సంక్రాంతి సినిమాలు అమెజాన్‌లో 

Date Locked For VVR Amazon Prime Release
సంక్రాంతి బ‌రిలో వ‌రుస‌గా నాలుగు సినిమాలు రిలీజ‌య్యాయి. జ‌న‌వ‌రి 9న క‌థానాయ‌కుడు, 10న పేట‌, 11న విన‌య విధేయ రామ‌, 12న ఎఫ్ 2 చిత్రాలు రిలీజ‌య్యాయి. వీటిలో ఎఫ్ 2 ఒక్క‌టే బ్లాక్ బ‌స్టర్. మిగ‌తా సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాపుల‌య్యాయి. ఫ్లాపు సినిమాలు వ‌దిలేసి, హిట్టు సినిమాలు మాత్ర‌మే చూస్తున్న ప్రేక్ష‌కులు మాత్రం ప్ర‌స్తుతం డిజిట‌ల్ మాధ్య‌మంలో సంక్రాంతి సినిమాల లైవ్ ఎప్పుడు అంటూ తేదీల గురించి సెర్చ్ చేస్తున్నారు. మొత్తానికి సంక్రాంతి సినిమాల‌న్నీ వ‌రుస‌గా క్యూ క‌డుతున్నాయి. ప్ర‌ఖ్యాత ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గ‌జం అమెజాన్ మ‌న తెలుగు సినిమాల‌న్నిటినీ గంప గుత్త‌గా కొనేసి డిజిట‌ల్ రిలీజ్ ల‌కు తేదీల్ని ఖాయం చేసింది.
ఎన్నో భారీ అంచ‌నాల న‌డుమ రిలీజై ఫ్లాప్ సినిమాగా నిలిచిన క‌థానాయ‌కుడు చిత్రాన్ని నేటి నుంచి అమెజాన్ లైవ్ లోకి తెచ్చింది. అలాగే ఫిబ్ర‌వ‌రి 10 నుంచి విన‌య విధేయ రామ అమెజాన్ లో లైవ్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ప్ర‌స్తుతం ఇంకా ఈ సినిమా న‌ష్టాల గురించి .. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ గురించి చ‌ర్చ సాగుతుండ‌గానే అప్పుడే సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ కి రెడీ అయిపోతుండ‌డం మెగాభిమానుల్లో చ‌ర్చ‌కొచ్చింది. మ‌రోవైపు ఈ సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ ఎఫ్ 2 కూడా ఫిబ్ర‌వ‌రి 11న డిజిట‌ల్ లో రిలీజైపోతోంది. విక్ట‌రీ వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కులుగా న‌టించిన ఈ చిత్రం అద్భుత‌మైన ఫ‌న్ తో ఆక‌ట్టుకుని ఇప్ప‌టికీ విజ‌య‌వంతంగా ఆడుతోంది. ఈలోగానే డిజిట‌ల్ లో లైవ్ కి వ‌చ్చేస్తోంది. మ‌రోవైపు అద్భుత‌మైన విజువ‌ల్ గ్రాఫిక్స్ తో అండ‌ర్ వాట‌ర్ సినిమాగా సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఆక్వామేన్ చిత్రం మార్చి 3 నుంచి డిజిట‌ల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. అలాగే బ్లూరే డీవీడీలు మార్చి 26 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. డిజిట‌ల్ వీక్ష‌కుల‌కు ఈ ఫ్లెక్సిబిలిటీ చ‌క్క‌ని వ‌ర‌మే.