శంక‌ర్‌లోని ఉగ్ర‌శంక‌ర‌

Last Updated on by

`జ‌బ‌ర్థ‌స్త్` షోతో పాపుల‌ర‌య్యాడు ష‌క‌ల‌క శంక‌ర్‌. నిర్మాత శ్యాంప్ర‌సాద్‌రెడ్డి ఆద‌ర‌ణ‌తో జ‌బ‌ర్థ‌స్త్‌లో ప‌లువురు క‌మెడియ‌న్ల‌కు అన్నం తినే అవ‌కాశం ద‌క్కింద‌ని తెలిపాడు. ఇటీవ‌లి కాలంలో సినిమాల్లో అవ‌కాల్లేక మూడేళ్లుగా ఖాళీగానే కూచున్నాన‌ని, అందువ‌ల్ల తిండి లేక బ‌క్క చిక్కాన‌ని చెప్పుకొచ్చాడు. ఈ మూడేళ్ల‌లో ఏం చేశావు? అంటే హీరోగా అవ‌కాశ‌మివ్వ‌మ‌ని ప‌లువురి చెంత‌కు వెళ్లాన‌ని .. తాను హీరోగా సినిమా చేస్తే ప‌దిమందికి ఉపాధి ద‌క్కుతుంద‌ని ఆ మంచి ప‌నికి పూనుకున్నాన‌ని అమాయ‌క‌త్వంతో కూడుకున్న మంచిత‌నం ప్ర‌ద‌ర్శించాడు. అయితే త‌న‌కు అవ‌కాశం ఇస్తామ‌న్న వాళ్లే కానీ, వెంట‌నే కుద‌ర‌లేద‌ని చెప్పుకొచ్చాడు. అన్న‌ట్టు నేడు శంక‌ర్ న‌టించిన `శంభో శంక‌ర‌` థియేట‌ర్ల‌లోకి రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉంది? అంటే ఇదో శంక‌ర్ సోలో షో అని డిక్లేర్ చేశారు.

ఈ సినిమా ఆహా ఓహో అనేంత‌గా ఉంద‌ని ఎవ‌రూ చెప్ప‌కున్నా శంక‌ర్ గురించి మాత్రం పాజిటివ్ నోట్ అందింది. ఈ సినిమాలో ష‌క‌ల‌క శంక‌ర్ క‌నిపించ‌లేదు.. రియ‌ల్ హీరో శంక‌ర క‌నిపించాడ‌ని అన్నారంతా. శంక‌ర్‌ని చూడ‌గానే అంతా క‌మెడియ‌న్ అని భావిస్తారు. కానీ ఈ సినిమాలో అస‌లు ఆ ఇమేజ్‌కి సంబంధం లేకుండా న‌టించాడు. పూర్తి స్థాయి హీరోగా ఎమోష‌నల్ స‌న్నివేశాల్ని ఇర‌గ‌దీశాడు. ఒక స్టార్ హీరోలా అత‌డు చూపించిన ప్ర‌తాపం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక హీరోగా న‌టించాలంటే సిగ్గు, బిడియం, భేష‌జం అడ్డే రాలేదు అత‌డికి. పాట‌లు, ఫైట్స్‌లో ఇర‌గ‌దీసేశాడు. విల‌న్ల‌ను చిత‌క్కొట్టే ఘ‌రానా ఫైట‌ర్‌లా క‌నిపించాడు. పెద్ద హీరో పోరాటాల్ని చూపించాడు. క‌ర్రసాము గింగిరాలు తిప్పేశాడు. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో అయితే ఈ శీకాకుళం సిన్నోడు చించి ఆరేశాడు. త‌న చెల్లిని అత్యాచారం చేసి చంపేశార‌ని తెలిసిన శంక‌ర్ బాధ‌ను, ఉద్వేగాన్ని, కోపాన్ని ఒకే ఎక్స్‌ప్రెష‌న్‌లో అద్భుతంగా ఆవిష్క‌రించాడు. ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే ఆ స‌న్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలిచింది. త‌న చెల్లిని ఏ గొయ్యిలో అయితే పాతేస్తారో, అదే గొయ్యిలో చంపినోడిని పాతేసే స‌న్నివేశం ఆక‌ట్టుకుంటుంది. డెబ్యూ ద‌ర్శ‌కుడి నుంచి కొన్ని ఫ్లాస్‌, స్క్రీన్‌ప్లే లోపం క‌నిపించినా శంక‌ర్ పెర్ఫామెన్స్ మాత్రం హైలైట్ అయ్యింద‌న్న టాక్ వినిపించింది. ఇక శంక‌ర సినిమాకి శ్రీ‌కాకుళం ఏరియా నుంచి, అలానే వైజాగ్ మాస్ ఏరియాస్ నుంచి రిపోర్ట్ బావుంద‌ని తెలుస్తోంది. ఇక‌పోతే ఏ సినిమా ఫ‌లితం అయినా ఒరిజిన‌ల్‌గా తేలేది మండే. అప్ప‌టివ‌ర‌కూ `శంభో శంక‌ర‌` ఫ‌లితం కోసం వేచి చూడాల్సిందే.

User Comments