సంతానం ద‌మ్ము చూపించాడ్రో!

క‌మెడియ‌న్లు హీరోలుగా మారి మిరాకిల్స్ చేస్తున్న వైనం ప‌రిశీలిస్తే చాలా మంది సినీహీరోలుగా క్లిక్క‌య్యారు. కుటుంబ వార‌సులే ప‌రిశ్ర‌మ‌ను ఏలాలి అన్న రూల్‌కి జ‌నాలు ఏనాడో బ్రేక్ వేయ‌డంతో ఇప్పుడు ఎవ‌రికి వారే హీరో. క‌థ‌, కంటెంట్‌, ల‌క్, ల‌స్ట్‌ అన్నీ కుదిరితే చాలు ఆటోమెటిగ్గా హిట్లు కొట్టి అనామ‌కులైనా ఇక్క‌డ అనూహ్యంగా పాపుల‌రైపోతున్నారు. ఆ కోవ‌లోనే అలీ, సునీల్‌, శ్రీ‌నివాస‌రెడ్డి, ధ‌న్‌రాజ్‌, స‌ప్త‌గిరి, వ‌డివేలు, వివేక్ (త‌మిళం) వంటి క‌మెడియ‌న్లు సౌత్‌లో హీరోలుగా మారారు. ల‌క్ ఛేజిక్కి వీళ్లంతా బ్లాక్‌బ‌స్ట‌ర్లు అందుకున్నారు. జ‌బ‌ర్ధ‌స్త్‌ క‌మెడియ‌న్లు అడ‌పాద‌డ‌పా హీరోలుగా న‌టిస్తూ నాలుగు చేతులా ఆర్జిస్తున్నారు.

ఈ కోవ‌లోనే త‌మిళ క‌మెడియ‌న్ సంతానం కూడా ఓ ఎటెంప్ట్ చేశాడు. అయితే సంతానం పైన చెప్పిన కామెడీ హీరోల‌తో పోలిస్తే పూర్తి డిఫ‌రెంట్ యాంగిల్‌లో తెర‌పైకొచ్చాడు. అత‌డు న‌టించిన `దిల్లుకు దుడ్డు` అనే త‌మిళ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెలుగులో `ద‌మ్ముంటే సొమ్మేరా` పేరుతో శ్రీ తెన్నాండాళ్ ఫిలింస్ ప‌తాకంపై న‌ట‌రాజ్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సంతానం ఓ స్ట్రెయిట్ హీరోలా ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు. నూనూగు మీసాల కుర్రాడు ఉర‌క‌లెత్తే ర‌క్తంతో దూసుకొస్తే ఎలా ఉంటుందో అలా క‌నిపించాడు. అత‌డి న‌ట‌న‌, డ్యాన్సులు, ఫైట్స్ అన్నీ ఓ పెద్ద హీరో లెవ‌ల్లో అద‌ర‌గొట్టేశాడు. కెమెరా ఎలానూ త‌న‌కు కొత్తేమీ కాదు కాబ‌ట్టి, అందుకు త‌గ్గ‌ట్టే ఫ్రీ బాడీ లాంగ్వేజ్‌తో దుమ్ము దులిపేశాడు. అయితే ఇదో హార‌ర్ కామెడీ జాన‌ర్ సినిమా. ఇప్ప‌టికే తెలుగులో వ‌చ్చేసిన పాత ఫార్ములా సినిమానే. ప్రేమ‌క‌థా చిత్రం, రాజుగారి గ‌ది, గంగ‌, పిశాచి త‌ర‌హా చిత్ర‌మే ఇది కూడా. ఆ సినిమాల‌తో పోలిస్తే ఈ సినిమాలో కొత్తేంటి? అంటే చెప్పుకోడానికేం లేదు కానీ, మూవీని స‌హ‌జ‌సిద్ధంగా శ్మ‌శానం – బూత్‌బంగ్లాలో ప‌రిమిత బ‌డ్జెట్లో తెర‌కెక్కించిన వైనం మెచ్చుకుని తీరాలి. ఇక‌పోతే ఇందులో డూప్లికేట్ దెయ్యం, ఒరిజిన‌ల్ దెయ్యం అన్న కాన్సెప్టు సినిమాకి అస్సెట్ అయ్యింది. న‌వ్విస్తూ, భ‌య‌పెట్ట‌డంలో స‌క్సెస‌య్యారు. ఇక సినిమా ఆద్యంతం ప్రేమ‌కోసం పాకులాడే డేరున్న‌ కుర్రాడిగా సంతానం న‌ట‌న ఆక‌ట్టుకుంది. తెలుగులో తొలి ప్ర‌య‌త్నం ఫ‌ర్వాలేద‌న్న టాక్ తెచ్చుకున్నాడు కాబ‌ట్టి, అత‌డు మునుముందు తెలుగు-త‌మిళ్ డ్యూయెల్ గేమ్ ప్లాన్ చేస్తాడ‌న‌డంలో సందేహం లేదు. త‌మిళం నుంచి తెలుగుకు వ‌చ్చి విజ‌య్ ఆంటోని ఎంత పెద్ద స‌క్సెస‌య్యాడో అంత పెద్ద స‌క్సెస‌య్యే ఛాన్స్ సంతానంకు ఉంది. అయితే అత‌డి ప్ర‌తిభ‌ను వెలికి తీసే స‌త్తా ఉన్న ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు అత‌డికి తార‌స‌ప‌డాల్సి ఉంటుంది.