ప్రివ్యూ: ఇంటిలిజెంట్

Last Updated on by

ఒక‌టి రెండు కాదు.. ఏకంగా నాలుగు ఫ్లాపుల త‌ర్వాత సాయిధ‌రంతేజ్ నుంచి వ‌స్తోన్న సినిమా ఇంటిలిజెంట్. ఈ వీకెండ్ రానున్న సినిమాల్లో భారీ అంచ‌నాలున్న సినిమా ఇదే. మంచి ఓపెనింగ్స్ ఛాన్స్ ఉన్న సినిమా కూడా ఇదే. మాస్ ఆడియ‌న్స్ ఇంటిలిజెంట్ కోసం ఈగ‌ర్ గా చూస్తున్నారు. వివి వినాయ‌క్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో సాయిధ‌రంతేజ్ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా న‌టించాడు. త‌న కుటుంబానికి జ‌రిగిన అన్యాయానికి ప‌గ తీర్చుకునే ఓ కుర్రాడి క‌థే ఇంటిలిజెంట్. ఇంటిలిజెంట్ ట్రైల‌ర్ చూస్తుంటే ఈ పాటికే ఇది ప‌క్కా వినాయ‌క్ మార్క్ మూవీ అని అర్థ‌మైపోతుంది. క‌థ పాతా కొత్తా అని తేడా లేదు.. ఎలాంటి క‌థ‌తో అయినా మాయ చేయ‌గ‌ల స్క్రీన్ ప్లే మంత్రం వినాయ‌క్ చేతుల్లో ఉంది. ఇంటిలిజెంట్ కు కూడా ఇదే చేస్తున్నాడు వినాయ‌క్. ట్రైల‌ర్ లో సాయిధ‌రంతేజ్ ను స్టార్ హీరో రేంజ్ లో ఎస్టాబ్లిష్ చేసాడు వినాయ‌క్. ఇక త‌న బ‌లం అయిన కామెడీని కూడా అదే స్థాయిలో చూపించాడు వినాయ‌క్.

సాయిధ‌రంతేజ్ కోసం ప‌క్కా మాస్ మ‌సాలా సినిమాను ద‌ట్టించి తీసుకొస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. కామెడీ.. డాన్సులు.. యాక్ష‌న్.. మాస్ అంశాలు.. ఫ్యామిలీ ఎమోష‌న్స్.. ఇలా అన్నీ స‌మ‌పాళ్ల‌లో నింపి ఓ వంట‌కం సిద్ధం చేసాడు వినాయ‌క్. ల‌క్ష్మీ, కృష్ణ‌, నాయ‌క్ లాంటి సినిమాల‌కు క‌థ‌లు అందించిన ఆకుల శివ ఇంటిలిజెంట్ కు త‌న‌దైన శైలిలో ప‌క్కా మాస్ క‌థ‌ను సిద్ధం చేసి వినాయ‌క్ కు ఇచ్చాడు. ర‌వితేజ కృష్ణ సినిమా చూస్తున్న పుడు ఎంత ఎంజాయ్ చేసారో.. ఇంటిలిజెంట్ చూస్తున్న‌పుడు కూడా అంతే ఎంజాయ్ చేస్తారంటున్నాడు వినాయ‌క్. ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది ఇంటిలిజెంట్. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 600 స్క్రీన్స్ లో విడుద‌ల కానుంది. ఇక ఓవ‌ర్సీస్ లోనూ భారీగానే వ‌స్తుంది ఇంటిలిజెంట్. వినాయ‌క్ గ‌త సినిమా ఖైదీ నెం.150 చిరంజీవి సాయంతో అక్క‌డ భారీ ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. ఇప్పుడు వినాయ‌క్ రేంజ్ తో ఇంటిలిజెంట్ ఏం మాయ చేస్తాడో..!

User Comments