సాహో మూవీ రివ్యూ

Saaho movie review

న‌టీన‌టులు: ప‌్ర‌భాస్, శ్ర‌ద్ధా క‌పూర్, నీల్ నితిన్, చుంకీ పాండే, అరుణ్ విజ‌య్ త‌దిత‌రులు..
బ్యానర్: యు.వి.క్రియేష‌న్స్
నిర్మాతలు: వ‌ంశీ, ప్ర‌మోద్
సంగీతం: గిబ్రాన్
రచన- దర్శకత్వం: సుజీత్

ముందు మాట:
`బాహుబ‌లి` స్టార్ ప్ర‌భాస్ న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం `సాహో` రాక కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులు ఆసక్తిగా వేచి చూసిన సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ల్డ్ క్లాస్ టెక్నీషియ‌న్స్ .. బ‌హుభాషా న‌టీన‌టుల‌తో చేసిన భారీ ప్ర‌యోగం ఇది. బాహుబ‌లితో పోలిస్తే బ‌డ్జెట్ ప‌రంగా ఏ కోణంలోనూ త‌గ్గ‌లేదు. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని యు.వి.క్రియేష‌న్స్ సంస్థ నిర్మించింది. `ర‌న్ రాజా ర‌న్` లాంటి ప‌రిమిత‌ బ‌డ్జెట్ సినిమాతో విజ‌యం అందుకున్న సుజీత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సుజీత్ చెప్పిన క‌థ న‌చ్చి ప్ర‌భాస్ వెంట‌నే అంగీక‌రించ‌డం.. దానికి ఇంత పెద్ద బ‌డ్జెట్ పెట్టేందుకు యువి క్రియేష‌న్స్ టీమ్ ముందుకు రావ‌డం అన్న‌ది ఓ సాహ‌సం అనే చెప్పాలి. ప్ర‌భాస్ కోసం స్నేహితులు చేసిన ఈ సాహ‌సం ఎంత‌వ‌ర‌కూ ఫ‌లించింది? టీజ‌ర్, ట్రైల‌ర్, మేకింగ్ వీడియోల‌తో మురిపించిన సాహో ఓవ‌రాల్ సినిమాగా ఆడియెన్ కి ఎలాంటి ట్రీట్ ఇచ్చింది? న‌రాలు తెగే ఉత్కంఠ న‌డుమ అంతిమ ఫ‌లితం ఏమిటి? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

సింగిల్ లైన్:
2000 కోట్ల రాబ‌రీ చుట్టూ తిరిగే గ్యాంగ్‌స్ట‌ర్స్‌ స్టోరి ఇది. ఇందులో అండ‌ర్ క‌వ‌ర్ పోలీసాఫీస‌ర్ గా.. దొంగ‌గా ప్ర‌భాస్ ఇచ్చే ట్విస్టులే బ్యాలెన్స్ సినిమా. ఈ క‌థ‌లో పోలీస్ అధికారి శ్ర‌ద్ధా క‌పూర్ ఏం చేసింది? ప‌్ర‌భాస్- శ్ర‌ద్ధా మ‌ధ్య ల‌వ్ స్టోరి ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లింది? ప‌్ర‌మాద‌క‌ర గ్యాంగ్‌స్ట‌ర్లు డ‌బ్బు కోసం ఆడుకునే విజువ‌ల్ రిచ్ వాజీ న‌గ‌రంలో బ్లాక్‌బాక్స్ క‌థేమిటి? డ‌బ్బు దోచుకున్న‌ అస‌లైన గ్యాంగ్‌స్ట‌ర్ కం రోబ‌ర్ ఎవ‌రు? ఈ క‌థ‌లో రివెంజ్ డ్రామా ఏమిటి? అన్న‌ది ఆస‌క్తిక‌రం. వాస్త‌వానికి ఈ సినిమా క‌థ‌లో సోల్ ని ట్రైల‌ర్‌లోనే రివీల్ చేసేసిన సంగ‌తి తెలిసిందే.

