నిర్మాతలు సినిమాలు బంద్ పెడతారట..!

Last Updated on by

ఇండ‌స్ట్రీలో పైకి క‌నిపించ‌ని యుద్ధాలు చాలానే జ‌రుగుతున్నాయి. ఓ వైపు డిజిట‌ల్ ప్రొవైడ‌ర్స్.. మ‌రోవైపు క్యూబ్.. ఇంకోవైపు నిర్మాత‌లు ఇలా ఎవ‌రికి వాళ్లు యుద్ధాలు చేస్తున్నారు. క్యూబ్ వాళ్లు చెబుతున్న రేట్లు మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌టంతో నిర్మాత‌ల‌కు అది పెద్ద‌గా గిట్టుబాటు కూడా కావ‌డం లేదు. వ‌చ్చే లాభాల్లో ఎక్కువ భాగం క్యూబ్ వాళ్ల‌కే వెళ్లిపోతుంద‌ని నిర్మాత‌ల భావ‌న‌. ఇప్ప‌టికే డిజిట‌ల్ స‌ర్విస్ ప్రొవైడ‌ర్స్, నిర్మాత‌ల మ‌ధ్య రెండు మీటింగ్ లు జ‌రిగాయి స‌ఫ‌లం కాలేదు. ఇక ఇప్పుడు మరోసారి బెంగ‌ళూర్ లో నిర్మాత‌ల సంఘంతో క్యూబ్ వాళ్లు భేటీ అయ్యారు.

దీనికి క్యూబ్ కో ఫౌండ‌ర్, లీడింగ్ డిఎస్పీ అయిన జ‌యేంద్ర ఈ మీటింగ్ గురించి చెప్పాడు. ఇందులో క్యూబ్ రేట్ 22 వేల నుంచి 14 వేల‌కు త‌గ్గించ‌డానికి ఒప్పుకున్నా కూడా నిర్మాత‌ల నుంచి స‌రైన నిర్ణ‌యం రాలేద‌ని.. వాళ్లు ఏం చెప్ప‌లేద‌ని అందుకే ఈసారి చ‌ర్చ‌లు కూడా విఫ‌లమ‌య్యాన‌ని చెప్పారు. మ‌రోవైపు నిర్మాత‌ల వాద‌న మ‌రోలా ఉంది. క్యూబ్ రేట్ల పేరుతో ఎక్కువ‌గా దోచేస్తున్నారంటున్నారు వాళ్లు. డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ వ‌ల్ల నిర్మాతల‌కే కాదు.. సినిమాల‌కు కూడా న‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని అందుకే రేట్లు కానీ వెంట‌నే త‌గ్గించ‌క‌పోతే వాళ్లు డిజిట‌ల్ కు కంటెంట్ ఇవ్వ‌డ‌మే మానేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇప్ప‌టికే మార్చ్ 1 నుంచి సినిమా విడుద‌ల‌లు ఆపేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు నిర్మాత‌లు. ఇది ఇటు నిర్మాత‌ల‌తో పాటు అటు క్యూబ్ వాళ్ల‌కు కూడా భారీ న‌ష్టాలు తీసుకొచ్చేదే. వారం రోజుల పాటు సినిమాలు ఆగినా కూడా చాలా న‌ష్టాలు వ‌చ్చేస్తాయి. ఇది క‌న్ఫ‌ర్మ్. మ‌రి ఈ న‌ష్టాల్ని ఎవ‌రు భ‌రిస్తారు అనేది ఇప్ప‌టికీ.. ఎప్ప‌టికీ తేల‌ని ఓ స‌మాధానం లేని ప్ర‌శ్నే. కొన్నేళ్లుగా తెలుగుతో పాటు అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ డిజిట‌ల్ సేవలు బాగా ఎక్కువ అయిపోయాయి. ఒకప్పుడు బాక్సుల్లో వ‌చ్చే సినిమాలు ఇప్పుడు అస‌లు క‌నిపించ‌ట్లేదు. దాంతో క్యూబ్ ల‌దే రాజ్యం అయిపోయింది. ఇదే ఇప్పుడు వీళ్ల బిజినెస్ కు.. హ‌ద్దు అదుపు లేని రేట్ల‌కు ఊతం ఇస్తుంది. మ‌రిప్పుడు నిర్మాత‌లు తీసుకున్న నిర్ణ‌యంతో ఇండ‌స్ట్రీ ఎటువైపు వెళ్తుందో చూడాలి..!

User Comments