మాస్ Vs క్లాస్.. రెండూ రెండే.

Last Updated on by

ఫిబ్ర‌వ‌రి 9 గురించి చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రోజు ఐదు సినిమాలు రావాల్సింది కానీ చివ‌రికి మూడు సినిమాల‌కు వార్ ఫిక్సైపోయింది. అందులో ఇద్ద‌రు ఒకే ఫ్యామిలీ హీరోలున్నారు. వాళ్లే సాయిధ‌రంతేజ్, వ‌రుణ్ తేజ్. ఇద్ద‌రి మ‌ధ్య కావాల్సినంత బాండింగ్ ఉంది. కానీ సినిమాల విష‌యానికి వ‌చ్చిన‌పుడు ఖచ్చితంగా ఆ పోటీ క‌నిపిస్తుంది. అయితే ఈ వార్ ను ఇద్ద‌రూ పెద్ద‌గా సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లు అనిపించట్లేదు. తొలిప్రేమ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయితో పోటీ గురించి వ‌రుణ్ మాట్లాడుతూ.. మా ఇద్ద‌రి మ‌ధ్య పోటీ ఉండ‌దు. సాయి సినిమా హిట్ట‌వ్వాలి.. నాది కూడా ఆడాల‌న్నాడు.

ఇక ఇంటిలిజెంట్ ప్రీ రిలీజ్ లో సాయి అయితే మ‌రింత ఫ్రీగా మాట్లాడేసాడు. అస‌లు వ‌రుణ్ తేజ్ సినిమాతో నాకు పోటీ ఏంటి.. వాడు నేను చిన్న‌ప్ప‌ట్నుంచి క‌లిసి పెరిగాం.. వాన్ని ఎత్తుకుని పెంచాన్నేను.. అలాంటి వాడి సినిమా హిట్టవ్వాలి.. అస‌లు ఒకేరోజు వ‌చ్చి ఇద్ద‌రు మెగా హీరోలు హిట్ కొట్టుంటే ఆ కిక్కే వేర‌ప్పా.. అది మిస్ అయిపోయింద‌న్నాడు సాయిధ‌రంతేజ్. ఓ వైపు సాయిధ‌రంతేజ్.. మ‌రోవైపు వ‌రుణ్ తేజ్ త‌మ త‌మ సినిమాల‌తో ఫిబ్ర‌వ‌రి 9.. 10న వ‌చ్చేస్తున్నారు. ఒక‌రేమో ప‌క్కా మాస్ సినిమాతో వ‌స్తుంటే.. ఇంకొక‌రు క్లాస్ అంటున్నారు. వినాయ‌క్ తెర‌కెక్కించిన ఇంటిలిజెంట్ ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే వ‌చ్చిన ట్రైల‌ర్ కు రెస్పాన్స్ బాగుంది. సాయిధ‌రంతేజ్ ఇందులో 90ల్లో ఉన్న చిరంజీవిలా క‌నిపిస్తున్నాడు. ముఖ్యంగా ఛ‌మ‌క్ ఛ‌మ‌క్ సాంగ్ అయితే అదిరిపోయింది. సి క‌ళ్యాణ్ ఈ చిత్రానికి నిర్మాత‌. ఈ చిత్రంలో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా న‌టించింది.

వ‌రుణ్ తేజ్ కూడా తొలిప్రేమ సినిమాతో ఫిబ్ర‌వ‌రి 10న‌ వ‌స్తున్నాడు. ముందు ఈ చిత్రాన్ని కూడా 9నే విడుద‌ల చేయాల‌ని చూసినా దిల్ రాజు రంగం లోకి దిగి తొలిప్రేమ‌ను ఒక్క రోజు ఆల‌స్యంగా తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేసాడు. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో తొలిప్రేమ వ‌స్తుంది. నాటి ప‌వ‌న్ సినిమాను ఈ సినిమా గుర్తు చేస్తుందో లేదో తెలియ‌దు కానీ ఖచ్చితంగా ఆ సినిమా గౌర‌వం మాత్రం త‌గ్గించ‌న‌ని ధీమాగా చెబుతున్నాడు వెంకీ. ప్ర‌స్తుతం టీం అంతా ప్ర‌మోష‌న్ తోనే బిజీగా ఉన్నారు. రాశీఖ‌న్నా ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. థ‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు. ఈ క్లాష్ లో విజ‌యం ఎవ‌ర్ని వ‌రించబోతుందో..?

User Comments