సునీల్ కు ఆయ‌న లైఫ్ ఇస్తాడా..? 

అస‌లే ఇప్పుడు వ‌ర‌స ఫ్లాపుల‌తో కెరీర్ లో ఎటు వెళ్లాలో తెలియ‌ని సిచ్యువేష‌న్ లో ఉన్నాడు సునీల్. ఈయ‌న‌తో సినిమా అంటే నిర్మాత‌ల‌కు కూడా ఇప్పుడే స‌న్న‌గా వ‌ణుకు మొద‌లైపోతుంది. అస‌లు నెక్ట్స్ ఏంటి అనే ఊహ‌ల్లోకి కూడా వెళ్లిపోయాడు సునీల్. 2 కంట్రీస్ రీమేక్ షూటింగ్ పూర్తై రెండు నెల‌లు గడుస్తున్నా మ‌రో సినిమా ఒప్పుకోలేదు సునీల్. ఇలాంటి స‌మ‌యంలో ఓ ఫ్లాప్ ద‌ర్శ‌కున్ని న‌మ్ముకుంటున్నాడు సునీల్. ఆయ‌న మ‌రెవ‌రో కాదు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్. అవును.. రాజ‌మౌళి తండ్రితో సునీల్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈయ‌న చెప్పిన క‌థ బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేసాన‌ని చెప్పాడు.

ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌యేంద్రప్ర‌సాద్ కు ద‌ర్శ‌కుడిగా ఒక్క విజ‌యం కూడా లేదు. ఈయ‌న రైట‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు కానీ ద‌ర్శ‌కుడిగా మాత్రం స‌క్సెస్ కాలేక‌పోయాడు. రాజ‌న్న‌, శ్రీ‌కృష్ణ 2006.. ఈ మ‌ధ్యే శ్రీ‌వ‌ల్లి కూడా డిజాస్ట‌ర్లుగానే నిలిచాయి. ద‌ర్శ‌కుడిగా తొలి విజ‌యం కోసం చూస్తోన్న ఈయ‌న సునీల్ ను న‌మ్ముకుంటున్నాడు. మ‌రోవైపు సునీల్ కూడా బాహుబ‌లి రైట‌ర్ కాబ‌ట్టి మ‌రో ఆలోచ‌న లేకుండా విజ‌యేంద్ర ప్ర‌సాద్ చెప్పిన క‌థకు ఓకే చెప్పాడు. అయితే ఇక్క‌డే మ‌రో వార్త కూడా వినిపిస్తుంది. సునీల్ సినిమాకు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ మాత్రమే ఇస్తున్నాడ‌ని.. ద‌ర్శ‌కుడిగా మ‌రొక‌రు ఉంటార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది. మ‌రి తానే ఇప్ప‌టి వ‌ర‌కు ద‌ర్శ‌కుడిగా స‌క్సెస్ కాలేదు.. అలాంటి విజ‌యేంద్రుడు సునీల్ కు విజ‌యాన్నిస్తాడా..?

Follow US