కీర్తిసురేష్ ని న‌లిపేస్తోన్న స్టార్స్..

ఒక్కోసారి హీరోల క‌న్ను ప‌డితే అంతే..! ప‌ట్టించుకోన‌పుడు ఎవ‌రూ ప‌ట్టించుకోరు.. కానీ ఒక్క‌సారి ఓ స్టార్ అవ‌కాశం ఇచ్చాడంటే చాలు.. అంద‌రి క‌ళ్లు ఆమెపైనే ఉంటాయి. ఇప్పుడు కీర్తిసురేష్ కు కూడా ఇదే జ‌రుగుతుంది. అవ‌కాశాలు లేక కొంద‌రు ఏడుస్తుంటే.. ఈమె ఎక్కువై ఏడుస్తుంది. ఎవ‌రికి డేట్స్ ఇవ్వాలో.. ఎప్పుడు ఇవ్వాలో తెలియ‌క పాపం కీర్తిసురేష్ ఇరుక్కుపోయింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాకు కూడా స‌రైన డేట్స్ ఇవ్వ‌లేక ఇబ్బంది ప‌డుతుంది కీర్తి. ఇందులో ఈ భామ త‌ప్పేం లేదు. ఇచ్చిన‌పుడు వాళ్లే స‌రిగ్గా వాడుకోలేదు. దాంతో వాళ్ల‌కు కావాల్సిన టైమ్ లో కీర్తిసురేష్ త‌న డేట్స్ ఇవ్వ‌లేక‌పోతుంది ఈ ముద్దుగుమ్మ‌.

ఈ కేర‌ళ‌కుట్టికి గోల్డెన్ టైమ్ న‌డుస్తుంది ఇప్పుడు. కాస్త లేట్ గా అయినా తెలుగు ఇండ‌స్ట్రీపై ఫోక‌స్ పెట్టింది ఈ బ్యూటీ. నేను శైల‌జ‌తో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కీర్తి చుట్టూనే ఇప్పుడు మ‌న స్టార్ హీరోలు కూడా తిరుగుతున్నారు. ఈ మ‌ధ్యే నేను లోక‌ల్ తో మ‌రో సూప‌ర్ హిట్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాలోనూ త‌న క్యూట్ యాక్టింగ్ తో కుర్రాళ్ల మ‌తులు పోగొట్టేసింది కీర్తిసురేష్. ఇన్నాళ్లు చిన్న హీరోల‌తో స‌రిపెట్టుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు స్టార్స్ పై క‌న్నేసింది. పైగా స్టార్స్ కూడా త‌మ సినిమాల్లో అవ‌కాశాలు ఇస్తున్నారు. పైగా ఇప్పుడు అమ్మాయిగారు రెమ్యున‌రేష‌న్ కూడా పెంచేసారు.

ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్-త్రివిక్ర‌మ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తుంది కీర్తిసురేష్. జ‌న‌వ‌రి 10న ఈ చిత్రం విడుద‌ల కానుంది. దీనికి తోడు సూర్య-విఘ్నేష్ శివ‌న్ సినిమాలోనూ ఈమె హీరోయిన్. ఈ చిత్రం కూడా సంక్రాంతికే విడుద‌ల కానుంది. బ‌న్నీ-లింగుస్వామి సినిమాలోనూ కీర్తిసురేష్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇది బై లింగువ‌ల్ ప్రాజెక్ట్.. అందుకే రెండు భాష‌ల్లో ఇమేజ్ ఉన్న కీర్తినే హీరోయిన్ గా తీసుకున్నారు.

ఇక సీక్వెల్ హీరోయిన్ గానూ కీర్తిసురేష్ కు పేరుంది. విక్ర‌మ్-హ‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న‌ సామి 2.. లింగుస్వామి-విశాల్ పందెంకోడి 2ల్లో కీర్తిసురేష్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసారు. ఇలా వ‌ర‌స‌గా స్టార్ హీరోల సినిమాల్లో అవ‌కాశాలు అందుకుంది కాబ‌ట్టే ఇంత‌మందికి ఒకేసారి డేట్స్ ఇవ్వ‌డానికి క‌ష్ట‌మైపోతుంది. అయినా ఎవ‌రికీ ఏ స‌మ‌స్యా రాకుండా మేనేజ్ చేయ‌డం కూడా గొప్ప విష‌య‌మే క‌దా..! ఆ విష‌యంలో కీర్తిసురేష్ ను మెచ్చుకోవాల్సిందే..!