కథనం అనాలిసిస్:
ముంబైలో 2000 కోట్ల దోపిడీ మిస్ట‌రీని.. ఎవ‌రికీ చిక్క‌కుండా పోయిన బ్లాక్‌బాక్స్ ట్విస్టుని ఛేదించేందుకు పోలీసాఫీస‌ర్ ముర‌ళీశ‌ర్మ ఆధ్వ‌ర్యంలో అండ‌ర్‌క‌వ‌ర్ పోలీస్ అధికారి అశోక చ‌క్ర‌వ‌ర్తి(ప్ర‌భాస్) బ‌రిలో దిగుతాడు. ఇన్వెస్టిగేష‌న్ ప్రారంభించిన అశోక చ‌క్ర‌వ‌ర్తికి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ ప‌రిశోధ‌న‌లో ఉన్న కో- ఆఫీస‌ర్ అమృత నాయ‌ర్ (శ్ర‌ద్ధా క‌పూర్) ప‌రిచ‌యం అవుతుంది. ఆ త‌ర్వాత ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం ప్రేమ‌గా ప‌రిణ‌మించే క్ర‌మంలో బ్లాక్‌బాక్స్ వేట‌లో ఉన్న విల‌న్ గ్యాంగ్స్‌తో ఈ ల‌వ్ క‌పుల్‌కి ఎదురైన ప్ర‌మాదాలేమిటి? ఈ ప్ర‌మాద‌క‌ర‌ గేమ్ లో క‌థానాయ‌కుడి కోణంలో ట్విస్టులేంటి? విల‌న్ల కోణంలో ఏం జ‌రిగింది? అన్న‌దే క‌థాంశం. వాజీ న‌గ‌రంలో ఉన్న బ్లాక్ బాక్స్ కోసం వేటాడే గ్యాంగ్‌స్ట‌ర్లతో హీరో పోరాటాలు .. ఛేజ్‌లు.. వ‌గైరా వగైరా .. భారీత‌నం నిండిన విజువ‌ల్స్ తో సినిమా ర‌న్ అవుతుంటుంది. అయితే ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే బిగ్ ట్విస్ట్ .. అస‌లు అశోక చ‌క్ర‌వ‌ర్తి ఎవ‌రు? అన్న‌ది రివీల్ చేయ‌డం. అసలింత‌కీ ఈ సినిమాలో అస‌లు పోలీసాఫీస‌ర్ ఎవ‌రు? దొంగ ఎవ‌రు? అన్న చిక్కుముడిని విప్ప‌డమే మిగ‌తా కథాంశం.

దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ పెడుతున్నారు అంటే ఆ సినిమా గ్రాండియారిటీని ఏ లెవ‌ల్లో ఉంటుందో అంచ‌నా వేయొచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు విజువ‌ల్ ఎఫెక్ట్స్ వ‌ర్క్ ఫెంటాస్టిక్ అని చెప్పాలి. యు.వి.క్రియేష‌న్స్ సంస్థ యాక్ష‌న్ దృశ్యాల కోసం డ‌బ్బును మంచినీళ్ల‌లా ఖర్చు చేసింది. అయితే అంత చేసిన‌ప్పుడు ఎంచుకున్న క‌థ విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాల్సి ఉంటుంది. కానీ చేయ‌కూడ‌ని ఆ ఒక్క పొర‌పాటు సాహో విష‌యంలో ఎంతో పెద్ద మూల్యం చెల్లించుకునేలా చేసింద‌ని చెప్పాలి. డార్లింగ్ ప్ర‌భాస్ ని నెవ్వ‌ర్ బిఫోర్ అన్న తీరుగా హాలీవుడ్ స్టార్ రేంజులో ఆవిష్క‌రించేందుకు చూపించిన త‌ప‌న క‌థ విష‌యంలో క‌నిపించ‌లేద‌ని అర్థ‌మ‌వుతుంది. ఇక ఈ సినిమాలో ప్ర‌తి పాట‌ను విజువ‌ల్ గ్రాండియారిటీతో తెర‌కెక్కించిన విధానం మైమ‌రిపిస్తుంది. జాక్విలిన్ బ్యాడ్ బోయ్, సైకో స‌య్యాన్ విజువ‌ల్ రిచ్‌నెస్ తో ఆక‌ట్టుకున్నాయి. ఖ‌రీదైన వాజీ న‌గ‌రంలో ఒక‌రిని మించి ఇంకొక‌రు అన్న‌ట్టుగానే గ్యాంగ్ స్ట‌ర్లు జాకీ ష్రాఫ్, అరుణ్ విజ‌య్, నీల్ నితిన్, చుంకీ పాండే పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేస్తారు. అయితే విల‌న్ల గ్యాంగ్ తో పాటుగా భారీ అనుచ‌ర‌గ‌ణం వ‌గైరా వ‌గైరా ఇంత‌మందిని ప‌రిచ‌యం చేసే క్ర‌మంలో ఎంతో గంద‌ర‌గోళం క‌నిపిస్తుంది. సినిమా ఆద్యంతం ప్ర‌తి ప‌ది నిమిషాల కోసారి వ‌చ్చి వెళ్లే భారీ యాక్ష‌న్ .. ఛేజ్ దృశ్యాలు ఓ వైపు మిరుమిట్లు గొలుపుతున్నా .. క‌థ ప‌రంగా ఎక్క‌డో నిరాశ మాత్రం ఆడియెన్ ని తొలిచేస్తుంది. ఫ‌స్టాఫ్ పూర్త‌య్యేప్ప‌టికి అస‌లు ఈ సినిమాకి ఇంత ఎందుకు ఖ‌ర్చు చేశారు? అన్న ఫీలింగ్ ఆడియెన్ కే క‌లుగుతుంది. సెకండాఫ్‌లో ఏదైనా మిరాకిల్ జ‌రుగుతుందా అని ఎదురు చూసిన వారికి అక్క‌డా నిరాశ త‌ప్ప‌దు. క్లైమాక్స్ ఫైట్ సీన్ కోసం చేసిన సాహ‌సం మ‌హ‌దాద్భుతం అనే చెప్పాలి. వాజీ న‌గరం.. బ్లాక్‌బాక్స్ ఆప‌రేష‌న్ చుట్టూ తిరిగే క‌థ‌లో ప్ర‌భాస్ పాత్ర‌లో టాప్ సీక్రెట్ ని రివీల్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటుంది. అంత భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ప్ర‌భాస్ ని ఎంతో స్టైలిష్ గా.. అంతే ఎగ్రెస్సివ్ గా చూపించిన వైనం ఫెంటాస్టిక్ అని చెప్పాలి. అభిమానులు విజిల్స్ వేసే యాక్ష‌న్ దృశ్యాల‌కు కొద‌వేం లేదు. ఇక సినిమా ఆద్యంతం విజువ‌ల్ గ్రాండియారిటీ కోసం యు.వి.క్రియేష‌న్స్ సంస్థ ఏమాత్రం రాజీకి రాకుండా ఖ‌ర్చు చేసింది. అయితే స్క్రీన్ ప్లే కొత్త‌గా ట్రై చేశామ‌ని సుజీత్ చెప్పినా అదేమీ వ‌ర్క‌వుట్ కాలేద‌నే చెప్పాలి. చాలావ‌ర‌కూ ఆడియెన్ స‌హ‌నాన్ని ప‌రీక్షించాడ‌నే చెప్పాలి.

