దుమ్ము దులిపి చైనాకి ఎక్స్ పోర్ట్

Last Updated on by

ఒక్క‌సారి సినిమా విడుద‌లైన త‌ర్వాత దాని గురించి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆలోచించ‌డానికి ఏమీ ఉండ‌దు. ఔట్ పుట్ చూస్తూ కూర్చోవ‌డం త‌ప్ప‌. ఇక సినిమా వ‌చ్చి రెండు మూడేళ్లైతే దాన్ని ప‌ట్టించుకోవ‌డం కూడా మానేస్తారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో అలా కాదు. వ‌చ్చిన రెండేళ్ల‌కు కూడా ఇంకా కొన్ని సినిమాలు నిర్మాత‌ల‌కు కాసులు కురిపిస్తున్నాయి. దంగ‌ల్ ఇండియాలో విడుద‌లైన ఆర్నెళ్ల‌కు చైనాలో విడుద‌లై ఏకంగా 1200 కోట్లు వ‌సూలు చేసింది.. ఇక సీక్రేట్ సూప‌ర్ స్టార్ కూడా ఇక్క‌డ వ‌చ్చిన ఏడాదికి అక్క‌డికి వెళ్లి 736 కోట్లు వ‌సూలు చేసింది. విడుద‌లైన సినిమాల‌కు దుమ్ముదులిపి బాక్సుల్లో పెట్టి మ‌ళ్లీ అమ్మేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్పుడు చైనాలో ఇలాగే విడుద‌ల‌కు సిద్ధ‌మైంది స‌ల్మాన్ ఖాన్ భ‌జ‌రంగీ భాయీజాన్. ఈ సినిమా 2015లో విడుద‌లైంది. ఇప్పుడు చైనాలో రాబోతుంది.

ఈయ‌న న‌టించిన భ‌జ‌రంగీ భాయీజాన్ చైనాలో విడుద‌ల కానుంది. మార్చ్ 2న అక్క‌డ ఏకంగా 8 వేల థియేట‌ర్స్ లో రానుంది భ‌జ‌రంగీ భాయీ జాన్. ఈ చిత్రాన్ని అక్క‌డ లిటిల్ లోలిత మంకీ గాడ్ అంకుల్ పేరుతో అనువ‌దిస్తున్నారు. ఈ సినిమాకు అక్క‌డి లోక‌ల్ వెబ్ సైట్లు ఇప్ప‌టికే ప‌దికి 8 రేటింగ్ ఇచ్చేసారు. దాంతో ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. భ‌జ‌రంగీ భాయీజాన్ కూడా బాగా ఎమోష‌న‌ల్ స్టోరీ. 2015లో ఇక్క‌డ విడుద‌లైన సినిమా 600 కోట్లు వ‌సూలు చేసింది. దంగ‌ల్, సీక్రేట్ సూప‌ర్ స్టార్ అక్క‌డి ప్రేక్ష‌కుల‌కు ఇంత‌గా న‌చ్చ‌డానికి కార‌ణం అందులో ఉన్న ఎమోష‌నే. భ‌జ‌రంగీ భాయీజాన్ లో అలాంటి ఎమోష‌న్ ట‌న్నుల కొద్దీ ఉంది. పాక్ నుంచి త‌ప్పిపోయిన ఓ మూగ అమ్మాయిని తిరిగి త‌న ఇంటికి హీరో ఎలా చేర్చాడు అనేది క‌థ‌. ఇండియా పాక్ మ‌ధ్య వ‌చ్చిన స‌న్నివేశాల‌న్నీ హృద‌యాన్ని హ‌త్తుకునేలా ఉన్నాయి. దాంతో ఈ చిత్రం చైనాలో కూడా విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నారు చిత్ర‌యూనిట్.

బాలీవుడ్ హీరోలే కాదు.. మ‌న హీరోలు కూడా చైనాపై క‌న్నేస్తున్నారు. ర‌జినీ 2.0 చైనాలో ఏకంగా 15000 థియేట‌ర్స్ లో విడుద‌ల కానుంది. ఇది నిజంగా ఓ రికార్డ్. 20000 థియేట‌ర్స్ ఉన్న చైనాలో 75 శాతం స్క్రీన్స్ లో 2.0నే వ‌స్తుంది. ఇదే ఏడాది 2.0 విడుద‌ల కానుంది. ఇక్క‌డ మ‌రో ఆస‌క్తి క‌ర‌మైన విష‌యం కూడా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు చైనాలో కేవ‌లం అమీర్ ఖాన్ సినిమాల‌కు మాత్ర‌మే డిమాండ్ ఉంది. బాహుబ‌లిని చైనాలో విడుద‌ల చేసి చేతులు కాల్చుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అంటే అక్క‌డి వాళ్ల‌కు మ‌న వార్ సినిమాలు పెద్ద‌గా న‌చ్చ‌వు. టెక్నాల‌జీ ఎక్కువ‌గా ఉన్నా.. విజువ‌ల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్న బాహుబ‌లిని కూడా వాళ్లు తిప్పికొట్టారు. ఈ లెక్క‌న 2.0 సైన్స్ ఫిక్ష‌న్ డ్రామా. ఇప్ప‌టికే అక్క‌డ ఇలాంటి సినిమాలు చాలానే వ‌చ్చుంటాయి. కానీ వాట‌న్నింటినీ మించి ఏదో ఉంద‌ని 2.0లో శంక‌ర్ చైనీయుల‌కు చూపించాలి. మొత్తానికి మ‌న సినిమాల‌కు ఇప్పుడు చైనా మ‌రో బాక్సాఫీస్ లా మారిపోయింది.

User Comments