Last Updated on by
ఎవరండీ సమ్మర్ వస్తే మంటలు పుడతాయి అని చెప్పింది..! ఒక్కసారి సమంతను అడగండి.. సమ్మర్ ఎంత సల్లగా ఉంటుందో చెబుతుంది. మళ్లీ మళ్లీ ఇలాంటి సమ్మర్ లు రావాలని కోరుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తప్పులేదు ఎందుకంటే ఈ సమ్మర్ లో ఒకటా రెండా.. వరసగా మూడు భారీ విజయాలు అందుకుంది ఈ భామ. మార్చ్ 30న విడుదలైన రంగస్థలం ఏకంగా 120 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇందులో రామలక్ష్మిగా స్యామ్ నటన మరో స్థాయిలో ఉంది. ఇక మొన్న విడుదలైన మహానటిలో మధురవాణిగా అదరగొట్టింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఈమె సన్నివేశం సినిమా స్థాయిని పెంచేసింది.
మహానటి కీర్తిసురేష్ అయినా కూడా సహాయ పాత్రలోనే సంపేసింది సమంత. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో విజయాన్ని కూడా పూర్తిచేసింది సమంత. అదే ఇరుంబు తిరై. తెలుగులో అభిమన్యుడు.. ఇక్కడ ఇంకా విడుదల కాలేదు సినిమా. మే 18న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. అయితే తమిళ్ లో మాత్రం మే 11నే విడుదలైంది. సైబర్ క్రైమ్స్.. డిజిటల్ మీడియా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యాక్షన్ కింగ్ అర్జున్ ఇందులో విలన్ గా నటించాడు. విశాల్ తో తొలిసారి సమంత నటించింది. మొత్తానికి రంగస్థలం.. మహానటి.. ఇప్పుడు ఇరుంబుతిరై.. ఇలా వరస విజయాలతో సమంత జోరు ఇప్పుడు మామూలుగా లేదు.
User Comments