ప్ర‌భాస్ తో శంక‌ర్ సినిమా

Prabhas(File Photo)

బాహుబ‌లి సిరీస్‌ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. ఆ కాన్ఫిడెన్స్ తోనే  సాహో లాంటి భారీ చిత్రాన్ని నిర్మించి పాన్ ఇండియా కేట‌గిరిలో రిలీజ్ చేసారు. కానీ సాహో అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన సాహో ఫ‌లితం ప్ర‌భాస్ ని బాగా నిరుత్సాహానికి గురిచేసింది. దీంతో ఆ పెయిన్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికే కొంచెం స‌మ‌యం తీసుకున్నాడు. ఇటీవ‌ల వ‌రుస‌గా విదేశీ వెకేష‌న్స్ పేరుతో టూర్లు వెళుతున్నాడు. జిల్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో జాన్ సెట్స్ కి 2020 జ‌న‌వ‌రిలో జాయిన్ అవుతాడ‌న్న స‌మాచారం ఉంది. ఇది పిరియాడిక్ సినిమా గా తెర‌కెక్కుతోంది.

ప్ర‌భాస్ 20 జాన్ పూర్త‌య్యాక అత‌డు ఎవ‌రి దర్శ‌క‌త్వంలో న‌టిస్తాడు? అన్న‌ది ఇప్ప‌టికి ఇంకా స‌స్పెన్స్.తాజాగా ప్ర‌భాస్  గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైర‌ల్ అవుతోంది. సౌత్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్-ప్ర‌భాస్  కాంబినేష‌న్ లో ఓ సినిమాకి స‌న్నాహాలు సాగుతున్నాయ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఇటీవ‌లే ప్ర‌భాస్ కు శంక‌ర్ స్టోరీ వినిపించార‌ని అందుకు డార్లింగ్ ఒకే చెప్పార‌ని తెలుస్తోంది. క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ప్ర‌స్తుతం ఇండియ‌న్-2 తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా అనంత‌రం ప్ర‌భాస్ ప్రాజెక్ట్ ఉంటుంద‌ని స‌డెన్ గా ఓ వార్త గుప్పుమంది. ప్ర‌ఖ్యాత తెలుగు డెయిలీలో దీనిపై క‌థ‌నం రావ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ఆ సినిమాకు క్రేజ్ మామూలుగా ఉండ‌దు. ప్ర‌భాస్ తో సినిమాలు చేయాల‌ని బాలీవుడ్ ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు సైతం వేచి చూస్తున్నారు. రోహిత్ శెట్టి లాంటి స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌భాస్ ని హైదరాబాద్ లో క‌ల‌వ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. ఇదే టైమ్ లో శంక‌ర్ -ప్ర‌భాస్ కాంబినేషన్ అంటే ఊహాకే అంద‌ని విధంగా ఉంటుంది. మ‌రి ఇందులో నిజం ఎంత అన్న‌ది తెలియాల్సి ఉంది. గ‌తంలో శంక‌ర్  మ‌హేష్ బాబుతో ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేసాడు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆ ప్రాజెక్ట్ కుద‌ర‌లేదు. మ‌రి ఈసారి ప్ర‌భాస్ తో శంక‌ర్ కాంబినేష‌న్ కుదురుతుందా లేదా? అన్న‌ది చూడాలి.