ఇంట్లో ఇప్పుడు నేను భానుమ‌తినే!  – `ఫిదా` సాయిప‌ల్ల‌వి

sai pallavi interview
రెండు కులాలు.. రెండు మ‌తాలు… ఒక్క‌టే పీస్… హైబ్రిడ్ పిల్లని  అంటూ  సాయిప‌ల్ల‌వి చేస్తున్న సంద‌డిని చూసి తెలుగు కుర్ర‌కారు ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు ఎక్క‌డ చూసినా భానుమ‌తి ముచ్చ‌ట్లే. ఏం న‌టించిందిరా, ఏం మాట్లాడిందిరా అంటూ ఆమె మాయ‌లో ప‌డిపోయారు తెలుగు ప్రేక్ష‌కులు. ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్ని కూడా సాయిప‌ల్లవి భ‌లే న‌చ్చింది. అందుకే ఆమె కోసం ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ప్ర‌స్తుతం ఫిదా స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తూనే, `ఎంసీఎ`లో నానితో క‌లిసి న‌టిస్తున్న సాయిప‌ల్ల‌వి హైద‌రాబాద్‌లో మీడియాతో ముచ్చ‌టించింది. ఆ విష‌యాలివీ…
* `ఫిదా`లో మీ పాత్ర‌కి ఇంత రెస్పాన్స్ వ‌స్తుంద‌ని ఊహించారా?
– భానుమ‌తి పాత్ర విష‌యంలో నేను ముందు నుంచీ న‌మ్మకంగానే ఉన్నా. కాక‌పోతే ఆ పాత్ర‌కి నేను స‌రిపోతానా? అనే విష‌యంలోనే చాలా డౌట్లు వ‌చ్చేవి. శేఖ‌ర్ క‌మ్ముల గారితో కూడా అదే చెప్పా. సినిమాలోని పాత్ర‌ల‌న్నీ చాలా బాగున్నాయి, క‌థ బాగుంది… నా పాత్ర‌ని నేను ర‌క్తిక‌ట్టంచ‌క‌పోతే అంతా చెడిపోతుంది క‌దా అనే భ‌యం క‌లిగేది. కానీ ద‌ర్శ‌కుడు నాపై పెట్టిన న‌మ్మ కాన్ని చూసి ధైర్యంగా సినిమా చేశా. ఇప్పుడొస్తున్న రెస్పాన్స్  చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్ర‌తి ఒక్కరూ భానుమ‌తి అనే పిలుస్తున్నారు. అది మ‌రింత ఉత్సాహాన్నిస్తోంది.
* భానుమ‌తి పాత్ర‌కి స‌రిపోలేన‌ని మీకెందుకు అనిపించింది?
– ఆ పాత్రకీ, నా వ్య‌క్తిత్వానికీ అస‌లు పొంత‌నే ఉండ‌దు. భానుమ‌తి పాత్ర చాలా లౌడ్‌గా, రెబ‌ల్‌లాగా ఉంటుంది. నేనేమో సున్నిత‌మైన అమ్మాయిని. అందుకే ఆ భావాలు నాలో ప‌లుకుతాయా అనే సందేహం వెంటాడేది. ద‌ర్శ‌కుడు మాత్రం `నీ మాట తీరు… నువ్వు క‌నిపిస్తున్న విధానం` పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగానే ఉంద‌ని నన్ను న‌మ్మించి ఒప్పించారు. శేఖ‌ర్‌గారి న‌మ్మ‌క‌మే నిజమైంది.
* ఈ పాత్ర చేశాక మీలో మీకు మార్పులేమైనా క‌నిపిస్తున్నాయా?
– చాలా మార్పులు క‌నిపిస్తున్నాయి. నేను చెప్ప‌డం కాదు కానీ.. మా ఇంట్లోవాళ్లే ఆ మాట చెబుతున్నారు. ఎందుకే అంత గ‌ట్టిగా మాట్లాడుతున్నావు అంటుంటారు. భానుమ‌తి వ‌ల్ల అలా అల‌వాటైంద‌ని చెబుతుంటా. ఆ పాత్ర ఇంకొన్నాళ్లు న‌న్ను విడిచిపెట్టి వెళ్ల‌దేమో. అయితే భానుమ‌తిలాగా బూతులైతే మాట్లాడ‌ట్లేదు కానీ… పుక్కిట్లో నేనేం తీసుకోను అనే మాట‌ని మాత్రం త‌ర‌చుగా వాడుతున్నా.
* సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌నే ఆలోచ‌న మీదేనా?
– మీ వాయిస్ పాత్ర‌కి బాగా సూట‌వుతుంద‌ని ద‌ర్శ‌కుడు ఓ మాటగా చెప్పాడు. దాంతో ఈ సినిమాకి ఎలాగైనా నేనే డ‌బ్బింగ్ చెప్పాల‌ని నిర్ణ‌యించుకొన్నా. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల కూడా నువ్వు చెప్ప‌గ‌ల‌వు అని ప్రోత్స‌హించారు.
* తెలుగు నేర్చుకోవ‌డ‌మే కాదు… ఏకంగా తెలంగాణ యాస‌లో సంభాష‌ణ‌లు చెప్ప‌డం క‌ష్ట‌మ‌నిపించ‌లేదా?
– సెట్లో డైలాగుల్ని ఒక‌టికి ప‌దిసార్లు చ‌దువ‌కొనేదాన్ని. మాట‌ల్ని ఎలా ప‌ల‌కాలో ద‌ర్శ‌కుడు స్ప‌ష్టంగా చెప్పేవారు. దాంతో నాకు తెలంగాణ యాస అల‌వాటైంది. ఇప్పుడు వేరే సెట్‌కి వెళ్లినా తెలంగాణ తెలుగులోనే మాట్లాడుతున్నా.  మామూలు తెలుగులో మాట్లాడాలంటే ఇంకొంచెం స‌మ‌యం ప‌డుతుంద‌ని చెబుతున్నా.
* లంగాఓణీతో పాటు.. ఓ స‌న్నివేశంలో మోడ్ర‌న్ డ్రెస్ కూడా వేసుకొన్నారు. కంఫ‌ర్ట్‌గా ఫీల‌య్యారా?
– అక్క‌డ త‌ప్ప‌క వేసుకోవాలి. స‌న్నివేశం అలా డిమాండ్ చేసింది. దాంతో  ఒప్పుకొన్నా. అంద‌రి అమ్మాయిల్లాగా నేను కూడా ఆ డ్రెస్ వేసుకొన్నా. తెర‌పై కూడా కాన్ఫిడెంట్‌గానే క‌నిపించాను క‌దా!
*  ప్రేమ‌మ్ సినిమాలో న‌టించిన హీరోయిన్లంతా ఇదివ‌ర‌కే తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. మీరెందుకు ఆల‌స్యం చేశారు?
– తెలుగులో ప్రేమ‌మ్‌లో న‌టిస్తున్నావంట క‌దా అని న‌న్ను కూడా చాలామంది అడిగారు. అయితే ఎవ్వ‌రూ ఆ పాత్ర కోసం న‌న్ను సంప్ర‌దించ‌లేదు. ఇంకో విష‌య‌మేంటంటే నేను ఒక‌చోట చేసిన పాత్ర‌ల్ని ఇంకో చోట చేయాలంటే కాస్త ఇన్‌సెక్యూర్‌గా ఫీల‌వుతుంటా. ఇక్క‌డి మ్యాజిక్ అక్క‌డ మ‌ళ్లీ రిక్రియేట్ అవుతుందా అనే భ‌యం ఉంటుంది. రీమేక్‌ల‌కి దూరం అని చెప్పను కానీ.. భ‌యం మాత్రం కాస్త ఉంటుంది.
* ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫ్యాన్‌గా న‌టించారు క‌దా… ఆయ‌న సినిమాల్ని చూశారా?
– గ‌బ్బ‌ర్‌సింగ్ చూశా. సినిమాలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడంతా ఈల‌లు కేక‌లు వేస్తున్నారు ప్రేక్ష‌కులు. నా డైలాగ్‌కి యాక్ష‌న్‌కి ఆ రెస్పాన్సా లేక ఆయ‌న ఫొటోకా అనిపించింది.
* వ‌రుణ్‌తేజ్‌, శేఖ‌ర్‌క‌మ్ముల‌ల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది? 
– వ‌రుణ్‌తేజ్ మంచి న‌టుడు. చిన్న చిన్న భావాల్ని కూడా చ‌క్క‌గా ప‌లికించాడు. త‌న‌తో చిత్రీక‌ర‌ణ చాలా ఫ‌న్‌గా, స‌ర‌దాగా సాగిపోయింది. శేఖ‌ర్ క‌మ్ముల భానుమ‌తి పాత్ర‌కి న‌న్ను బ‌లంగా న‌మ్మారు. మొద‌ట సెట్లో ప్రేమ‌మ్ పాత్ర పేరుతో  మ‌లార్ మ‌లార్ అని పిలిచేవారు. నేను మాత్రం భానుమ‌తి అనే పిల‌వండ‌ని చెప్పేదాన్ని. మీరు కూడా న‌న్ను భానుమతిగా గుర్తించక‌పోతే ఎలా అని చెప్పేదాన్ని. అప్పట్నుంచి భాను అనే పిల‌వ‌డం మొద‌లుపెట్టారు. దాంతో నాలో మ‌రింత కాన్ఫిడెన్స్  పెరిగింది.
* ప్ర‌స్తుతం నానితో క‌లిసి చేస్తున్న సినిమాలో మీ పాత్ర ఎలా ఉండ‌బోతోంది?
– మిడిల్ క్లాస్ అమ్మాయిగా క‌నిపిస్తా. ప్ర‌స్తుతం ఆ సినిమాతో పాటు త‌మిళంలో ఓ సినిమా చేస్తున్నా.
* ఒక ప‌క్క‌యాక్ట‌ర్‌గా కొన‌సాగుతూనే మ‌రో ప‌క్క డాక్ట‌ర్ చ‌దువు కూడా చ‌దువుతున్నార‌ట క‌దా… 
– యాక్టింగ్ త‌ర్వాత నేను డాక్ట‌ర్‌గానే ప‌నిచేయాలి క‌దా.  కార్డియాల‌జిస్ట్ కావాల‌నే నా ల‌క్ష్యం. ప్ర‌స్తుతం ఎం.బి.బి.ఎస్‌. అయిపోయింది. పై చ‌దువుల‌పై దృష్టిపెట్టా.
* మొహంపై  పింపుల్స్‌తో క‌నిపించ‌డంతోనే మీ న‌ట‌న‌లో స‌హ‌జ‌త్వం క‌నిపిస్తోంద‌నుకోవ‌చ్చా?
– అది నిజ‌మే. మొద‌ట్లో హీరోయిన్ అంటే దేవ‌క‌న్య‌లాగే ఉండాలేమో అనుకొనేవారు. అంతెందుకు నాకూ అలాగే అనిపించేది. కానీ ప్రేమ‌మ్‌లో మ‌లార్ పాత్ర చేసేట‌ప్పుడు నువ్వు నీలాగే ఉండాల‌న్నారు. దాంతో నాలో మ‌రింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇప్పుడు అమ్మాయిలంతా కూడా పింపుల్స్ ఉన్నా సాయిప‌ల్ల‌విలాగా కాన్ఫిడెన్ష్‌గా క‌నిపించొచ్చు అంటున్నారు. అంత‌కంటే ఏం కావాలి?