2.0 వ‌చ్చేద‌ప్పుడే.. వాళ్ల‌కు బ్యాండ్ బాజా.. 

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ అంటేనే ఓ సంచ‌ల‌నం. ఈయ‌న పేరు వినిపిస్తే రికార్డులు చెదిరిపోతాయి. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న 2.0 సినిమా జ‌న‌వ‌రిలో వ‌స్తుంద‌నుకున్నారంతా. కానీ ఏప్రిల్ 13కి పోస్ట్ పోన్ అయింది. దాంతో సంక్రాంతి హీరోల టెన్ష‌న్ కాస్తా స‌మ్మ‌ర్ వైపు వెళ్లింది. 2.0 డ‌బ్బింగ్ సినిమానే అయినా అక్క‌డ శంక‌ర్ లాంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఉన్నాడు.. ఆయ‌న‌కు తోడుగా ర‌జినీ ఉన్నాడు. ఈ కాంబినేష‌న్ చాలు ఇక్క‌డ కూడా రికార్డులు తిర‌గ‌రాయ‌డానికి. ఇంత‌కీ తెలుగులో 2.0 హ‌క్కులు ఎంతో తెలుసా..? దాదాపుగా 88 కోట్లు. అవును.. మ‌న తెలుగు సినిమాల‌కు కూడా ఈ స్థాయి రేట్లు ఎప్పుడూ పెట్ట‌లేదు. కానీ ర‌జినీకాంత్, శంక‌ర్ ఉన్నాడ‌నే ధైర్యంతో 2.0ను అన్ని కోట్ల‌కు కొన్నారు. ఏడేళ్ల కింద వ‌చ్చిన రోబోని అప్ప‌ట్లోనే 29 కోట్లు పెట్టి కొన్నారు.

విఎఫ్ఎక్స్ జాప్యం కార‌ణంగా జ‌న‌వ‌రిలో రావాల్సిన సినిమా కాస్తా ఇప్పుడు ఏప్రిల్ కు వెళ్లిపోయింది. ఉన్న‌ట్లుండి ర‌జినీ వ‌స్తున్నాడ‌ని తెలియ‌డంతో ఇప్పుడు స‌మ్మ‌ర్ హీరోల‌కు జ్వ‌రం ప‌ట్టుకుంది. ఏప్రిల్ 27న బ‌న్నీ నా పేరు సూర్య‌.. మ‌హేశ్ భ‌ర‌త్ అనే నేను విడుద‌ల కానున్నాయి. ఈ రెండు సినిమాల‌పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ర‌జినీ ఎంట్రీతో ఇద్ద‌రికి టెన్ష‌న్ త‌ప్ప‌ట్లేదు. ఎంతైనా ర‌జినీకాంత్ క‌దా.. పైగా ఆయ‌న సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తే.. ఆ ప్ర‌భావం నెల రోజులైనా ఉంటుంది. గ‌తంలో ఖ‌లేజా సినిమాకు రోబో కొట్టిన దెబ్బ ఇంకా ప‌చ్చిగానే ఉంది. అది మ‌రిచిపోక ముందే ఇప్పుడు 2.0తో వ‌స్తున్నాడు ర‌జినీకాంత్. 2.0కు మ‌హేశ్, బ‌న్నీ సినిమాల‌కు రెండు వారాలు గ్యాప్ ఉంటుంది. మొత్తానికి ఈ స‌మ్మ‌ర్ స‌మ‌రం భ‌లే ఆస‌క్తిక‌రంగా మారింది.