నాని అందుకే తొంద‌ర‌ప‌డ్డాడా..?

Last Updated on by

అదేంటి.. ఏ ప‌ని చేసినా ఒక‌టికి రెండుసార్లు ఆలోచించుకుని మ‌రీ నాని ప‌ని చేస్తాడ‌ని ఇండ‌స్ట్రీలో పేరుంది.. ఇప్పుడేంటి తొంద‌ర‌ప‌డ్డాడంటున్నారు.. ఇంత‌కీ ఏ విష‌యంలో నాని త్వ‌ర‌ప‌డ్డాడు అని ఆలోచిస్తున్నారా..? ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. సాధార‌ణంగా నాని లాంటి హీరో త‌ర్వాతి సినిమా అంటే దానికి క‌నీసం రెండు మూడు రోజుల ముందు నుంచైనా ఉప్పు అందుతుంది. మీడియాలో కానీ.. ఎక్క‌డో కానీ ఖచ్చితంగా ఈ సినిమా గురించి వార్త బ‌య‌టికి వ‌స్తుంది. కానీ గౌత‌మ్ తిన్న‌నూరి సినిమా మాత్రం చెప్పే వ‌ర‌కు బ‌య‌టికి రాలేదు. అంత‌గా జాగ్ర‌త్త ప‌డ్డారు నాని టీం. అయితే ఈ సినిమా ఉన్న‌ట్లుండి ఇలా అనౌన్స్ చేయ‌డానికి కార‌ణం నాగ‌చైత‌న్య అని తెలుస్తుంది. ఈ చిత్రం క్రికెట్ నేఫ‌థ్యంలో తెర‌కెక్కుతుంది. ఇందులో 1985-95 మ‌ధ్య టీం ఇండియాకు ఎంపిక‌వ్వాల‌ని క‌ల‌లు క‌నే అర్జున్ అనే కుర్రాడిగా న‌టించనున్నాడు నాని.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌తో శివ‌నిర్వాణ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ చిత్రం కూడా క్రికెట్ నేప‌థ్యంలోనే రానుంది. ఇందులో చైతూ కూడా క్రికెట‌ర్ గా న‌టించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. స‌మంత హీరోయిన్. నిన్నుకోరి త‌ర్వాత శివ చేస్తోన్న సినిమా ఇది. ఈ చిత్రం కంటే ముందు త‌న సినిమా అనౌన్స్ చేయాల‌నే క‌సితోనే నాని త‌న జెర్సీ సినిమాను ప్ర‌క‌టించాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకే క‌నీసం ముందు హింట్స్ కూడా ఇవ్వ‌కుండా రాత్రికి రాత్రే కొత్త సినిమా ముచ్చ‌ట్లు చెప్పేసాడు న్యాచుర‌ల్ స్టార్. ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ కూడా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ- భ‌ర‌త్ క‌మ్మ కాంబినేష‌న్ లో వ‌స్తున్న డియ‌ర్ కామ్రేడ్ సైతం క్రికెట్ నేప‌థ్యంలోనే తెర‌కెక్కుతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే కానీ నిజ‌మైతే ఒకేసారి ముగ్గురు కుర్ర హీరోలు క్రికెట్ ను న‌మ్ముకుని వ‌స్తున్న‌ట్లే..!

User Comments