యంగ్ హీరో శర్వానంద్ ఇటీవలే రణరంగం చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి చతికిలపడ్డాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏమాత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ప్రస్తుతం 96 రీమేక్ లో నటిస్తున్నాడు. చేతిలో ఉన్న సినిమా ఒకే ఒక్కటి అంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తోన్న నేపథ్యంలో శర్వా సడెన్ ట్విస్ట్ ఇచ్చాడు. సైలెంట్ గా తిరుపతిలో శ్రీకారం సినిమా మొదలు పెట్టేసాడు. మొదటి షెడ్యూల్ 15 రోజుల పాటు అక్కడే జరుగుతుందని తెలిపాడు.
శర్వా పాత్ర డీటైల్స్ కూడా బయటకు వచ్చాయి. శ్రీకారంలో రైతు పాత్రలో శర్వా కనిపించనున్నాడు. అందుకోసం నాగలి పట్టి దుక్కి దున్ననున్నాడుట. రైతుగా మారి తిరుపతిలో వ్యవసాయం మొదలు పెట్టాడు. ఏం పండిస్తున్నారంటే..మంచి సినిమా పండిస్తున్నామని యూనిట్ తెలిపింది. ఈ చిత్రాన్ని కిషోర్ రెడ్డి అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.