రివ్యూ: స‌రిలేరు నీకెవ్వ‌రు

Sarileru Neekevvaru Movie Review and Rating

నటీనటులు: మహేష్ బాబు, రష్మిక, విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత

తదితరులుదర్శకత్వం: అనిల్ రావిపూడి

నిర్మాత: అనిల్ సుంకర, మహేష్ బాబు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: రత్నవేలు

ముందు మాట‌:

మ‌హేష్ కొంత‌కాలంగా సందేశంతో ముడిప‌డ్డ క‌థ‌లే చేస్తూ వ‌స్తున్నారు. అభిమానుల్లో జోష్ నింపే మాస్ మ‌సాలా చిత్రాలు చేయ‌క చాలా కాల‌మైంది. అలాంటి క‌థ‌తోనే ఈసారి పండ‌గ‌కి రావాల‌ని ఏరి కోరి `స‌రిలేరు నీకెవ్వ‌రు` చేశారు. న‌వ్విస్తూనే, మంచి మాస్ అంశాల్ని జోడించ‌డంలో దిట్ట అనిల్ రావిపూడి. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా అన‌గానే అంచ‌నాలు పెరిగిపోయాయి. దానికితోడు 13 యేళ్ల త‌ర్వాత విజ‌య‌శాంతి ఈ చిత్రంతోనే కెమెరా ముందుకొచ్చింది. ఆస‌క్తి రేకెత్తించే ఈ క‌ల‌యిక‌, అదిరిపోయే ప్ర‌చార చిత్రాలు, పండ‌గ సంద‌డి… ఇలా ప‌లు కార‌ణాల‌తో సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్ని తాకాయి. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగా సినిమా ఉందా? మ‌హేష్ అభిమానుల్లో జోష్‌ని నింపాడా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ
అజ‌య్ కృష్ణ (మ‌హేష్‌బాబు) ఆర్మీ మేజ‌ర్‌. క‌శ్మీర్ స‌రిహ‌ద్దుల్లో విధులు నిర్వ‌ర్తిస్తుంటాడు. ఉగ్ర‌వాదులు చిన్న పిల్ల‌ల్ని కిడ్నాప్ చేయ‌డంతో ఓ రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌డ‌తాడు. అందులో అనుకోని ఓ సంఘ‌ట‌న జ‌రుగుతుంది. దాంతో అజ‌య్ కృష్ణ క‌ర్నూల్లో ఉన్న ప్రొఫెస‌ర్ భార‌తి (విజ‌య‌శాంతి) ఇంటికి రావ‌ల్సి వ‌స్తుంది. కానీ ఆ ఇంట్లో భార‌తి క‌నిపించ‌దు. మినిస్ట‌ర్ నాగేంద్ర (ప్ర‌కాష్‌రాజ్‌) ఆమెని, ఆమె కుటుంబాన్ని అంతం చేయాల‌ని చూస్తుంటాడు. ఇంత‌కీ ప్రొఫెస‌ర్ భార‌తికి ఆ ప‌ర‌స్థితి ఎందుకు ఎదురైంది? ఆమె ఎవ‌రు? ఆ ముప్పు నుంచి అజ‌య్ ఎలా ర‌క్షించాడు? భార‌తి కోసం అజ‌య్ ఎందుకు క‌ర్నూలుకి రావ‌ల్సి వ‌చ్చింది? త‌దిత‌ర విష‌యాల‌తో మిగ‌తా సినిమా సాగుతుంది.

