పెళ్లయ్యాక ఆ క‌థే వేరులే! -సమంత

నాగచైతన్య, సమంత పెళ్లి త‌ర్వాత‌ జంటగా నటించిన ‘మజిలి’ ఏప్రిల్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ‘నిన్ను కోరి’ ఫేం శివనిర్వాణ దర్శకత్వం వహించారు. సాహు గారపాటి హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. తాజాగా హైద‌రాబాద్ లో పాత్రికేయుల‌తో సామ్ ముచ్చట్లివి.

పెళ్లయ్యాక తొలి సినిమా. ఆన్ లొకేషన్ కొంచెం కష్టంగా అనిపించిందా?
చైతన్య వైపు నుంచి ఏ క‌ష్టం లేదు. కానీ నా వైపు నుంచి కొంచెం కష్టమే అనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందు మోనిటర్ చూస్తే నేను నా పెర్ఫార్మెన్స్ మాత్రమే చూసేదాన్ని. కానీ మజిలీలో నా న‌ట‌న కంటే చైతన్య న‌ట‌న‌ను చూసి ఇది ఓకే కదా ఇది ఓకే కదా! అని ఎగ్జయిట్ అవుతూ అడిగేదాన్ని. కుదురుగా ఉండు.. ద‌ర్శ‌కుడు చూసుకుంటారు అది అనే వారు. నావల్ల కాస్త ఆయనకి చికాకు క‌లిగేది.

పెళ్లయ్యాక కదా… కథని కరెక్ట్ గా ఎంపిక చేసుకున్నారా?
ఇప్పుడు మేం కలిసి న‌టించ‌డం నాకు అంత ఇష్టం లేదు. అలా చేస్తే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని అంత తేలిగ్గా మనం సంతృప్తిపరచలేం అని అనిపించింది. ఇప్పుడు మేమిద్దరం ఒకరినొకరు చూసుకోవడం, ప్రేమలో పడటం వంటి సినిమాలు చేస్తే ఎవరు చూస్తారు? కలిసి చేస్తే ఏదైనా కొత్తగా చేయాలి. ‘మజిలి’ అలాంటి కొత్త కథే. నాకు పెళ్లయి రెండేళ్లయింది. నాకు పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఉన్న ప్రేమకు తేడా గుర్తించగలుగుతున్నా. పెళ్లయ్యాక నేను అనుభవిస్తున్న ప్రేమ నాకు ఓ సెక్యూరిటీగా ఉంది. మనశ్శాంతిగా ఉంది. పెళ్లయిన తర్వాత ప్రేమలో ఒక అందం ఉంటుంది. ఈ ప్రేమను ఎందుకు చాలా మంది సినిమాల్లో చెప్పడం లేదు అని అనిపించింది. ఒకమ్మాయికి పెళ్లయ్యాక కేవలం భర్తతో ప్రేమ కాదు.. ఆ కుటుంబంతో ప్రేమ మొదలవుతుంది. అమ్మతో, నాన్నతో… ఆకుటుంబంలో ఉన్న అందరితోనూ జర్నీ మొదలవుతుంది.

చై భార్య పాత్ర ఎలా అనిపించింది?
నా జీవితంలో ఒక మోటో ఉంటుంది. నేనెప్పుడూ నిన్నటికంటే బెటర్‌గా ఉండాలనుకుంటా. రేపు ఈ రోజుకన్నా రేపు ఇంకా బావుండాలనుకుంటా. నా గత చిత్రం కన్నా ఈ సినిమాలో ఏదో ఒక లేయర్ అని ఉండాలి. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ లో ఆ లేయర్ ఉంది. ఇందులో శ్రావణి అనే పాత్ర చాలెంజింగ్ గా అనిపించింది. అది నాకు చాలా కొత్త రోల్.

ఈ పాత్రతో నిజజీవితానికి పొంతన ఉందా?
శక్తి యుక్తిలో పోలిక ఉంటుంది. కానీ నేనెక్కువ మాట్లాడతాను. శ్రావణి మాట్లాడదు.
పెళ్లి తర్వాత ఈ తరహా కథలు చేయాలనుకున్నారా?
అలాంటిదేమీ లేదు.

స్క్రిప్ట్ విన్నాక మార్పులు చెప్పారా?
అలాంటిదేమీ లేదు. నేను కథ వింటున్నప్పుడు చేయాలా? వద్దా? అని నిర్ణయించుకుంటాను. నేను ఒక్కసారి వద్దనుకుంటే.. ఎన్ని మార్పులు చేసి తీసుకొచ్చినా నేను చేయను. ఒకవేళ నేను ఓకే చెప్పాననుకోండి.. అసలు అందులో వేలు పెట్టను. ‘మజిలి’ కథ వినగానే వెంటనే నచ్చి, ఓకే చెప్పా. ఇటీవల సినిమా చూసుకున్న తర్వాత ఆయన చెప్పినదానికన్నా బాగా తీశారని అనిపించింది.

ఇంట్లో వృత్తి గత ముచ్చట్లు ఉంటాయా?
ఇంటికి వచ్చాక కూడా మాట్లాడుకునేవాళ్లం. ఇందులో చైతూ.. పూర్ణ అనే పాత్ర చేశాడు. ఉద్వేగం ఉన్న పాత్ర అది. ప్రతి రోజు అతనికి సపోర్ట్ చేయడానికి నేను ఉండేదాన్ని. క్లైమాక్స్ చాలా బాగా డిస్కస్ చేశాం.

ఎమోషన్ పెరిగితే బరువు కదా?
ప్రతి ప్రేమకథలోనూ ఒకే రకమైన భావాలుంటాయి. ఈ సినిమాలో పూర్ణ, శ్రావణి, అన్షు భావోద్వేగాలు చాలా కీలకం. ఈ సినిమాలోని ఈ పాత్రలకు ప్రేక్షకులు ఎంత కనెక్టయితే సినిమా అంత హిట్ అవుతుంది. శివ ఈ పాత్రలను చాలా బాగా డిజైన్ చేశారు.

సూపర్ డీలక్స్ రెస్పాన్స్ బావుంది క‌దా?
అందులో నా పాత్ర గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడ‌టం నేను ఊహించలేదు. తిట్టేస్తార‌నే అనుకున్నా. ఎందుకంటే ఆ పాత్ర అంత బోల్డ్ గా ఉంటుంది. ఆ సినిమా ఇంటర్వ్యూల్లోనూ చాలెంజింగ్ గా తీసుకుని చేశాననే చెప్పా. ఇప్పుడు ఆ సినిమాకు అంత మంచి ప్రశంస వస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అన్నీ పొగ‌డ్త‌లే వ‌స్తున్నాయి.

సినిమాలో లిప్‌లాక్ వివాదంపై?
కిస్, హగ్గు, టచ్… స్క్రీన్ పైన ఏదైనా ఒకటే. నేను నటిగా దాన్ని అలాగే చూస్తానంతే. ఎందుకంటే ఆ సీన్‌కి కిస్ కావాలి. అక్కడ మాటలు దాటిన ఎమోషన్ ఉంది. అందుకే చైతన్య ఆమెను కిస్ చేశారు.

ఆ సీన్ చూశారా.. మీరెలా ఫీలయ్యారు?
ఆ సీన్ గురించి నాకు ముందు తెలియదు. ఒకరోజు శివగారు “సమంతా రండి. మీకు చూపిస్తాను” అని చూపించారు. నేను చూసిన తర్వాత “ఓహో కిస్ చేశారా” అని అనుకున్నా.

మజిలీలో ఆ స్పెషల్ లేయర్ ఏంటి?
హీరోగారికి అప్పటిదాకా ఒకమ్మాయితో లవ్ ఉంటుంది. అంతసేపు వాళ్లని చూసి ఆనందించిన ఆడియన్ ఉన్నట్టుండి నన్ను అంగీకరించాలి. అంటే తొలి సన్నివేశంలోనే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఏదో అక్కడ ఇంపాక్ట్ చూపించాలి. పైగా ఎక్కువ మాట్లాడలేను. అలాంటప్పుడు అది నాకు చాలెంజింగ్ పాత్రే కదా. కొన్నిసార్లు కళ్లతో భావాలు పలికించాలి. కొన్ని సార్లు కేవలం నా అభినయంతోనే అంతా చెప్పగలగాలి. ఈ కథలో నాకు కనెక్ట్ అయినది అదే.

పెళ్లయ్యాక ఆయనతో నటించడం ఎలా అనిపించింది?
నాకు ఎదురుగా ఉన్న ఆర్టిస్ట్ ఎవరైనా సరే, నేను నా 100 శాతం నటనను కనబరుస్తానంతే. యాక్షన్ అనగానే నా ముందున్నది ఎవరు? వాళ్లతో నాకున్న బంధం ఏంటి? వాళ్లను నేను ఇష్టపడతానా? ఇష్టపడనా?… అసలు ఇలాంటివేమీ పట్టించుకోను. త‌న‌తో చాలా హ్యాపీ అనిపించింది.

పరిశ్రమకు వచ్చి తొమ్మిదేళ్లు క‌దా?
దూకుడు చేసేటప్పుడు మహేష్ నాకు కెరీర్ బెస్ట్ సలహా ఇచ్చారు. ప్రతి సినిమానూ తొలి సినిమా అనుకో! అని అన్నారు. ఆ మాట నాపై చాలా బాగా ప్రభావితం చేసింది. తొమ్మిద‌ళ్ల‌యినా నేను తొలి సినిమాను కొత్త సినిమా అనుకుంటా. సెట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ అదే గౌరవం.. అదే ట్రీట్మెంట్ ఇస్తా.

దర్శకుడు శివ తొలి సినిమాకు తన స్నేహం స్ఫూర్తి అన్నారు. ఈ సినిమాకు అలా ఏదైనా ఉందా?
శివకు వైజాగ్ అంటే ప్రాణం. అక్కడున్న ఒక రాయి గురించి కూడా ఐదు నిమిషాలు మాట్లాడుతారు. అంతటి అభిమానం ఉంటుంది. ఆ వైజాగ్ ఒరిజినాలిటీ ప్రతి మాటలో, ప్రతి విజువల్‌లో కనిపిస్తుంది. మిడిల్ క్లాస్ సెట్టింగ్ మొత్తం చాలా ఒరిజినల్‌గా ఉంటుంది. మొదటి సినిమాకు, రెండో సినిమాకు మధ్య మరో పది సినిమాలు చేసినంత అనుభవాన్ని చూపించాడు.

1980ల నాటి కథాంశమా?
1990లో జ‌రిగే క‌థాంశ‌మిది. ఈ సినిమాలో ప్రేమ .. పెయిన్ ఉంది. అబ్బాయి జీవితం, అతను మగాడిగా మారడం, అతను వాస్తవాలను అర్థం చేసుకోవడం వంటివి ఉంటాయి. ఇది ముక్కోణపు ప్రేమకథ కాదు.

త‌దుప‌రి చిత్రాలు?
ఓ బేబీ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. సమ్మర్ చివ‌రిలో రిలీజ‌వుతుంది. పూర్తి స్థాయి కామెడీ రోల్ చేయాలని నాకు కోరిక ఓ బేబీతో నెరవేరుతుంది. 96లో తమిళంలో త్రిష చేసిన పాత్రను నేను ఇక్కడ చేస్తున్నా.