సంజూపై వాళ్లు హ్యాపీగా లేరా..?

Last Updated on by

అద్భుతం.. అమోఘం.. మాట‌ల్లేవు.. సెల్యూట్ టూ రాజ్ కుమార్ హిరాణి.. సంజూ విడుద‌లైన రోజు నుంచి ఈ సినిమాపై వ‌స్తున్న కామెంట్స్ ఇవి. ప్రేక్ష‌కులు కూడా ఈ సినిమా గురించి ఎంత‌గా ఊహించుకున్నారో.. ఆ అంచ‌నాల‌న్నింటినీ అందుకున్నాడు రాజ్ కుమార్ హిరాణి. ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్ నుంచి క‌న్నీళ్ల‌తో బ‌య‌టికి పంపాడు. ఇక ఇప్పుడు ఇదే వ‌సూళ్ల రూపంలోనూ క‌నిపిస్తుంది. ఈ చిత్రం తొలి రోజు ఏకంగా 43 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసింది ప్ర‌పంచ వ్యాప్తంగా. రెండో రోజు అంత‌కంటే ఎక్కువ తీసుకొచ్చింది. చూస్తుంటే ర‌ణ్ బీర్ క‌పూర్ కు ఏ జ‌వానీ హై దివానీ త‌ర్వాత వ‌చ్చిన అతిపెద్ద విజ‌యంగా ఇది నిలిచిపోయేలా క‌నిపిస్తుంది. మూడు రోజుల్లోనే 100 కోట్ల మార్క్.. త్వ‌ర‌లోనే 300 కోట్ల మార్క్ అందుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. అయితే అన్నీ బాగానే ఉన్నా.. సంజూపై విమ‌ర్శ‌లు కూడా ఆగడం లేదు. రాజ్ కుమార్ హిరాణికి సంజ‌య్ ద‌త్ అంటే ప్రాణం. అందుకే ప్రాణ స్నేహితున్ని నిజాయితీప‌రుడు అని చూపించ‌డానికే ఈ చిత్రం చేసాడ‌ని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు.

అక్ర‌మ ఆయుధాల కేసులో తెలిసి తెలిసి ఇరుక్కున్న సంజ‌య్ ద‌త్ ను సినిమాలో మాత్రం నీతిమంతుడిగా చూపించార‌ని.. సంజూ జీవితాన్ని మార్చేసిన అస‌లు కేస్ లో ఆయ‌న్ని నిజాయితీగా చూపించి.. మిగిలిన అన్ని విష‌యాల‌ను మాత్రం హిరాణి లైట్ గా తీసుకున్నాడు అంటున్నారు. సంజూ పెద్ద ఉమెనైజ‌ర్ అని బాలీవుడ్ లో తెలుసు.. అది చూపించాడు. డ్ర‌గ్స్ తీసుకుంటాడు.. అది కూడా మ‌రొక‌రు అల‌వాటు చేసిన‌ట్లు చూపిస్తాడు. ఇక అక్ర‌మ ఆయుధాల కేస్ లో కూడా త‌న‌ను తాను కాపాడుకోడానికి ఓ గ‌న్ పెట్టుకున్న‌ట్లు.. ఆ త‌ర్వాత ఆ కేస్ లో సంజూని ఇరికించిన‌ట్లు చూపించాడు హిరాణి. అయితే ఈ కేస్ లో నిజాలేంటో కేవ‌లం సంజ‌య్ ద‌త్ కు మాత్ర‌మే తెలుసు. మ‌రి ఆయ‌న నిజం చెప్పాడా.. అబద్ధం చెప్పాడా అనేది ఆయ‌న‌కే తెలియాలి. ఏదేమైనా ఓ బ‌యోపిక్ గా సంజూ అద్భుత‌మే.

User Comments