పెద్ద పండ‌క్కి బిగ్ ఫైటింగ్

Last Updated on by

పెద్ద పండ‌క్కి సినిమా థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడ‌బోతున్నాయి. తెలుగు రాష్ట్రాలు స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు తెలుగు చిత్రాల‌తో పాటు డ‌బ్బింగ్ సినిమాలు రిలీజ‌వుతున్నాయి. ఇప్ప‌టికే నాలుగు సినిమాలు పండ‌గ క్యూలో ఉన్నాయి. సంక్రాంతి బ‌రిలో పందేనికి దిగుతున్నారు. ఈ పండ‌గ బ‌రిలో ఉన్న నాలుగు చిత్రాల‌పైనా దాదాపు 200కోట్ల మేర బిజినెస్ సాగింద‌ని ట్రేడ్ చెబుతోంది. రామ్ చ‌ర‌ణ్ – బోయ‌పాటి కాంబినేష‌న్ మూవీ విన‌య విధేయ రామ చిత్రానికి 120 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగింది. అలాగే బాల‌కృష్ణ‌- క్రిష్ కాంబినేష‌న్ మూవీ క‌థానాయ‌కుడు ఏకంగా 60 కోట్లు పైగా బిజినెస్ సాగించింద‌ని తెలుస్తోంది. వెంకీ- వ‌రుణ్ తేజ్- అనీల్ రావిపూడి కాంబినేష‌న్ మూవీ ఎఫ్ 2 సైతం ఇంచుమించు 30కోట్ల మేర బిజినెస్ సాగించిందిట‌. వీటితో పాటు ర‌జ‌నీకాంత్ న‌టించిన పేట చిత్రానికి 21 కోట్ల మేర బిజినెస్ సాగింది.

ఇవ‌న్నీ క‌లుపుకుంటే దాదాపు 200 కోట్ల మేర బిజినెస్ సాగింది. అయితే ఆ మేర‌కు థియేట‌ర్ల నుంచి 200కోట్ల మేర షేర్ వ‌సూల‌వుతుందా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక నాలుగు సినిమాలు ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డి భారీగా బిజినెస్ చేసిన సినిమాలు వ‌సూళ్లు తేవాల్సి ఉంటుంది. అయితే సంక్రాంతి సెల‌వులు సినిమాల‌కు పెద్ద రేంజులో క‌లిసి రానున్నాయి. సూప‌ర్ హిట్టు అన్న టాక్ వినిపిస్తే చాలు వ‌సూళ్లు తేవ‌డం క‌ష్ట‌మేమీ కాదు. ఇక‌పోతే ఇప్ప‌టికే బాల‌య్య‌ క‌థానాయ‌కుడు చిత్రానికి క్లీన్ యు స‌ర్టిఫికెట్ ద‌క్కింది. జ‌న‌వ‌రి 9న రిలీజ‌వుతోంది కాబ‌ట్టి, 8వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియ‌ర్ల సంద‌డి నెల‌కొన‌నుంది. ఇక `పేట` చిత్రానికి యుఏ స‌ర్టిఫికెట్ ద‌క్కింది. 171 నిమిషాల ర‌న్ టైమ్ తో అల‌రించ‌నుంది. పేట చిత్రానికి జన‌వ‌రి 10 నుంచి ప్రీమియ‌ర్ల సంద‌డి నెల‌కొన‌నుంద‌ట‌. అలాగే ఈనెల 12న రిలీజ‌వుతున్న‌ ఎఫ్ 2 చిత్రానికి యుఏ స‌ర్టిఫికెట్ అందింది. 11న సాయంత్రం నుంచే ప్రీమియ‌ర్లు వేస్తున్నారు. ఇక జ‌న‌వ‌రి 11న రిలీజ‌వుతున్న `విన‌య విధేయ రామ` సెన్సార్ రిపోర్ట్ అంద‌నుంద‌ని తెలుస్తోంది.

User Comments