బాలీవుడ్ పై కన్నేసిన దిల్ రాజు..!

 

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా, లక్కీ హ్యాండ్ గా దూసుకుపోతున్న దిల్ రాజు ప్రస్తుతం వరుస బ్లాక్ బాస్టర్స్ తో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో డిస్ట్రిబ్యూటర్ గా కొద్దిగా నష్టాలు ఎదురైనా.. ఓవరాల్ గా చూసుకుంటే, దిల్ రాజు ఈ ఏడాది టాప్ లోనే ఉన్నారని చెప్పొచ్చు. ఇక ఇప్పుడేమో ఆ టాప్ దెబ్బ బాలీవుడ్ కు కూడా రుచి చూపించాలని దిల్ రాజు డిసైడ్ అయినట్లు వార్తలు వస్తుండటం విశేషం. అంటే, ఇప్పటివరకు నార్త్ ఊసే ఎత్తని దిల్ రాజు.. ఇప్పుడు బాలీవుడ్ లో ఓ బడా నిర్మాణ సంస్థతో కలిసి హిందీ సినిమాలు నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలియడం ఇంట్రెస్టింగ్ గా మారింది.
అంతేకాకుండా దిల్ రాజు తనదైన పక్కా ప్లానింగ్ తోనే ఇప్పుడు అక్కడ అడుగుపెడుతున్నారని.. ప్రయోగాలు చేయకుండా ఇక్కడ హిట్ అయిన తన కథలనే అక్కడ తెరకెక్కించి సక్సెస్ అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారని తెలియడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తంగా తనకు ఇక్కడ హిట్ ఇచ్చిన కథల్నే హిందీలో రీమేక్ చేసే కత్తిలాంటి ఆలోచనను దిల్ రాజు అమలు చేయబోతుండటం విశేషమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు దిల్ రాజు లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ శేఖర్ కమ్ముల ‘ఫిదా’ తోనే బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి తొలి మెట్టుగా వాడుతున్నారని తెలియడం ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.
అందులోనూ ఈ ఫిదా సినిమాను ఇప్పుడు పంజాబ్ బ్యాక్ డ్రాప్ లో బాలీవుడ్ లో రీమేక్ చేసేలా చర్చలు జరుగుతున్నాయని.. ఈ ప్రాజెక్టుతోనే దిల్ రాజు బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని గుసగుసలు వినిపిస్తుండటం గమనార్హం. అయితే, ఇప్పుడు దిల్ రాజు తో జతకట్టబోయే ఆ బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఏంటనేదే మాత్రం ప్రస్తుతానికి సప్సెన్స్ గా మారింది. దీంతో త్వరలోనే దీనిపై దిల్ రాజు అధికారికంగా ఓ క్లారిటీ ఇస్తారని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి బాలీవుడ్ లో నిజంగా అడుగుపెడితే, అక్కడ ఈ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. అలాగే ఇక్కడి సక్సెస్ ఫుల్ కథలు నార్త్ వాళ్ళను ఏ రేంజ్ లో మెప్పిస్తాయో కూడా చూడాల్సిందే.