పోలీసుల కాళ్ల‌కు ద‌ణ్ణం పెట్టాలి

దిశ  ఎన్ కౌంట‌ర్ దేశ‌వ్యాప్తంగా మార్మోగుతోంది. సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు సెల‌బ్రిటీల్లోనూ హ‌ర్షాతిరేకం వ్య‌క్త‌మైంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు ప్ర‌శంస‌ల‌తో పోలీసుల‌కు స‌లాం కొడుతున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, హరీశ్ శంకర్‌లు ఇప్పటికే స్పందించగా, తాజాగా నటుడు మంచు మనోజ్ స్పందించాడు.

నిందితులను ఎన్‌కౌంటర్ చేసేందుకు పోలీసులు ఉపయోగించిన ఆ బుల్లెట్లను దాచుకోవాలని ఉందని, ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉందని అన్నాడు. ఎన్‌కౌంటర్ చేసిన ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉందని అన్నాడు. నలుగురు చచ్చారనే వార్త లో ఇంత కిక్కు ఉందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
“ఈ రోజే నీ ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా“ అని  మనోజ్ ట్వీట్ చేశాడు. ఇటీవల దిశ ఇంటికి వెళ్లిన మనోజ్ ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. ఊర్లో ఒక్కడే రౌడీ ఉండాలి. ఆ రౌడీ పోలీసై ఉండాలి అంటూ నాని ట్వీట్ చేశారు. ఇక షాద్ నగర్ వద్ద దిశ నిందితుల‌ ఎన్ కౌంటర్ నేటి తెల్ల‌వారు ఝామున 3.30 ప్రాంతంలో జ‌రిగింది. సీన్ రీ-కనస్ట్రక్షన్ చేస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేసిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంట‌ర్ చేశారు. స్పాట్ లో అక్కడికక్కడే  నలుగురు నిందితులు మృతి చెందడంతో దిశకు జస్టిస్ జరిగింది అన్న నినాదాలు జ‌నాల్లో మిన్నంటాయి. 24 గం.లలో మర్డర్ చేసిన న‌లుగురు నిందితులను పట్టుకున్న పోలీసులు ప‌దో రోజుకే క‌థ‌ను ఎన్ కౌంట‌ర్ తో ముగించారు. ఒక ర‌కంగా ప్ర‌జాతీర్పు పోలీసుల కోర్టులో వెలువ‌డింది అంటూ హ‌ర్ష‌ద్వానాలు మిన్నంటాయి. ఈ ప‌ని చేసిన‌ తెలంగాణ పోలీసులపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.