సంచ‌ల‌నాల `శివ‌`కు 30 ఏళ్లు

కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా రాంగోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన `శివ` సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. ఇద్ద‌రి కెరీర్‌కి శివ ఓ మైల్‌స్టోన్. కాలేజ్ గొడ‌వ‌లు.. రౌడీయిజాన్ని 30 ఏళ్ల క్రిత‌మే వ‌ర్మ  ఆవిష్క‌రించారు. త‌న స్వీయానుభువాల‌కు సృజ‌నాత్మ‌క‌త‌ను జోడించి వెండి తెర‌పై అద్భుతంగా తెర‌కెక్కించాడు. క్యాంప‌స్ లో విద్యార్థుల ఘ‌ర్ష‌ణ‌లు… పొలిటిక‌ల్ గా ఎత్తుకు పై ఎత్తులు వేయ‌డం ఆ సినిమా క‌థ‌లో గ‌మ్మ‌త్త‌యిన గేమ్ ప్లే చేస్తుంది. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య అనుబంధం.. కో స్టూడెంట్ అమ‌ల‌తో నాగార్జున‌ ప్రేమాయ‌ణం .. వీట‌న్నిటినీ మించి ప్ర‌తి స‌న్నివేశంలో అద్భుత‌మైన ఎమోష‌న్ ని పండించాడు. అందుకే వ‌ర్మ నేటికి ఓ బ్రాండ్ గా కొన‌సాగుతున్నాడు.
ఎన్ని ప‌రాజ‌యాలున్నా శివ ఆర్జీవీకి చాలా స్పెష‌ల్. ఆ సినిమా స్ఫూర్తితో సినిమాల్లోకి వ‌చ్చిన న‌టీన‌టులు.. ద‌ర్శ‌కులు ఎంద‌రో. అప్పుడే హీరోగా ఎదుగుతోన్న నాగార్జున‌ను ఆ ఒక్క స‌క్సెస్ ఎవ‌రెస్ట్ శిఖ‌రంపై నిల‌బెట్టింది. హీరోయిజానికి కొత్త అర్ధాన్ని ప‌రిచయం చేసిన చిత్ర‌మిది.  అలాంటి క‌ల్ట్ క‌థ‌తో మ‌ళ్లీ వేరొక‌రు సినిమా చేయాలంటేనే ఎవ‌రూ సాహ‌సించ‌లేదు. అంత‌గా వ‌ర్మ తెర‌కెక్కించిన శివ ప్ర‌భావం ఉంది. ఇక ఈ చిత్రానికి ఇళ‌య‌రాజా సంగీతం మ‌రో ప్ర‌ధాన అస్సెట్ అయ్యింది. త‌నికెళ్ల భ‌ర‌ణి మాట‌లు మ‌రో హైలైట్. ఉత్తేజ్, జేడీ, చిన్నా వంటి న‌టులు ప‌రిచ‌యం అయ్యారు. ఈ సినిమా విడుద‌లై నేటికి ముప్పై ఏళ్లు పూర్త‌యింది. స‌రిగ్గా 1989 అక్టోబర్ 5న శివ‌ విడుదలైంది. ముప్పై ఏళ్ల నాటి జ్ఞాప‌కాల్ని ఆర్జీవీ, నాగార్జున‌ గుర్తు చేసుకున్నారు. నేడు మ‌న ప్రియ‌మైన బిడ్డ 30వ పుట్టిన రోజు అని నాగార్జున‌ ట్వీట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు.