టాలీవుడ్ డ్రగ్స్ పై సమంత సింగిల్ డైలాగ్!

టాలీవుడ్ ను వదల బొమ్మాలి అంటున్న డ్రగ్స్ మాఫియా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ నుంచి స్టార్ హీరో మెడ వరకు చుట్టుకునేలా కనిపిస్తుంది. దీంతో సినీ పరిశ్రమకు సంబంధించి ఎవరూ కనిపించినా ఇప్పుడు మీడియా వదలడం లేదు. ఈ కారణంగా చాలామంది సెలబ్రిటీలు ఈ విషయంలో మీడియాకు దూరంగా ఉండాలనే అనుకుంటున్నారు. అయితే, మీడియా కంట పడిన వాళ్ళు మాత్రం.. ఏం జరిగినా మా సినిమా వాళ్లనే టార్గెట్ చేయడం అలవాటైపోయిందని, ఇది కరెక్ట్ కాదని అన్నట్లుగా తమ వెర్షన్ వినిపించి వెళ్లిపోతున్నారు. కొంతమందైతే ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగా సైలెంట్ గా ఉండిపోతున్నారు.

కానీ, చెన్నై చిన్నది తెలుగింటి కోడలు అక్కినేని సమంత మాత్రం ఈ టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై తన స్టైల్లో ఒకే ఒక్క డైలాగ్ చెప్పి వెళ్లిపోవడం గమనార్హం. అసలు విషయంలోకి వెళితే, చైతూతో పెళ్ళికి రెడీ అవుతున్న తరుణంలో సమంత ఓవైపు చేతిలో ఉన్న సినిమాలను స్పీడ్ గా పూర్తి చేస్తూనే.. మరోవైపు తనకున్న పలు కంపెనీల బ్రాండింగ్ పనులను చేసుకుంటూ పోతుంది. ఈ క్రమంలోనే తాజాగా తను ప్రచారం చేస్తోన్న ఓ మొబైల్ ఫోన్ విక్రయాల కంపెనీ కొత్త షోరూమ్ లాంచింగ్ కోసం సమంత హన్మకొండ వచ్చింది.

ఈ సందర్బంగా షోరూమ్ ను ప్రారంభించిన అనంతరం సమంత మీడియాతో మాట్లాడుతున్న సమయంలో టాలీవుడ్ డ్రగ్స్ గురించి స్పందించాల్సిందిగా మీడియా జనాలు కోరడం జరిగింది. మామూలుగా అయితే ఏ విషయంపైనైనా సమంత తన అభిప్రాయాన్ని బల్లగుద్దినట్లు మరీ చెబుతుంది కాబట్టి.. దీనిపై కూడా అలానే స్పందిస్తుందని మీడియా జనాలు అంచనా వేశారు. కానీ, సమంత అందరి అంచనాలను తలక్రిందులు చేసి డ్రగ్స్ విషయంలో మాత్రం ఎందుకో సింపుల్ గా ‘నో కామెంట్’ అంటూ ఒకే ఒక్క డైలాగ్ చెప్పి తప్పించుకుంది. అంతేకాకుండా భారతీయ మహిళా క్రికెట్ జట్టు ఫైనల్ కు చేరుకున్న సందర్బంగా బెస్టాఫ్ లక్ చెబుతూ మేటర్ ను తెలివిగా డైవర్ట్ చేసింది. ఏదిఏమైనా, అనవసరమైన వివాదంలో తలదూర్చడం ఎందుకు అనుకుందేమో.. ఇలా ఎస్కేప్ అవుతున్న జాబితాలో సమంత కూడా చేరిపోయింది.

Follow US