేరింగ్ స్క్రిప్ట్ ఎంచుకున్నాడు కానీ దాన్ని హ్యాండిల్ చేయ‌డంలో పూర్తిగా విఫ‌లం అయ్యాడు.

చివ‌ర‌గా:
ఆర్ఎక్స్ 100.. బోల్డ్ క‌థ కాదు.. ఓల్డ్ క‌థ‌..!

రేటింగ్: 2.5/5.0

User Comments