2018-19 నా కెరీర్ బెస్ట్- సీనియర్ నరేష్

Last Updated on by

విలక్షణత.. వైవిధ్యం.. కొత్త కాన్సెప్టులు నెగ్గుకొస్తాయని ధీమాగా చెప్పే నటుడు సీనియర్ నరేష్. నవ్యపంథా స్క్రిప్టుల్ని .. నవతరం దర్శకులను ఎంకరేజ్ చేస్తూ.. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారాయన. సహాయనటుడిగా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన పుట్టినరోజు 20th. ఈ సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించారు.
కెరీర్‌లో జయాపయాలు కామన్. నాటి ఎన్టీఆర్ నుండి నేటి హీరోలు ఎవరికైనా గెలుపోటములు ఎదురవుతుంటాయి. ఐదారేళ్ల క్రితం మంచి హిట్ రాదా? అని అనుకున్న రోజులున్నాయి. అయితే నాలుగైదేళ్లుగా దృశ్యం సినిమా నుండి వరుసగా మంచి సినిమాలు వస్తున్నాయి. మంచి సినిమాలు, పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చి సినిమాలు చేస్త్తున్నాను. సక్సెస్ రేట్ పెరుగుతోంది. – క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వచ్చినప్పుడు ఎస్.వి.రంగరావుగారిని దృష్టిలో పెట్టుకున్నాను. ఓ తెలుగు నటుడు ఏ పాత్ర అయినా చేయగలడు.. అన్న ధీమా వచ్చింది. ఒకే జోనర్‌కి పరిమితం కాకుండా అన్నీ సినిమాలు చేయాలనుకున్నాను. నాకు వచ్చిన పాత్రలన్నీ అలా విభిన్నమైనవే వచ్చాయి. గత ఏడాది తెలుగు సినిమాకు వచ్చిన 10- 12 హిట్ చిత్రాల్లో 8 చిత్రాల్లో నేను నటించాను. మంచి పాత్రలు చేశాను. నాపై దర్శకులు, నిర్మాతలు పెట్టుకున్న నమ్మకం అది. శతమానం భవతి, రంగస్థలం, మహానటి, దేవదాస్, తొలిప్రేమ ఇలా మంచి మంచి సినిమాల్లో మంచి పాత్రల్లో నటించాను. సమ్మోహనం నాకు చాలా మంచి పేరు తెచ్చింది. అలాగే అరవింద సమేత వంటి సీరియస్ చిత్రంలో కామెడీ పార్ట్ నా పాత్రనే నడిపించింది. శైలజారెడ్డి అల్లుడులో మంచి పాత్ర చేశాను. 2018 నటుడిగా నా కెరీర్‌లో ఉత్తమమైనది. త్రివిక్రమ్, సుకుమార్ వంటి దర్శకులతో పాటు వెంకీ అట్టూరి, వెంకీ కుడుముల, నాగాశ్విన్ .. వంటి యువ దర్శకులు కూడా నాకు మంచి ప్రాధాన్యమున్న పాత్రలను ఇచ్చారు.
47 ఏళ్ల నటుడిగా ఎంతో అనుభవం వచ్చింది. క్రమశిక్షణతో పాటు, ఎటువంటి వివాదాల జోలికి వెళ్లకపోవడం అనేవి నటుడిగా నా సక్సెస్‌కు కారణమని భావిస్తున్నాను. పారితోషికం, ఇతర అంశాల కంటే మంచి సినిమా, మంచి పాత్ర పోషించడం.. వచ్చిన అవకాశానికి పూర్తి న్యాయం చేయడం, చిన్న బడ్జెట్ సినిమాలకు అందుబాటులో ఉండడం నా విధి. కెరీర్‌లో నెలకు 29రోజులు పనిచేసిన రోజులున్నాయి. సినిమా, టీవీతో పాటు, వెబ్ సిరీస్‌లో కూడా నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. మంచి వెబ్ సిరీస్ ఎంచుకుని అందులో నటిస్తాను. ఇకపై- కొంచెం సెలక్టివ్‌గా మంచి పాత్రలను ఎంచుకుంటున్నాను. ఈ ఏడాది కూడా మంచి పాత్రలతోనే స్టార్ట్ అయ్యింది. మల్లి జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తున్నాను. అలాగే ఫణిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. వీటితో పాటు మరో ఆరు సినిమాలు మాటల్లో ఉన్నాయి. కొత్త ఆలోచనలున్న కొత్త తరం దర్శకులు చాలా మంది ఇండస్ట్రీలోకి వస్తున్నారు. 2019 కూడా తెలుగు ఇండస్ట్రీకి చాలా బావుంటుంది.

User Comments