అశోక చ‌క్ర‌వ‌ర్తిగా ప్ర‌భాస్ ప‌రిచ‌యం ఎంతో సాధాసీదాగానే ఉంటుంది. ఒక ఫైట్ సీన్ తో ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్ ఆ త‌ర్వాత పూర్తి స్థాయి యాక్ష‌న్ మోడ్‌లోకి వెళ్లిపోతాడు. ఇక త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిషోర్, ముర‌ళి శ‌ర్మ‌ ఈ పాత్ర‌ల‌న్నీ డ్రామాలో వ‌చ్చి వెళ‌తాయి. ఇక శ్ర‌ద్ధా క‌ప‌ర్ తో హీరో ప్రేమాయ‌ణం పూర్తి ఫ్లాట్ గా ఉంటుంది. క‌థాంశం అంతే ఫ్లాట్ గా ఉండ‌డం నిరాశ‌ను క‌లిగిస్తుంది.

నటీనటులు:
ఒక అండ‌ర్‌క‌వ‌ర్ పోలీస్‌గా.. దొంగ‌గా ప్ర‌భాస్ డ‌బుల్ షేడ్ ఉన్న పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. ముఖ్యంగా గ‌గుర్పొడిచే యాక్ష‌న్ స‌న్నివేశాల్లో అత‌డి న‌ట‌నకు సాహో అనాల్సిందే. ఇక శ్ర‌ద్ధా అంద‌చందాలు అభిమానుల‌కు క‌నువిందు చేస్తాయి. ప్ర‌భాస్ పాత్ర‌తో సినిమా ఆద్యంతం ట్రావెల్ అయ్యే పాత్ర ఇది. అయితే ల‌వ్‌స్టోరి రొటీన్‌గా ఫ్లాట్ గా ఉండ‌డం మైన‌స్. గ్యాంగ్‌స్ట‌ర్లు నీల్ నితిన్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే త‌మ‌దైన ముద్ర వేస్తారు. ఇత‌ర న‌టీన‌టులు ఓకే.

టెక్నికాలిటీస్:
యు.వి.క్రియేష‌న్స్ నిర్మాణ విలువ‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. డ‌బ్బును మంచి నీళ్ల‌లాగా ఖ‌ర్చు చేశార‌ని చెప్పాలి. 300 కోట్ల బ‌డ్జెట్ లో మెజారిటీ పార్ట్ భారీ యాక్ష‌న్ ఛేజ్ సీన్ల‌కే ఖ‌ర్చు చేశారు. ఇక పాట‌లు విజువ‌ల్ రిచ్ నెస్ తో ఆక‌ట్టుకున్నాయి. సినిమాటోగ్ర‌ఫీ, రీరికార్డింగ్ ఆక‌ట్టుకుంటాయి.

ప్లస్ పాయింట్స్:

* ప్ర‌భాస్ న‌ట‌న‌, యాక్ష‌న్ మోడ్
* గ్యాంగ్‌స్ట‌ర్స్ స్టోరి, గ‌గుర్పొడిచే యాక్ష‌న్
* విజువల్ రిచ్ యాక్ష‌న్ సీన్స్.. ఛేజ్ సీన్స్

మైనస్ పాయింట్స్:

* క‌థ లేక‌పోవ‌డం
* వీక్ స్క్రీన్‌ప్లే, గంద‌ర‌గోళం
* ద‌ర్శ‌కత్వంలో ప‌రిణ‌తి లేక‌పోవ‌డం

ముగింపు:
`రెబ‌ల్` సీక్వెల్ తో డార్లింగ్ మ‌రో దుస్సాహ‌సం!

రేటింగ్:
2/5