Last Updated on by
రివ్యూ: సమ్మోహనం
నటీనటులు: సుధీర్ బాబు, అదితిరావ్ హైద్రీ, నరేష్, పవిత్రా లోకేష్, రాహుల్ రామకృష్ణ..
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: ఇంద్రగంటి మోహనకృష్ణ
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
సమ్మోహనం.. టైటిల్ లోనే ఏదో తెలియని మత్తు ఉంది కదా..! మరి సినిమాలో కూడా ఇదే మైకం మత్తు ఉన్నాయా..? అందంగా మరోసారి మాయ చేసాడా ఇంద్రగంటి..? ఈయన కూల్ గా వచ్చి మళ్లీ హిట్ కొట్టేస్తున్నాడా..? అసలు ఏముంది ఈ సమ్మోహనంలో..?
కథ:
విజయ్(సుధీర్ బాబు) ఓ ఆర్టిస్ట్. చిన్న పిల్లల కోసం బుక్స్ రాస్తూ బొమ్మలు గీస్తుంటాడు. విజయ్ ది చిన్న కుటుంబం.. తండ్రి(నరేష్)కి సినిమాల పిచ్చి. చెల్లికి ఫ్యాషన్ డిజైనింగ్.. తల్లిది వంటలు. ఇలాంటి కుటుంబంలోకి సడన్ గా అనుకోకుండా స్టార్ హీరోయిన్ సమీరా రాథోర్(అదితిరావ్) వస్తుంది. విజయ్ ఇంట్లోనే కొన్నాళ్లు షూటింగ్ జరుగుతుంది. అక్కడే విజయ్ ఆమెకు తెలుగు నేర్పిస్తుంటాడు. ఆ క్రమంలోనే అతడికి చేరువ అవుతుంది సమీరా. సినిమాలంటే పెద్దగా ఇష్టపడని విజయ్ కూడా సమీరాను ప్రేమిస్తాడు. తన ప్రేమ గురించి చెప్తాడు కానీ ఆమె ఒప్పుకోదు. ఆ తర్వాత ఏమైంది..? ఇద్దరూ ఎలా కలిసారు అనేది అసలు కథ..
కథనం:
సమ్మోహనంలో చెప్పుకోడానికి పెద్ద కథేమీ ఉండదు. హీరో ఇంట్లో ఓ సినిమా షూటింగ్ జరుగుతుంది. అక్కడికి హీరోయిన్ వస్తుంది. ఆమెను ముందే ఇష్టపడని హీరో తర్వాత నెమ్మదిగా ప్రేమిస్తాడు.. అదే టైమ్ లో ఆమె నో చెప్పి వెళ్లిపోతుంది. తాను అనుకున్నట్లే సినిమా వాళ్లు మోసం చేస్తారని ఫిక్స్ అయిపోతాడు హీరో. ఇదే కథ.. ఇదేం తెలియని కథ కాదు. ఇప్పటికే చాలా సినిమాల్లో చూసాం. నేనింతే సినిమాలో చాలా మాస్ గా ఇండస్ట్రీ ఎలా ఉంటుందో చూపించాడు పూరీ జగన్నాథ్. కానీ ఇక్కడ ఇంద్రగంటి. అందుకే మాయ చేసినట్లుగా మెల్లగా చెప్పాడు. తెలిసిన కథనే తన స్క్రీన్ ప్లేతో ఇంకా అందంగా మార్చేసాడు. ప్రతీ సీన్ మన జీవితంలో జరుగుతున్నట్లుగానే అనిపిస్తుంది. మన ఇంట్లో చూస్తున్నట్లే అనిపిస్తుంది. అంత ఫీల్ క్యారీ చేసాడు దర్శకుడు. ఫస్టాఫ్ లో ఇండస్ట్రీపై పడే ప్రతీ పంచ్ కడుపులు చెక్కలు చేస్తుంది. ఈ కుర్రాన్నే కదరా తెలుగు ప్రేక్షకులకు అలవాటు చేయడానికి ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నారంటూ వచ్చే డైలాగ్ ఇప్పుడున్న యంగ్ హీరోలకు చురుకులా తగులుతుంది.
ఇంద్రగంటి నుంచి ఇలాంటి హార్డ్ హిట్టింగ్ డైలాగులు ఊహించలేం. ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా టచ్ చేసాడు దర్శకుడు. ఇండస్ట్రీలో హీరోయిన్లు అంతా మంచి వాళ్లను.. అలాగని అంతా చెడ్డోళ్లు కూడా ఉండరంటూ చెప్పాడు దర్శకుడు. ఎవరికి కావాల్సింది వాళ్లు తీసుకుంటారన్నట్లు నిర్ణయం వాళ్లకే వదిలేసాడు. ఇక హీరో హీరోయిన్ మధ్య ప్రేమ కూడా చాలా మెచ్యూర్డ్ గా చూపించాడు దర్శకుడు. ప్రేమ విఫలమై బాధ పడుతున్న హీరోను తల్లి వచ్చి ఓదారుస్తుంది. ప్రేమించేవాడు కాదు.. అమ్మాయి నో చెప్పినా ఓర్చుకునేవాడే అసలైన మగాడంటే అంటుంది. సినిమాలో ప్రేమను దర్శకుడు ఎలా చూపించాడో చెప్పడానికి ఈ ఒక్క సీన్ చాలేమో. క్లైమాక్స్ వరకు ఎక్కడా గాడి తప్పకుండా కథను నడిపించాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే మాయాజాలంతో సమ్మోహనపరిచాడు.
నటీనటులు:
సుధీర్ బాబు అద్భుతంగా నటించాడు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ హీరో. ఇక అదితిరావ్ హైద్రీ అయితే అద్భుతం. ఇన్నాళ్లూ ఈ హీరోయిన్ ను తెలుగు దర్శకులు ఎందుకు వదిలేసామా అని ఫీల్ అవుతారు ఈ చిత్రం చూసిన తర్వాత. అంత బాగా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక నరేష్ మరోసారి తన నటనతో మాయ చేసారు. నవ్వించారు.. ఏడిపించారు కూడా. పవిత్ర లోకేష్ హీరో తల్లిగా చాలా బాగా చేసింది. ఫ్రెండ్స్ గా రాహుల్ రామకృష్ణతో పాటు పెళ్లి చూపులు ఫేమ్ మరో అబ్బాయి కూడా బాగా నటించాడు.
టెక్నికల్ టీం:
సమ్మోహనం క్రెడిట్ లో చాలా భాగం సినిమాటోగ్రఫర్ పిజి విందాకు వెళ్తుంది. ఈయన తన కెమెరా పనితనంతో మాయ చేసాడు. విజువల్స్ ను చాలా అద్భుతంగా చూపించాడు.. సినిమా రేంజ్ పెంచేసాడు. ఇక పెళ్లిచూపులు తర్వాత మరోసారి తన మ్యాజిక్ తో మాయ చేసాడు వివేక్ సాగర్. ఎడిటింగ్ బాగుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ మరోసారి తన స్పెషాలిటీ చూపించాడు. తెలిసిన సన్నివేశాలను అందంగా రాసుకున్నాడు ఈ దర్శకుడు. ఇక ఈయన తెరకెక్కించిన విధానం చూసి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అద్భుతమైన టేకింగ్ తో మాయ చేసాడు. కాకపోతే కాస్త నెమ్మదిగా సాగడం ఒక్కటే ఈ చిత్రానికి మైనస్.
చివరగా:
సమ్మోహనం.. నిజంగానే సమ్మోహనం..
User Comments