సాయిధరం వరుణ్ తేజ్ ఫిబ్రవరి స్పెషల్

ఒక్క‌రోజు కోసం ఇండ‌స్ట్రీలో ఎందుకు ఇంత‌గా పోటీ ప‌డుతున్నారో అర్థం కావ‌ట్లేదు. ఆ ఒక్క తేదీ ఫిబ్ర‌వ‌రి 9. ఆరోజు వ‌స్తున్న సినిమాలు ఐదు. అవును.. న‌మ్మ‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఒకే రోజు ఐదు సినిమాలు రాబోతున్నాయ‌నేది మాత్రం నిజం. ముఖ్యంగా మెగా వార‌సుల మ‌ధ్యే పోటీ ఉండ‌బోతుంది. సాయిధ‌రంతేజ్ న‌టిస్తున్న వినాయ‌క్ సినిమా షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ చిత్ర షూటింగ్ డిసెంబ‌ర్ 18 నుంచి 28 మ‌ధ్య ఒమ‌న్ లో జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ లో క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ బాకీ ఉందంటున్నాడు నిర్మాత‌. ఇది పూర్తైపోతే సినిమా సిద్ధ‌మ‌వుతుంద‌ని.. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ఫిబ్ర‌వ‌రి 9న సాయి సినిమాను విడ‌ద‌ల చేస్తామంటున్నాడు ఈయ‌న‌. దీనికి టైటిల్ నిర్ణ‌యించ‌లేదు కానీ ధ‌ర్మాభాయ్ అనేది మాత్రం ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి యాక్ష‌న్ కామెడీగా తెర‌కెక్కిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

ఇక ఫిబ్ర‌వ‌రి 9నే వ‌రుణ్ తేజ్ న‌టించిన తొలిప్రేమ విడుద‌ల కానుంది. మెగా మేన‌ల్లుడితో అబ్బాయి పోటీ ప‌డాల్సిన ప‌రిస్థితి. అప్ప‌టి వ‌ర‌కు ఇదే తేదీపై ఉంటారా.. లేదంటే మార్చేస్తారా అనేది చూడాలిక‌. దాంతో పాటు మోహ‌న్ బాబు గాయ‌త్రి.. నిఖిల్ కిరాక్ పార్టీ.. సాయిప‌ల్ల‌వి క‌ణం సినిమాలు కూడా అదే రోజు విడుద‌ల కానున్నాయి. ఏ సినిమాను కూడా త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డానికి లేదు. ఇలాంటి టైమ్ లో సాయిధ‌రంతేజ్ రేస్ ను మ‌రింత ఆస‌క్తి క‌రంగా మార్చేసాడు. సాయి సినిమాకు ఆకుల శివ క‌థ రాసాడు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్.. స‌త్యానంద్ త‌మ‌దైన శైలిలో మాట‌లు అందించారు. ఈ చిత్రం అప్ప‌ట్లో చిరంజీవి న‌టించిన కోత‌ల‌రాయుడు త‌ర‌హాలో ఉంటుంద‌ని తెలుస్తుంది. మొత్తానికి సాయి.. మిగిలిన న‌లుగురు ఫిబ్ర‌వ‌రి 9న ఎలాంటి మాయ చేయబోతున్నారో.