స‌ల్మాన్ కృష్ణుడా? కృష్ణ కృష్ణ‌!

Last Updated on by

బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ఖాన్ `మహాభారతం 3డి` భారీ సిరీస్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో ఐదు భాగాలుగా ఈ సిరీస్ని నిర్మించేందుకు సన్నాహకాల్లో ఉన్నాడు. ఆ క్రమంలోనే రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత అంబానీ సైతం ఈ ప్రాజెక్టులో భాగమై, భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. రాజుగారే తలుచుకుంటే దెబ్బలకు కొదవా? ఇక వెనుదిరిగి చూడకుండా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు అమీర్ ప్రణాళికలు వేస్తున్నారు. ప్రస్తుతం ఆన్సెట్స్ ఉన్న థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రం పూర్తవ్వగానే మహాభారతం పనిలోనే ఉంటాడట. అంతా బాగానే ఉంది .. ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించే నటీనటులెవరు? అన్నదానికి అమీర్ నుంచి ఇన్నాళ్లు సమాధానం లేదు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ కీలకమైన అప్డేట్ అందింది. `మహాభారతం 3డి`లో దృతరాష్ట్రుని పాత్రకు బిగ్బి అమితాబ్ని ఒప్పించే పనిలోఉన్నాడు అమీర్. అలానే తన మరో గుడ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్ ఇందులోకృష్ణుడి పాత్రలో నటిస్తే బావుంటుందని అమీర్ భావిస్తున్నాడట.
ఇదివరకూ ఓ సందర్భంలో తాను మహాభారతంలో నటిస్తే కృష్ణుడిగా నటిస్తానని సల్మాన్ అన్నారు. అందుకే ఇప్పుడు ఆ పాత్రకు అమీర్ సంప్రదించే ఆలోచనలో ఉన్నారని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఈ భారీ ప్రాజెక్టులో అమీర్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ఓ కీలకపాత్ర పోషిస్తారని ప్రచారమైంది. అయితే అమీర్ మహాభారతం అత్యంత భారీ కాన్వాసుతో భారీ తారాగణంతో ఉండబోతోందని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో అమీర్ ఏ పాత్రలో నటిస్తారు? అంటే అర్జునుడి పాత్రలో నటించే అవకాశం ఉందని చెబుతున్నారు. తాను నటిస్తే కృష్ణుడు లేదా అర్జునుడిగా నటిస్తానని ఇదివరకూ అమీర్ తెలిపారు. కర్ణుడి పాత్ర అన్నా ఇష్టమని అన్నారు. మొత్తానికి ఈ ప్రాజెక్టు దిగ్విజయంగా ముందుకే కదులుతోందని తాజా సన్నాహకాలు చెబుతున్నాయి.

User Comments