టీజ‌ర్ టాక్: స‌్టైలిష్‌ పుంజులా దిగాడు

జ‌న‌వ‌రి 12 రిలీజ్ ల‌క్ష్యంగా బ‌న్ని- త్రివిక్ర‌మ్ బృందం `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమాని రెడీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌మోష‌న్స్ ని యూనిక్ స్టైల్లో ప్లాన్ చేసింది చిత్ర‌బృందం. పోటీదారుకు ఏమాత్రం రిలీఫ్ ని ఇవ్వ‌కుండా బ‌న్ని టీమ్ దూసుకెళుతోంది. పోస్ట‌ర్లు.. లిరిక‌ల్ వీడియోలు.. టీజ‌ర్లు అంటూ బోలెడంత హంగామా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ రిలీజైంది. టీజ‌ర్ ఆద్యంతం బ‌న్ని గ్లింప్స్ ఆక‌ట్టుకున్నాయి. కొడ‌వ‌లి హీటెక్కించి సిగ‌రెట్ వెలిగించినా.. ఇప్పుడు క్యారెక్ట‌ర్ లోకి దిగాను అంటూ కోడి పుంజును చేత్తో చూపిస్తున్నా బ‌న్ని స్టైలే వేరు. చిన్న టీజ‌ర్ లోనే అల పాత్ర‌ధారి పూజా హెగ్డే, సుశాంత్, సునీల్, ముర‌ళి శ‌ర్మ‌, స‌ముదిర‌క‌ని, జ‌య‌రామ్.. ఇంత‌మందిని దించేశారు. టీజ‌ర్ లో స్టైలిష్ రివెంజ్ ఫార్ములాని ఎంతో అందంగా చూపించారు. ప్ర‌తి బిట్టు మిస్ కాకూడ‌దు అన్నంత అందంగా ఈ టీజ‌ర్ ని క‌ట్ చేశారు. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర్వాత హ్యాట్రిక్ కొట్ట‌డ‌మే ధ్యేయంగా త్రివిక్ర‌ముడు ఈ చిత్రాన్ని చెక్కుతున్నార‌నే అర్థ‌మవుతోంది.

“మీ నాన్న పెళ్లికూతురుని దాచిన‌ట్టు దాచారు.. స‌రిగా చూడ‌లేదెప్పుడూ… ముందుకు రా..“ అంటూ డైలాగ్ తోనే సినిమాలో ట్విస్టేంటో చెప్పేశాడు ద‌ర్శ‌కుడు. బ‌న్ని మాసు క్లాసు క్యారెక్ట‌ర్ల‌లోనే ఉంది అస‌లైన స‌స్పెన్స్. `నా పేరు సూర్య` త‌ర్వాత త‌ప్ప‌నిస‌రిగా హిట్ కొట్టాల్సిన స‌మ‌యంలో త్రివిక్ర‌మ్ తో క‌లిసి బ‌న్ని మ్యాజిక్ చేయ‌బోతున్నాడ‌న్న సంకేతం అందుతోంది. చిన్న టీజ‌ర్ తోనే ఇంత చేశాడు. పూర్తి ట్రైల‌ర్ తో ఇంకెంత చూస్తాడో చూడాలి.