శేఖ‌ర్ క‌మ్ముల పేరుతో చీటింగ్‌

Last Updated on by

చెట్టు పేరు చెప్పి కాయ‌ల‌మ్ముకోవ‌డం తెలివైన‌వాళ్ల వ్యాప‌కం. ఇలాంటి తెలివైన వాళ్ల అతి తెలివితేట‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఓ అతితెలివి గ‌డుగ్గాయ్ ఏకంగా టాలీవుడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల పేరు వాడుకుని ల‌క్ష‌ల్లో మోసం చేసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ సీసీఎస్ పోలీసులు ఈ కేసును న‌మోదు చేసి సీరియ‌స్‌గా విచార‌ణ సాగిస్తున్నారు.

శేఖ‌ర్ క‌మ్ముల అసిస్టెంట్‌ని అంటూ స‌ద‌రు చీట‌ర్ ఏకంగా ఒక్కొక్క‌రి నుంచి 1500- 1800 మ‌ధ్య వ‌సూలు చేశాడు. నేను శేఖ‌ర్ క‌మ్ముల అసిస్టెంట్‌ని. హ్యాపీడేస్‌, ఫిదా వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌కు ప‌ని చేశాను. తొంద‌ర్లోనే శేఖ‌ర్ క‌మ్ముల ప్రారంభించ‌బోయే సినిమాకి న‌టీన‌టులు కావ‌లెను.. అంటూ ఓ టాలీవుడ్ వెబ్‌సైట్‌లో స‌ద‌రు కేటుగాడు ప్ర‌క‌ట‌న ఇచ్చాడ‌ట‌. అంతేకాదు ఫ‌లానా బ్యాంక్ అకౌంట్లో సొమ్ములు వేసి క‌ల‌వాల్సిందిగా కోరాడ‌ట‌. దాదాపు 25 రోజుల పాటు ఆ యాడ్ లైవ్ అయ్యింది. అయితే దానిని నిజ‌మ‌ని న‌మ్మిన ప‌లువురు ఔత్సాహిక న‌టీన‌టులు ఆ అకౌంట్‌లో డ‌బ్బు డిపాజిట్ చేశారు. క‌ట్ చేస్తే అటువైపు చీట‌ర్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉడాయించాడ‌ట‌. దీంతో బాధితుల్లో కొంద‌రు నేరుగా శేఖ‌ర్ క‌మ్ముల‌నే సంప్ర‌దించారు. అయితే తాను సినిమా చేస్తున్న‌ట్టు కానీ, లేదా కొత్త సినిమా ప్ర‌క‌ట‌న ఇచ్చిన‌ట్టు కానీ శేఖ‌ర్ క‌మ్ముల చెప్ప‌క‌పోవ‌డంతో అంతా షాక్‌కి గుర‌య్యారు. స‌ద‌రు చీట‌ర్ చేసిన ప‌నికి శేఖ‌ర్ క‌మ్ముల‌కు మైండ్ బ్లాక్ అయిపోయిందిట‌. ప్ర‌స్తుతం క‌మ్ముల స‌ద‌రు ఫేక్ అసిస్టెంట్‌పై హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇంత‌కీ ఈ టోక‌రా బాబు ఎవ‌రో కానీ మా తెలివైన‌వాడే. గ‌జ‌క‌ర్ణ‌గోక‌ర్ణ విద్య‌ల్లో ఆరితేరిపోయిన దేశ‌దిమ్మ‌రుల‌కు సైతం బొమ్మ చూపించే టైప‌ని అర్థం చేసుకోవ‌చ్చు!

User Comments