దేవుడా.. సునీల్ మ‌ళ్లీ హీరోగా..!

Last Updated on by

ఒక్క‌సారి యు ట‌ర్న్ తీసుకున్నాడు క‌దా.. మ‌ళ్లీ హీరోగా ఎందుకు న‌టిస్తున్నాడు అనుకుంటున్నారా..? ఏమో అల‌వాటు ప‌డిన ప్రాణం క‌దా.. క‌థ న‌చ్చితే మ‌ళ్లీ హీరోగా న‌టిస్తాన‌ని ఈ మ‌ధ్యే చెప్పిన సునీల్ ఇప్పుడు ఇదే చేయ‌బోతున్నాడు. ఇప్పుడు వ‌ర‌స‌గా క‌మెడియ‌న్ పాత్ర‌ల‌తో బిజీగా మారిన ఈ భీమ‌వ‌రం బుల్లోడు మ‌రోసారి హీరోగా రిట‌ర్న్ అవుతున్నాడు. అది కూడా ఇప్పుడు ఫ్లాపుల్లో ఉండి.. ఒక‌ప్పుడు త‌న‌కు హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడితో. 2012లో పూల‌రంగ‌డుతో సునీల్ కు అదిరిపోయే హిట్ ఇచ్చాడు వీర‌భ‌ద్రం చౌద‌రి.

నిజానికి ఇద్ద‌రి కెరీర్ కు ఇదే చివ‌రి విజ‌యం. ఆ త‌ర్వాత ఇద్ద‌రి కెరీర్స్ గాడిత‌ప్పాయి. ఎన్ని సినిమాలు చేసినా సునీల్ కు హిట్ రాలేదు.. భాయ్ లాంటి సినిమాతో నాగ్ ఆఫ‌ర్ ఇచ్చినా వీర‌భ‌ద్రం కూడా హిట్ కొట్ట‌లేక‌పోయాడు. ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు ఇద్ద‌రూ క‌లిసి మ‌రో సినిమా చేయ‌బోతున్నార‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే సునీల్ కు వీర‌భ‌ద్రం క‌థ చెప్ప‌డం.. ఈయ‌న ఓకే చెప్ప‌డం కూడా జ‌రిగిపోయాయి. ప్ర‌స్తుతం నిర్మాత‌ను వెతికే ప‌నిలో ఉన్నారు. హీరో సంగ‌తి ప‌క్క‌న‌బెడితే క‌మెడియ‌న్ గా సునీల్ బిజీ అయిపోయాడు. అల్ల‌రి న‌రేష్-భీమినేని.. ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్.. ర‌వితేజ‌-శీనువైట్ల సినిమ‌ల్లో న‌టిస్తూ బిజీబిజీగా ఉన్నాడు సునీల్. మ‌రి.. ఇలాంటి స‌మ‌యంలో మ‌ళ్లీ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి ఏం చేస్తాడో ఈ పూల‌రంగ‌డు.

User Comments