విశ్లేష‌ణ‌
అభిమానుల్ని మెప్పిస్తే చాల‌నుకుని చేసిన ప‌క్కా పైసా వ‌సూల్ ప్ర‌య‌త్న‌మిది. హీరోయిజం, డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ… ఇలా మాస్ అంశాల‌న్నీ ప‌క్కాగా మేళ‌వించారు. అయితే కామెడీ మ‌రీ క‌డుపుబ్బా నవ్వించే స్థాయిలో లేక‌పోయినా చాలా చోట్ల వ‌ర్క‌వుట్ అయ్యింది. ఇక హీరోయిజాన్ని, ఎలివేష‌న్ల‌నీ బ‌లంగా వాడుకున్నాడు ద‌ర్శ‌కుడు. దాంతో ఇది కొత్త క‌థేం కాక‌పోయినా అభిమానుల్ని మెప్పించి, సాధార‌ణ ప్రేక్ష‌కుల్ని బాగుంద‌నిపించి బ‌య‌టికి పంపిస్తుందీ చిత్రం. కొత్త క‌థ కాక‌పోయిన‌ప్ప‌టికీ.. దేశ‌భ‌క్తితో ముడిప‌డిన ఇలాంటి అంశాన్ని తెలుగులో ఎవ్వ‌రూ ట‌చ్ చేయ‌లేదు. అదే మ‌హేష్‌లోనూ, అనిల్ రావిపూడిలోనూ కాన్ఫిడెన్స్ పెంచిన‌ట్టుంది. క‌ర్నూలు రౌడీయిజంతో మొద‌ల‌య్యే ఈ క‌థ ఆ త‌ర్వాత క‌శ్మీర్‌కి మ‌ళ్లుతుంది. అక్క‌డ రెస్క్యూ ఆప‌రేష‌న్ త‌ర్వాత మ‌ళ్లీ క‌ర్నూలు బాట ప‌డుతుంది. అయితే ఈసారి రైలు మార్గాన్ని ఎంచుకుని రైల్లోనే కామెడీని పండించే ప్ర‌య‌త్నం చేశారు. ట్రైన్ ఎపిసోడ్‌లో సంద‌డి బాగానే ఉంటుంది కానీ, అది ఇదివ‌ర‌కటి అనిల్ రావిపూడి సినిమాల స్థాయిలో న‌వ్వించ‌లేక‌పోయింది. కానీ టైమ్ పాస్ మాత్రం చేసింది. ఇక్క‌డే నెవ్వ‌ర్ బిఫోర్ ఎవ్వ‌ర్ ఆఫ్ట‌ర్‌, మ్యావ్ మ్యావ్ పిల్లీ మిల్క్ బాయ్‌కి పెళ్లి అంటూ చాలా మేన‌రిజ‌మ్స్ చేయించారు. కానీ అందులో అర్థ‌మ‌వుతోందా అనే మాట త‌ప్ప మిగ‌తావి స‌న్నివేశాల‌కి అంత‌గా అత‌క‌లేదు. ఏదో అనిల్ రావిపూడి సినిమా నుంచి మేన‌రిజ‌మ్స్ ఆశిస్తారు కాబ‌ట్టి ఏదో ఒక‌టి చేయాల‌నిపించిన‌ట్టు అనిపిస్తాయి. క‌థ కూడా మ‌హేష్ క‌ర్నూల్లో దిగాకే మొద‌ల‌వుతుంది. చిన్న బ్రేక్ ఇచ్చి, పూర్తి క‌థని త‌ర్వాత చెప్పి బొమ్మ దద్ద‌రిల్లిపోయేలా చేస్తాన‌ని మ‌హేష్ చెప్ప‌డమే విరామ స‌న్నివేశాలు. ఆ త‌ర్వాతే భార‌తికి ఎదురైన ప‌ర‌స్థితులు మిగ‌తా క‌థ సాగుతుంది. ద్వితీయార్థంలోనే క‌థంతా చెప్పాల్సి రావ‌డంతో వినోదానికి చోటు లేక‌పోయింది.

దాంతో హీరోయిన్ కూడా చాలాసేపు తెర‌పై క‌నిపించ‌దు. ఇద్ద‌రి హ‌త్య గురించి హీరో స్వ‌యంగా దిగి ఇన్వెస్టిగేష‌న్ మొద‌లుపెడ‌తాడు. మ‌రీ క‌థ సీరియ‌స్ అయిపోతుంద‌నుకున్నారో ఏమో అక్క‌డే సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌, హీరోయిన్ పాత్ర‌ల్ని మ‌ధ్య‌లోకి చొప్పించి మ‌ళ్లీ న‌వ్వులు పండించే ప్ర‌య‌త్నం చేశారు. నిజానికి అలాంటి సీరియ‌స్ అంశం గురించి ఇన్వెస్టిగేష‌న్ సాగుతున్న‌ప్పుడు మ‌రీ కామెడీ గురించి ఎందుకు ఆలోచించారో అర్థం కాదు. మ‌హేష్ ఈమ‌ధ్య చేస్తున్న సినిమాల్లాగే ప్రి క్లైమాక్స్ స‌న్నివేశాల్లో రాజ‌కీయ నాయ‌కుల‌కి క్లాస్ పీక‌డం క‌నిపిస్తుంది. అక్క‌డ త్రివ‌ర్ణ ప‌తాకం బాంబుని పేల్చ‌డం, విజ‌య‌శాంతి సైనికుల గొప్ప‌త‌నం గురించి చెప్పే స‌న్నివేశాలు, అక్క‌డ పండిన భావోద్వేగాలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. మంచి సెంటిమెంట్‌ని కూడా పండించాయి. మీరంద‌రూ నేను కాపాడుకుంటున్న ప్రాణాలు అని చెప్పే హీరో పాత్ర‌కి త‌గ్గట్టుగానే ప‌తాక స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. అక్ర‌మాలు చేసిన‌వాళ్ల‌ని చంప‌డం, జైల్లో పెట్ట‌డం కాకుండా ఏం చేయొచ్చో ఇందులో ప‌తాక స‌న్నివేశాల్లో చూపించిన విధానం మెప్పిస్తుంది.

న‌టీన‌టులు.. సాంకేతిక‌త
మ‌హేష్ అభిమానుల‌కి ఇది నిజ‌మైన పండ‌గ సినిమా. డ్యాన్సుల విష‌యంలో ఆయ‌న మ‌రింత శ్ర‌ద్ధ తీసుకున్నారు. మైండ్ బ్లాక్ పాట‌లో మాస్ అవ‌తారంలో క‌నిపించి అద‌ర‌గొట్టడ‌మే కాదు, అదిరిపోయేలా స్టెప్పులు కూడా వేశాడు. ర‌ష్మిక పాత్ర కామెడీ ప‌రంగా మెప్పిస్తుంది. పాట‌ల్లోనూ ఆమె అందంగా క‌నిపించింది. క‌మ‌ర్ష‌యల్ సినిమాల్లో క‌థానాయిక‌ల పాత్రల‌తో పోలిస్తే ర‌ష్మికకి మంచి ప్రాధాన్యమే దొరికిన‌ట్టైంది. మైండ్ బ్లాక్ పాట‌ల్లో ఆమె కాస్త ఘాటుగా కూడా క‌నిపించింది. విజ‌య‌శాంతి న‌ట‌న‌, ఆమె ఇమేజ్ ఇందులో పాత్ర‌కి బాగా ప‌నికొచ్చింది. ప్ర‌కాష్‌రాజ్ పాత్ర‌నితీర్చిదిద్దిన విధానం అల‌రిస్తుంది. అయితే ఆ పాత్ర చివ‌రికొచ్చేస‌రికి కామెడీగా మారిపోవ‌డంతో దాని ప్ర‌భావం హీరోయిజంపై ప‌డింది. ఇక మిగిలిన పాత్ర‌లు మామూలే. త‌నికెళ్ల భ‌ర‌ణి, రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. దేవిశ్రీప్ర‌సాద్ పాట‌లు, నేప‌థ్య సంగీతం అల‌రిస్తాయి. ర‌త్న‌వేలు కెమెరా ప‌నిత‌నం కూడా మెప్పిస్తుంది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. కొండారెడ్డి బురుజు నేప‌థ్యంలో స‌న్నివేశాల్లో క‌ర్నూల్లో తీసిన‌ట్టే అనిపిస్తాయి. అనిల్ రావిపూడి క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా పెద్ద‌గా రిస్క్ తీసుకోకుండా, ఒక స్టార్ హీరో నుంచి ఏం ఆశిస్తారో ఆ అంశాల్ని జోడించి ఈ సినిమాని తీర్చిదిద్దాడు.

చివ‌రిగా: అబ్బ‌బ్బ‌బ్బ‌బ్బా అనిపించాడు మ‌హేష్

రేటింగ్: 3.0/5

విడుదల తేది: 11-01-2020